విశ్వబ్రాహ్మణులను ఉద్దేశించి మాట్లాడుతున్న బాజిరెడ్డి
సాక్షి, ఇందల్‌వాయి(నిజామాబాద్): కులవృత్తులు కనుమరుగై నిలకడైన ఆదాయం లేక దుర్భర జీవితాలు గడుపుతున్న విశ్వబ్రహ్మణులను టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి విశ్వ వేదికపై నిలబెడతామని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సోమవారం రాంపూర్ గ్రామ శివారులో జరిగిన రూరల్ విశ్వబ్రాహ్మణ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో బాజిరెడ్డి మాట్లాడారు. విశ్వబ్రాహ్మణుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్, ఎంపీ కవితతో మాట్లాడి ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు. విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా ఎదిగేందుకు జిల్లాలో నామినేటెడ్ పదవులను కేటాయిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో కేటీఆర్ సహకారంతో కుటిర పరిశ్రమలు ఏర్పాటు చేసి పనులు కోల్పోయిన విశ్వబ్రాహ్మణులందరికీ పనిని కల్పిస్తామన్నారు.
కల్యాణ మండపాలకు రూ.25 లక్షలు, గ్రామాల్లో నిర్మించే కమ్యూనిటీ హాళ్లకు రూ.5 లక్షలు, బ్రహ్మంగారి ఆలయాలకు రూ.2 లక్షలు చెల్లిస్తే 10 లక్షల నిధులు అందేలా కృషి చేస్తామన్నారు. ఎన్నికల తర్వాత తాము పెట్టబోయే జాబ్‌మేళాలో అర్హతకు తగిన ఉద్యోగాలు అందరికీ అందేలా చేస్తామని, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందిస్తామని తెలిపారు. బ్రహ్మంగారి ఆలయ పూజారులకు దూపదీప నైవేద్యం పథకం వర్తింపు, రుణాల మంజూరు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ అమర వీరుడు శ్రీకాంతాచారికి నివాళులు అర్పించారు. జెడ్పీటీసీ తనూజ, మాజీ జెడ్పీటీసీ దినేశ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు రమేశనాయక్, హన్మంత్‌రెడ్డి, నేతలు కలగర శ్రీనివాస్, ఫిలిప్, విశ్వ బ్రహ్మణ జిల్లా అధ్యక్షులు రామ్‌మోహనచారి, కోశాధికారి రాజులు, నరహరి, రమేష్, రాజేశ్వర్, రాంచందర్, వడ్ల శ్రీనివాస్, దర్శన్, సత్యనారాయణ, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment