Baji Reddy Goverdhan
-
ఒక్క క్లిక్‌తో ఈజీగా బస్సు జాడ
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు బయలుదేరే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తాము బయలుదేరి వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో మొబైల్ ఫోన్లో తెలుసుకొనే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ‘టీఎస్ ఆర్టీసీ బస్ ట్రాకింగ్’యాప్‌ను వినియోగంలోకి తెచ్చింది. ప్రయాణికులు గూగుల్ ప్లే స్లోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని బస్సు జాడ తెలుసుకోవచ్చు. ప్రస్తుతం బుకింగ్ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్ వివరాలతోపాటు బస్ ట్రాకింగ్ లింక్‌ను కూడా అధికారులు ఎస్సెమ్మెస్ రూపంలో పంపిస్తున్నారు. ఆ లింక్‌పై క్లిక్ చేయగానే బస్సు ఎక్కడుందో ప్రయాణికులు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ట్రాకింగ్ యాప్ వివరాల ఆధారంగా బస్సు వచ్చే సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు. ‘‘ప్రస్తుతం ముందస్తు రిజర్వేషన్ చేసుకునే 1,800 బస్సు సర్వీస్‌లకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించాం. సంక్రాంతి సందర్భంగా రిజర్వేషన్ సౌకర్యం ఉన్న 600 ప్రత్యేక బస్సులకు కూడా ట్రాకింగ్ సౌకర్యాన్ని అనుసంధానం చేశాం. త్వరలో హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్ప్రెస్లుసహా మిగిలిన సర్వీస్‌లకు ట్రాకింగ్ సదుపాయం కల్పిస్తాం. ఒక్క క్లిక్‌తో బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు’’అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. ►గూగుల్ ప్లేస్టోర్ నుంచి, టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ►ఈ యాప్‌లో ప్రయాణికులు వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ►హైదరాబాద్ నగరంతోపాటు జిల్లా సర్వీస్‌లకు సంబంధించిన సమాచారాన్ని వేర్వేరుగా పొందుపర్చారు. ►ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే బస్సుల వివరాలతోపాటు అవి ప్రస్తుతమున్న లొకేషన్‌ను తెలుసుకోవచ్చు. ►ప్రయాణికులు సమీపంలోని బస్టాప్, సర్వీస్, బస్సు నంబర్లను ఎంటర్ చేసి వివరాలను పొందవచ్చు. ►అత్యవసర పరిస్థితులు తలెత్తితే రిపోర్ట్ చేసే సదుపాయాన్ని ఈ యాప్‌లో కల్పించారు. ►బస్సు బ్రేక్‌డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. -
బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ విమర్శించారు. మండల్ కమిషన్ రిజర్వే షన్లు అడ్డుకునేందుకు కమండల్ యాత్ర చేసిన చరిత్ర ఆ పార్టీకి ఉందని ధ్వజమె త్తారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవి చంద్ర ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు జరిపించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, జాజుల సురేందర్, కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఓటమిని జీర్ణించుకోలేక అమిత్ షా, బండి సంజయ్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీసీలపై బీజేపీ చేస్తున్న దాడులను దేశం దృష్టికి తీసుకెళ్తా మని, ఇతర పార్టీలను కలుపుకుని పోరాటం చేస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీసీ వ్యాపార వేత్తలను రాజకీయంగా ఎదగకుండా బీజేపీ కుట్ర చేస్తోందని సురేందర్ ఆరో పించారు. మోదీ రామగుండం పర్యటనపై నిరసనలు వ్యక్తమవుతున్న నేప థ్యంలో బీజేపీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని చందర్ అన్నారు. -
డ్రైవర్లు, కండక్టర్లే ఆర్టీసీ రథసారథులు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు డ్రైవర్లు, కండక్టర్లే రథసారథులని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సమష్టికృషితోనే సత్ఫలితాలను సాధించగలమని చెప్పారు. సిబ్బందిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పునశ్చరణ తరగతులు ఎంతో దోహదంచేస్తాయన్నారు. మంగళవారం ఆయన హకీంపేట్‌లోని ట్రాన్స్‌పోర్టు అకాడమీని సందర్శించారు. జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో సిబ్బందికి ఏర్పాటు చేసిన పునశ్చరణ తరగతులను పరిశీలించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఓఅండ్ఏ) యాదగిరి, అకాడమీ ప్రిన్సిపాల్ సుచరితలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్, కండక్టర్లతో పాటు మెకానికల్ సూపర్వైజర్లకు ఇస్తున్న శిక్షణ తీరును చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. అత్యధిక కేఎంపీఎల్ (7) సాధించిన డ్రైవర్ బి.డి. రెడ్డి, మెరుగైన ఈపీకే (38) సాధించిన కండక్టర్ గీతారమణిలను ఆయన అభినందించారు. ప్రయాణికుల ఆదరాభిమానాలను పొందితే నష్టాలను అధిగమించి లాభాల బాటలో పయనించవచ్చని చెప్పారు. ప్రతి బస్సులో ఆక్యుపెన్సీ పెంచుకొనేందుకు కృషి చేయాలన్నారు. రవాణా రంగంలో నెలకొన్న పోటీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందజేయాలన్నారు. సంస్థ ఆర్థిక స్థితి పుంజుకుంటున్న సంకేతాలు కని్పస్తున్నాయని, సరికొత్త ప్రణాళికలను అమలు చేయడానికి బాట వేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి మాట్లాడుతూ, కోవిడ్‌తో కుదేలైన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నారు. -
కూటమికి ఓటేస్తే అంధకారమే: ఎంపీ కవిత
సాక్షి, డిచ్పల్లి/మోపాల్: ప్రజా కూటమి పేరుతో వచ్చే అభ్యర్థులకు ఓటు వేస్తే రాష్ట్రాన్ని మరోసారి అంధకారంలోకి నెడతారని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. మహా కూటమి కాదు.. మాయల కూటమి అని దుయ్యబట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ఎన్నికల్లో ఏం పని అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా ఎంపీ కవిత సోమవారం డిచ్పల్లి, మోపాల్ మండలాల్లోని మిట్టాపల్లి, సారంగపూర్‌లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు అనైతికమని విమర్శించారు. తెలంగాణపై అధికారం చెలాయించడానికి చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడితే మళ్లీ అధికారం ఆంధ్రోళ్ల చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలనలో అరవై ఏండ్లు గోస పడ్డాం. మళ్లీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన ధర్మాబాద్ తదితర 40 గ్రామాల సర్పంచులు తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని గతంలో బాజిరెడ్డి గోవర్ధన్‌ను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రూరల్‌లో ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని, సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునే వారికి రూ.5లక్షలు ఇస్తామని తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉండటం చూసి ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీ నాయకులు కూటమి కట్టి టీఆర్ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్దిని చూసి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం గొల్లకుర్మలు ఎంపీ కవిత, ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు గొర్రె పిల్లలను కానుకగా అందజేశారు. మాజీ జెడ్పీటీసీ దినేశ్‌కుమార్, ఎంపీపీ దాసరి ఇందిర, ఎంపీటీసీ సవిత, టీఆర్ఎస్ మం డల అధ్యక్ష, కార్యదర్శులు శక్కరికొండ కృష్ణ, ఒడ్డెం నర్సయ్య, లక్ష్మీనర్సయ్య, నేతలు రాజు, బాల గంగాధర్, గోపు వెంకన్న, గంగరత్నం, సాయిలు, సత్యనారాయణ, గోపు రవీందర్, శ్రీనివాస్‌గౌడ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
సాక్షి,మోపాల్: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో అమల్జేసిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయని ఆ పార్టీ నిజామాబాద్‌రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవ ర్ధన్ అన్నారు. శుక్రవారం మండలంలోని కాల్పోల్ మాజీ సర్పంచ్ బర్మల్ టీఆర్ఎస్లో చేరారు. అనతరం ఆయన మాట్లాడారు. అనంతరం మం డలంలోని బోర్గాం(పి) గ్రామంలో టీఆర్ఎస్ పా ర్టీ కార్యాలయాన్ని యువ నాయకులు బాజిరెడ్డి జ గన్ ప్రారంభించారు. మండలంలోని ఖానాపూర్, భాగ్యనగర్ కాలనీలోగల కుల సంఘాల నాయకులు బాజిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. డిచ్పల్లి: సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ది పనులు చూసి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తదితర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం డిచ్పల్లి మండల కేంద్రంలోని సాక్షి యూనిట్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ సభా స్థలాన్ని బాజిరెడ్డి పరిశీలించారు. అనంతరం యానంపల్లి, మెంట్రాజ్‌పల్లి, సాంపల్లి, బర్థిపూర్ గ్రామాలకు చెందిన పలువురు బాజిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. సిరికొండ: బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్ధతుగా కొండాపూర్‌లో బాజిరెడ్డి చిన్న కుమారుడు అజయ్, ఎంపీపీ మంజుల ప్రచారం చేశారు. జక్రాన్‌పల్లి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని గత నాలుగున్నరేళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, మీకు సేవ చేయడానికి నన్ను మరోసారి ఆశీర్వదించండని టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్సీ వీజీగౌడ్‌తో కలిసి బాజిరెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ధర్పల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని బాజిరెడ్డి తనయుడు జగన్ శుక్రవారం చల్లగరిగె, దుబ్బాక, రేకులపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
‘విశ్వ’వేదికపై నిలబెడతాం
సాక్షి, ఇందల్వాయి(నిజామాబాద్): కులవృత్తులు కనుమరుగై నిలకడైన ఆదాయం లేక దుర్భర జీవితాలు గడుపుతున్న విశ్వబ్రహ్మణులను టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి విశ్వ వేదికపై నిలబెడతామని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సోమవారం రాంపూర్ గ్రామ శివారులో జరిగిన రూరల్ విశ్వబ్రాహ్మణ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో బాజిరెడ్డి మాట్లాడారు. విశ్వబ్రాహ్మణుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్, ఎంపీ కవితతో మాట్లాడి ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు. విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా ఎదిగేందుకు జిల్లాలో నామినేటెడ్ పదవులను కేటాయిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో కేటీఆర్ సహకారంతో కుటిర పరిశ్రమలు ఏర్పాటు చేసి పనులు కోల్పోయిన విశ్వబ్రాహ్మణులందరికీ పనిని కల్పిస్తామన్నారు. కల్యాణ మండపాలకు రూ.25 లక్షలు, గ్రామాల్లో నిర్మించే కమ్యూనిటీ హాళ్లకు రూ.5 లక్షలు, బ్రహ్మంగారి ఆలయాలకు రూ.2 లక్షలు చెల్లిస్తే 10 లక్షల నిధులు అందేలా కృషి చేస్తామన్నారు. ఎన్నికల తర్వాత తాము పెట్టబోయే జాబ్‌మేళాలో అర్హతకు తగిన ఉద్యోగాలు అందరికీ అందేలా చేస్తామని, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందిస్తామని తెలిపారు. బ్రహ్మంగారి ఆలయ పూజారులకు దూపదీప నైవేద్యం పథకం వర్తింపు, రుణాల మంజూరు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ అమర వీరుడు శ్రీకాంతాచారికి నివాళులు అర్పించారు. జెడ్పీటీసీ తనూజ, మాజీ జెడ్పీటీసీ దినేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రమేశనాయక్, హన్మంత్‌రెడ్డి, నేతలు కలగర శ్రీనివాస్, ఫిలిప్, విశ్వ బ్రహ్మణ జిల్లా అధ్యక్షులు రామ్మోహనచారి, కోశాధికారి రాజులు, నరహరి, రమేష్, రాజేశ్వర్, రాంచందర్, వడ్ల శ్రీనివాస్, దర్శన్, సత్యనారాయణ, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
భూపతిరెడ్డికి అంత సీన్ లేదు
నిజామాబాద్ : టీఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి అంత సీన్ లేదని నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..తనకు ప్రజా మద్ధతు మెండుగా ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్, భూపతిరెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారని, అందులో భాగంగానే కుట్రలకు తెరలేపారని అన్నారు. భూపతిరెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని చెప్పారు. వీరి వ్యవహారాన్ని మొదట్లో కేసీఆర్ దృష్టికి ఎప్పుడూ తీసుకెళ్లలేదని, ఇద్దరూ కలిసి కుమ్మక్కై ఇప్పుడు తనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డీఎస్ ఢిల్లీలో కూర్చుని పార్టీని బెదిరిస్తుంటారని ఎద్దేవా చేశారు. భూపతిరెడ్డి చేసే ఆరోపణలు నిరాధారమని, నిజామాబాద్ రూరల్ ఎన్నికల్లో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణకు వ్యతిరేకం కాదు : బాజిరెడ్డి
తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బాజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల మారిన రాజకీయ పరిణామాలతో పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అపోహలను దూరం చేశారు. రానున్న రోజుల్లో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ విషయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు అవలంబిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చిన కాంగ్రెస్ మరోవైపు సీమాంధ్రలో ధర్నాలు, రాస్తారోకోలు చేయిస్తోందని విమర్శించారు. చంద్రబాబు కూడా తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే యూ టర్న్ తీసుకున్నారని ఆరో పించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూనే.. సీమాంధ్రలోని ఆ పార్టీ నేతలను ఉసిగొల్పుతున్నారని బాబుపై విమర్శలు గుప్పించారు. ప్రజలను మోసం చేస్తున్న ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అతిగా స్పందిస్తున్నారు.. తమ పార్టీ పట్ల కొన్ని పత్రికలు, చానళ్లు అతిగా స్పందిస్తున్నాయని బాజిరెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడే ఆ పార్టీని వీడిపోయినా పెద్దగా పట్టించుకోని కొన్ని పత్రికలు.. తమ పార్టీ నుంచి ఒకరిద్దరు నేతలే వెళ్లిపోయినా అత్యుత్సాహం చూపుతూ కథనాలు రాస్తున్నాయని, ఇందులో ఆంతర్యమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో తమ పార్టీని బలహీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పదవులు, స్వప్రయోజనాలు ఆశించి వచ్చిన ఒకరిద్దరు నేతలే పార్టీ మారుతున్నారన్నారు. వారికి ఆయా పార్టీల్లోనూ ఆశించిన స్థానం దక్కదని పేర్కొన్నారు. ఒకరిద్దరు నేతలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ బలహీనపడబోదన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారన్నారు. ఘన విజయం సాధిస్తాం.. ‘ఇందిరాగాంధీపైనా కేసులు బనాయించి జైలులో పెట్టారు.. కానీ ఆమె బయటకు రాగానే ఎన్నికల్లో గెలిచి దేశాన్ని పాలించారు. అలాగే మహానేత వైఎస్ అకాల మరణం తర్వాత తమ పార్టీ అధినేత జగన్‌ను కూడా తప్పుడు కేసులతో జైలులో పెట్టారు. ఆయన బయటకు వచ్చి ఘన విజయం సాధిస్తారు’ అని బాజిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమవేశంలో జుక్కల్ నియోజకవర్గ సమన్వయకర్త నాయుడు ప్రకాశ్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ సులోచన, యువజన విభాగం రాష్ట్ర నాయకుడు బాజిరెడ్డి జగన్, జిల్లా కన్వీనర్ కంఠం ధర్మరాజు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ పంచరెడ్డి చరణ్, అధికార ప్రతినిధులు రఫీక్‌ఖాన్, విజయలక్ష్మి, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, నాయకులు గంగాధర్, అనిల్ కులకర్ణి, పండిత్‌ప్రేమ్, రమాకాంత్, అరుణజ్యోతి, సునీత, భారతి, ఇస్మాయిల్, ప్రకాశ్, కె.నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం వ్యాఖ్యలు అధిష్టానం కుట్రలో భాగమే: బాజిరెడ్డి గోవర్ధన్
కాంగ్రెస్ అధిష్టానం రచించిన కుట్రలో భాగంగా, ఒక పథకం ప్రకారమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న తొమ్మిది రోజుల తర్వాత హఠాత్తుగా వైఎస్‌పై అభాండాలు వేసి పారిపోవడం.. సీఎం దివాలాకోరుతనాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గోవర్ధన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఒక తండ్రిలా అన్ని ప్రాంతాలకు సమన్యాయం పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చెప్పిన విషయాలనే... ప్రస్తుతం సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఇతర నేతలందరూ అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ అధిష్టానం నీచమైన ఆదేశాలిస్తోంటే.. రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నేతలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నారని మండిపడ్డారు. ‘‘సీఎం కుర్చీలో కూర్చున్న కిరణ్ ఒక ప్రాంతానికి అన్యాయం జరిగిందంటారు. అలా చేసింది ఎవరు? నిర్ణయం వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడేకంటే.. ముందే ఎందుకు హెచ్చరించలేదు. మీ పార్టీని ఎదిరించే దమ్ము, ధైర్యం లేదా?’’ అని గోవర్ధన్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీని దెబ్బతీయడం కోసమే సీఎం కిరణ్.. వైఎస్ పేరును ప్రస్తావించారని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ‘‘టీఆర్‌సీసీ కన్వీనర్ జి.చిన్నారెడ్డి ఆధ్వర్యంలో 42 మంది ఎమ్మెల్యేలు 2001లో సోనియాగాంధీకి వినతిపత్రం ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు హయాంలో తెలంగాణలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వరుస కరువులతో పాటు విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండేది. అప్పుడు వెళ్లిన 42 మంది ఎమ్మెల్యేల్లో నేను కూడా ఉన్నాను. సోనియాగాంధీకి వినతి పత్రం ఇచ్చినప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నది. అదంతా వైఎస్ వల్లే జరిగి ఉంటే 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు ఇవ్వలేదు’’ అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ప్రాబల్యం తగ్గించడం.. సీమాంధ్రలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీని దెబ్బతీయడం కోసం కాంగ్రెస్ అధిష్టానం రచించిన కుట్రలో భాగంగానే సీఎం కిరణ్ వైఎస్ పేరును ప్రస్తావించారని పేర్కొన్నారు.