పెదకూరపాడు, న్యూస్‌లైన్: మిర్చి పంటకు ఆశించిన బబ్బరు తెగులు రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తెగులు సోకిన మొక్కలు ఎదుగుదల లేకపోవడంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో నీరు పెట్టినా ఆకులు ముడుచుకుపోయి మొక్కలు ఎండిపోతున్నాయని బెంబేలెత్తుతున్నారు.
బబ్బరు తెగులుకు తోడు మాడు, కుళ్లుడు తెగుళ్లు కూడా మిర్చి పంటను పట్టిపీడిస్తున్నాయి. రసం పీల్చే పురుగులు అధికంగా ఉండి పంటకు చెరుపుచేస్తున్నాయి. ఈ తరహా పురుగులను అరికట్టేందుకు ఎన్ని రకాల మందులు పిచికారీ చేస్తున్న ప్రయోజనం ఉండటం లేదని రైతులు చెపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 55వేల హెక్టార్లలో రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో అధిక విస్తీర్ణంలో మిర్చి పంట వేశారు. ప్రధానంగా పెదకూరపాడు నియోజకవర్గంలో మిర్చి పంటను బబ్బరు తెగులు ఆశించడంతో రైతులు అల్లాడుతున్నారు.
రసం పీల్చే పురుగులు, బొబ్బరు తెగులు కారణంగా పలు చోట్ల రైతులు మిర్చి మొక్కలను పీకి వేస్తున్నారు. పెదకూరపాడు, లగడపాడు, 75 త్యాళ్ళూరు, జలాల్‌పురం, హుసేన్‌నగరం తదితర ప్రాంతాల్లో మిర్చిని ముందుగా సాగు చేశారు. ఇలా సాగు చేసిన చోట్ల తెగుళ్లు అధికంగా ఉండటంతో మొక్కలు ఎదుగుదల లేక దిగుబడులు సగానికి పైగా తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సలహాలు, సూచనలు ఇచ్చే నాథుడే లేరు...
తెగుళ్లతో మిర్చి రైతులు అల్లాడుతుంటే రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చే అధికారులు కరువయ్యారు. ఖరీఫ్ సీజన్ సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరగడంతో వ్యవసాయ శాఖ అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో గ్రామాల్లో పొలంబడి కార్యక్రమాలు నిర్వహించలేదు.
ఆ తరువాత కూడా పంటలను ఆశిస్తున్న తెగుళ్లపై రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చే నాథుడే కరువయ్యారు. తెగుళ్లకు ఏ మందులు పిచికారీ చేయాలో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తెలియజేయాలని రైతులు కోరుతున్నారు.
మిరపకుచెరుపు
Published Sat, Jan 18 2014 2:31 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement