కనిగిరి, న్యూస్‌లైన్ : కనిగిరిలో టీడీపీ నాయకుల అత్యుత్సాహం వివాదానికి దారితీసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వైఎస్‌ఆర్ సీపీ నాయకులు నినాదాలు చేస్తుండటంతో టీడీపీ నాయకులు జోక్యం చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ వివరాల్లోకెళ్తే... రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా స్థానిక చర్చి సెంటర్‌లో శుక్రవారం విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీకి సంఘీభావం తెలుపుతున్న వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల పట్ల టీడీపీ నాయకులు దురుసుగా వ్యవహరించారు.
విద్యార్థుల ర్యాలీ ముగిశాక బంద్‌లో భాగంగా వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు చర్చిసెంటర్‌కు చేరి నినాదాలు చేస్తున్నారు. ఆ సమీపంలోనే దీక్ష శిబిరంలో ఉన్న టీడీపీ నాయకులు.. వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల నినాదాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రదేశంతో పాటు నిరసనలు తెలిపేందుకు చర్చిసెంటర్ ప్రధాన కూడలి కావడంతో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు పట్టించుకోకుండా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ నాయకులు దీక్ష శిబిరంలో ఉన్న మైకు సౌండ్‌ను బాగా పెంచారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు బేరి పుల్లారెడ్డి, దొడ్డ వెంకటసుబ్బారెడ్డిలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు వైఎం ప్రసాద్‌రెడ్డి, నాయకులు పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, మధు, భాస్కర్‌రెడ్డి, తోటా మాలకొండయ్య, సిద్దారెడ్డిలు ఖండిస్తూ నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపి దూషణలకు దిగడంతో వైఎం ప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయనతో టీడీపీ నాయకుడు పుల్లారెడ్డి గొడవపెట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు సమైక్యంపై చంద్ర‘బాంబు’ అనే వాల్‌పోస్టర్‌ను పక్కనే ఉన్న నిప్పుల్లో వేశారు. టీడీపీ నాయకులు కూడా వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల చేతిలో ఉన్న పార్టీ వాల్‌పోస్టర్లను లాక్కుని తగలబెట్టేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఇరుపార్టీల కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో అక్కడకు రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టీడీపీ నాయకుల దౌర్జన్యంపై ముక్కు కాశిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని కుట్రలు పన్నినా కాబోయే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని ఆయన పేర్కొన్నారు.
కనిగిరిలో టీడీపీ ఓవరాక్షన్
Published Sat, Oct 5 2013 5:01 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
Advertisement
Advertisement