ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం (జీఓఎం)కు విజ్ఞప్తి చేసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన జీఓఎంతో భేటీ అయ్యారు. అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని రెండుగా విభజించినంత మాత్రాన ఇరుప్రాంతాల్లో నెలకొన్న అసమానతలు కానీ అభివృద్ధిలో ఏర్పడిన వ్యత్యాసాలు కానీ మారవని జోఓఎంకు తెలిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో సమస్యలు వస్తాయని జీఓఎంకు వివరించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ నెల 3వ తేదీన జీవోఎంకు రాసిన లేఖను రాఘవులు ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాఘవులుతోపాటు ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిలు ఈరోజు ఉదయం జీఓఎం ఎదుట హాజరై విభజనపై తమ వైఖరిని వివరించారు.