సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతి పార్టీ కలసి రావాలి | All parties will need to come together on samaikyandhra movement | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతి పార్టీ కలసి రావాలి

Published Wed, Oct 30 2013 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM

All parties will need to come together on samaikyandhra movement

 కనిగిరి టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్రం విడిపోకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతి ఒక్క పార్టీ కలసిరావాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ పుత్తా ప్రతాప్‌రెడ్డి అన్నారు. స్థానిక రాష్ట్ర యూత్ కార్యవర్గ సభ్యుడు వైఎం ప్రసాదరెడ్డి నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ రెండు కళ్ల సిద్ధాంతాలను అవలంబిస్తూ ఉద్యమంలోకి రాకుండా నాటకాలాడుతూ సీమాంధ్ర ప్రజలను మోసగిస్తున్నాయన్నారు. రాజకీయ నాయకులు తమ పదవులు పట్టుకుని ఊగులాడకుండా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలు, యువకుల భవిష్యత్తు కోసం వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాడుతోందని తెలిపారు. సమావేశంలో మండల కన్వీనర్లు పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, గుడిపాటి ఖాదర్, ఎస్సీ సెల్ కన్వీనర్ మధు, నాయకులు మడతల కస్తూరిరెడ్డి, తమ్మినేని శ్రీనువాసులరెడ్డి, పులి శ్రీనివాసులరెడ్డి, నంబుల నర్సయ్య, పాతకొట్టు రమణారెడ్డి, కత్తులపల్లి బాస్కర్‌రెడ్డి, సిద్దారెడ్డి, పిల్లి లక్ష్మీ నారాయణరెడ్డి, మధు, ఓబులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 సమైక్యాంధ్రకు కట్టుబడింది వైఎస్సార్ సీపీనే..
 ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు కట్టుబడింది వైఎస్సార్ సీపీనే అని పార్టీ యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ పుత్తా ప్రతాప్‌రెడ్డి అన్నారు. సమైక్యాంధ్రకు సంఘీభావంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఒంగోలులో యువజనులు, విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన కేవలం ఓట్లు, సీట్ల ప్రాతిపదికనే జరుగుతోందన్నారు.
 
 తన కొడుకును ప్రధానిని చేయాలనే ఏకైక ఉద్దేశంతో సోనియా నేడు రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమైక్య శంఖారావానికి వర్షాలు పడుతున్నా జనం భారీగా తరలిరావడాన్ని బట్టి చూస్తేనే రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో స్పష్టమవుతోందన్నారు. ఢిల్లీ పెద్దలు ఇప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ, కాంగ్రెస్‌లు రెండూ కుమ్మక్కవుతూ ప్రజలను ఇంకా డ్రామాల పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు తిప్పికొట్టాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement