మోర్తాడ్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో వాయిదా పడిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఎప్పుడు నిర్వహిస్తారా.. అని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉద్యమ ప్రభావం తగ్గడంతో పరీక్ష నిర్వహించవచ్చనే చాలామంది భావిస్తున్నారు. మరోవైపు టెట్‌ను నిర్వహించడానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. పది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయని ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాలో బీఈడీ, టీటీసీ పూర్తి చేసినవారు వేల సంఖ్యలో ఉన్నారు. వీరు జూలైలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 50 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది.
సెప్టెంబర్‌లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. దీంతో ప్రభుత్వం టెట్‌ను వాయిదా వేసింది. పరీక్ష వాయిదా పడడంతో అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు కొద్ది రోజుల క్రితం సమ్మె విరమించారు. దీంతో టెట్‌ను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు టెట్ నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర మాధ్యమిక శాఖ ఉన్నతాధికారులు అందించినట్లు సమాచారం. టెట్ నిర్వహిస్తారన్న సమాచారం తెలియడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది. వారు పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నారు.
డీఎస్సీ నిర్వహించాలి..
టెట్ నిర్వహించిన వెంటనే డీఎస్సీ చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం అదిగో.. ఇదిగో అంటూ నాన్చకుండా టెట్ తర్వాత వెంటనే డీఎస్సీని నిర్వహించాలని బీఈడీ, టీటీసీ, పీఈటీ తదితర అభ్యర్థులు కోరుతున్నారు.
టెట్ ఎప్పుడు?
Published Tue, Oct 29 2013 6:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement