సీఎం వ్యాఖ్యలు అధిష్టానం కుట్రలో భాగమే: బాజిరెడ్డి గోవర్ధన్
సీఎం వ్యాఖ్యలు అధిష్టానం కుట్రలో భాగమే: బాజిరెడ్డి గోవర్ధన్
Published Sat, Aug 10 2013 2:04 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
కాంగ్రెస్ అధిష్టానం రచించిన కుట్రలో భాగంగా, ఒక పథకం ప్రకారమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న తొమ్మిది రోజుల తర్వాత హఠాత్తుగా వైఎస్‌పై అభాండాలు వేసి పారిపోవడం.. సీఎం దివాలాకోరుతనాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గోవర్ధన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఒక తండ్రిలా అన్ని ప్రాంతాలకు సమన్యాయం పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విషయాలనే... ప్రస్తుతం సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఇతర నేతలందరూ అనుసరిస్తున్నారని పేర్కొన్నారు.
రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ అధిష్టానం నీచమైన ఆదేశాలిస్తోంటే.. రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నేతలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నారని మండిపడ్డారు. ‘‘సీఎం కుర్చీలో కూర్చున్న కిరణ్ ఒక ప్రాంతానికి అన్యాయం జరిగిందంటారు. అలా చేసింది ఎవరు? నిర్ణయం వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడేకంటే.. ముందే ఎందుకు హెచ్చరించలేదు. మీ పార్టీని ఎదిరించే దమ్ము, ధైర్యం లేదా?’’ అని గోవర్ధన్ ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీని దెబ్బతీయడం కోసమే సీఎం కిరణ్.. వైఎస్ పేరును ప్రస్తావించారని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.
‘‘టీఆర్‌సీసీ కన్వీనర్ జి.చిన్నారెడ్డి ఆధ్వర్యంలో 42 మంది ఎమ్మెల్యేలు 2001లో సోనియాగాంధీకి వినతిపత్రం ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు హయాంలో తెలంగాణలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వరుస కరువులతో పాటు విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండేది. అప్పుడు వెళ్లిన 42 మంది ఎమ్మెల్యేల్లో నేను కూడా ఉన్నాను. సోనియాగాంధీకి వినతి పత్రం ఇచ్చినప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నది. అదంతా వైఎస్ వల్లే జరిగి ఉంటే 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు ఇవ్వలేదు’’ అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్ ప్రాబల్యం తగ్గించడం.. సీమాంధ్రలో బలంగా ఉన్న వైఎస్సార్‌సీపీని దెబ్బతీయడం కోసం కాంగ్రెస్ అధిష్టానం రచించిన కుట్రలో భాగంగానే సీఎం కిరణ్ వైఎస్ పేరును ప్రస్తావించారని పేర్కొన్నారు.
Advertisement