సెక్షన్-30 ఇంకానా?
Published Mon, Nov 25 2013 3:13 AM | Last Updated on Tue, Aug 21 2018 6:10 PM
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారా? నిబంధనల పేరుతో ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇదంతా జిల్లా మంత్రి బొత్స ప్రాపకం కోసమేనా? పరిస్థితు లు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయని జిల్లా ప్రజలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రాంతంలో అనేక జిల్లా కేంద్రాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా జరుగుతున్నా ఈ జిల్లా కేంద్రంలో మాత్రం పోలీసు చట్టాలు అమలు చేస్తూ ఉద్యమం లేకుండా చూస్తున్నారు. జిల్లాలోని మిగతా ప్రాంతంలోను, విజయనగరం పరిసర గ్రామాల్లోనూ సమైక్యాంధ్ర ఉద్యమం వివిధ రూపాల్లో తీవ్ర స్థాయిలో ఉంది. ఒక్క విజయనగరంలోనే సమైక్యాంధ్ర ఉద్యమం జరగకపోవడం వెనుక జిల్లా మంత్రి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సెక్షన్ 30 అమలుతో భయాందోళనలో ప్రజలు..
సెక్షన్ 30ని పోలీసులు ప్రజలకు భూతద్దంలో చూపిస్తూ వారిని భయాందోళనకు గురిచేస్తున్నారు. దీంతో ప్రజల సమస్యల మీద ఉద్యమాలు చేయడానికి ప్రజా సంఘాలు వెనుకాడుతున్నాయి. విజయనగరం పట్టణంలో ఇంకా సీఆర్‌పీఎఫ్ బలగాలు సంచరిస్తున్నాయి.
అమాయకులను కూడా..
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా అక్టోబర్ 4,5 తేదీల్లో మంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడించాలని ఎన్జీఓలు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఉద్యోగ సంఘాలు, యువకులు, విద్యార్థులు మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బొత్సఝాన్సీలక్ష్మి ఇంటి ముట్టడికి తలపెట్టారు. ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారి తీయడంతో పోలీ సుల వాహనాల అద్దాలను ఆందోళనకారులు బద్దలు కొట్టారు. మంత్రి హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. సుమారు 50మంది వరకు మంత్రికి చెందిన ఆస్తులను ధ్వంసం చేస్తే సుమారు వెయ్యిమంది వరకు ఆందోళనకారులపై పోలీసులు కేసులు పెట్టి తీవ్ర భయాందోళనకు గురిచేశారు. అందులో ప్రతిపక్షపార్టీలకు చెందిన యువకులు, కార్యకర్తలను ఎక్కువగా అరెస్ట్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చూడడానికి వెళ్లినయువకులు, అమాయకులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
సెక్షన్ మీద సెక్షన్‌లు... .
అక్టోబర్ 4న ప్రారంభించిన 144 సెక్షన్, 6వ తేదీ నుంచి పట్టణంలో కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ అక్టోబర్ 19వ తేదీవరకు సడలింపుల మధ్య జరిగిం ది. 144 సెక్షన్ అక్టోబర్ 30వ తేదీ వరకు కొనసాగించారు. 30న సెక్షన్ 30ని అమల్లోకి తెచ్చారు. నవంబర్ 14న మరోసారి సెక్షన్ 30ని 28వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సెక్షన్ 30 అమలులో ఉండడం వల్ల పోలీసు విజయనగరం డివిజన్ పరిధిలో సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయడానికి వీలుకాలేదు. పోలీసులు ఇన్ని సెక్షన్ల మీద సెక్షన్లు విధించడానికి మూల కారణం సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడానికేనని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతున్న తరుణంలో కూడా విజయనగరం పట్టణంలో ఇలాంటి నిషేధాజ్ఞలు విధించడంపై ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement