
3 నుంచి నిరవధిక సమ్మె
* సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ప్రకటన
* ‘తెలంగాణ’ నిర్ణయాన్ని పునస్సమీక్షించేదాకా కొనసాగిస్తామని స్పష్టీకరణ
* సచివాలయంలో కొనసాగిన ఆందోళన.. నలుపురంగు దుస్తులు ధరించి నిరసన
* హైదరాబాద్ అందరిదంటూ నినాదాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వచ్చే నెల 3వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బుధవారం కలిసి సమ్మె నోటీసు అందజేస్తామని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని పునస్సమీక్షించుకునే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మంగళవారమూ తమ ఆందోళన కొనసాగించారు.
ఉద్యోగులందరూ నలుపురంగు దుస్తులు ధరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సచివాలయ ప్రధాన ద్వారం, సీఎం కార్యాలయం ఎదుట బైఠాయించారు. హైదరాబాద్ అందరిదని, రాజధానిని వదిలిపోమని నినదించారు. అనంతరం సచివాలయ సీమాంధ్ర ఫోరం నేతలు మీడియాతో మాట్లాడారు. 15 రోజులకుపైగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం పట్టించుకోనందున నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ చెప్పారు. సెప్టెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టనున్నట్టు ప్రకటించారు.
సమ్మె విషయంలో వెనక్కితగ్గబోమని, కేంద్రం తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకునే వరకూ ఎన్ని నెలలైనా సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. ఎస్మాలకు భయపడేది లేదన్నారు. తమ ఉద్యమం వెనుక సీమాంధ్ర నాయకులున్నారన్న ఆరోపణలు అవాస్తవాలని, తామింతవరకూ సీఎంను తప్ప మరే ఇతర సీమాంధ్ర నేతనూ కలవలేదని తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులను వలసవాదులని పేర్కొనడం సరికాదన్నారు. రాజధానికి వచ్చిన వారంతా వలసవాదులైతే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ తదితర తెలంగాణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చినవారు కూడా వలసవాదులే అవుతారన్నారు.
తెలంగాణ ఉద్యోగులతో తమకెలాంటి ఘర్షణ లేదని, తామంతా కలిసిమెలిసి పనిచేసుకుంటున్నామని, అయితే ఎవరి హక్కులకోసం వారు పోరాడటంలో తప్పులేదని అన్నారు. సమావేశంలో ఫోరం నేతలు కె.వి.కృష్ణయ్య, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. కాగా అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఉద్యోగుల నిరసన ప్రదర్శనలో పాల్గొని ప్రసంగించారు. రాజకీయ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని ఉద్యోగులకు సూచించారు.
మహిళా శిశు సంక్షేమ కమిషనరేట్‌లో నేటి నుంచి
రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు నేటి నుంచి సమ్మెబాట పట్టనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా సమ్మె చేయాలని నిర్ణయించినట్టు ఉద్యోగుల సంఘం చైర్మన్ సీ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. మంగళవారం జరిగిన సీమాంధ్ర ప్రాంత అధికారులు, సిబ్బంది సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పీ మునిరాజు, జాయింట్ డెరైక్టర్లు ఈవీ స్వర్ణలత, కే శ్యామసుందరి, ఎం.విజయలక్ష్మి, విశాలాక్షి, ఎం.శారద, పీ సోమశంకర్, కే లక్ష్మీదేవి పాల్గొన్నారు.
22 నుంచి ఉపాధ్యాయులు...
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 22 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ప్రకటించింది. ఈ మేరకు సమితి ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని కలిసి సమ్మె నోటీసులు ఇచ్చారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలకు చెందిన 2.5 లక్షల మంది ఉపాధ్యాయులు సమ్మె లో పాల్గొంటారని సమితి చైర్మన్ కమలాకరరావు చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు బచ్చ ల పుల్లయ్య, శ్రీనివాసులునాయుడు ప్రకటించారు.
సమ్మెబాటలో ఏపీ వైఎస్సార్ టీఎఫ్
రాష్ట్ర విభజన నిరసిస్తూ సమ్మె బాట పట్టనున్నట్టు ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ కె. ఓబుళపతి తెలిపారు. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితితో కలిసి సమ్మెలో పాల్గొంటామన్నా రు. 13 జిల్లాలకు చెందిన వైఎస్సార్‌టీఎఫ్ సభ్యులందరూ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.