బేస్తవారిపేట, న్యూస్‌లైన్: ఎక్కడికక్కడ పాఠ్యాంశాలు పేరుకుపోతుండడం.. సిలబస్ ఓ పట్టాన పూర్తి కాకపోవడం వంటి సమస్యలకు కారణం ఉపాధ్యాయుల కొరతే. అందుకే ప్రభుత్వం ఎడ్యకేషన్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలను తెరపైకి తెచ్చింది. ఉపాధ్యాయుల కొరత వెంటనే అధిగమించాలని నానా హడావుడి చేసింది. గత నవంబర్‌లో నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. మొత్తం 56 మండలాల్లో 526 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో నిరుద్యోగులు సంబర పడ్డారు. బీఈడీ, డీఈడీ పట్టభద్రులతో పాటు డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎంఈఓ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో ఇంటర్వ్యూలు చేపట్టినా.. ఈ సారి నిబంధనలు మార్చామని.. అందరికీ ఒంగోలులో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎంఈఓలు దరఖాస్తులను ఒంగోలు రాజీవ్ విద్యా మిషన్‌కు పంపారు. అంతే.. కథ అక్కడితో ఆగింది. ఇది జరిగి రెండు నెలలు దాటుతున్నా ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. విద్యా సంవత్సరం కూడా ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది.
విద్య లక్ష్యం నెరవేరేదెలా?
పాఠశాలల్లో నెలకొన్న ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా ప్రమాణాలు పూర్తిగా అడుగంటుతున్నాయి. ఇక ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అయితే పరిస్థితి మరింత దారుణం. మధ్యాహ్నభోజనం పథకం అమలు, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, సూక్ష్మ ప్రణాళిక నివేదికలు, ఎస్‌ఎంసీ సమావేశాలు, డైస్ వివరాలు, హెచ్‌ఎం సమావేశాలకు ఉన్న ఒక్క ఉపాధ్యాయుడే హాజరు కావాలి. అలాగే ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఆయన మాత్రమే బోధించాలి. ఇలాంటి పరిస్థితుల మధ్య సిలబస్ కొండలా పేరుకుపోతోంది. పిల్లల గ్రేడ్‌లు పడిపోతున్నాయి.
దీనికి తోడు సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పాఠశాలలు సజావుగా సాగకపోవడంతో పాఠాలు చెట్లెక్కాయి. ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులున్న చోట కూడా బోధన సజావుగా సాగిన దాఖలాలు లేవు. ఎవరైనా సెలవు పెడితే.. ఆ భారమంతా మిగిలిన ఉపాధ్యాయులే చూసుకోవాలి. అది జరిగే పని కాకపోవడంతో.. ఇలాంటి పాఠశాలల్లో కూడా బోధన కుంటుపడుతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కచ్చితంగా భర్తీ చేయాల్సిన ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు భ ర్తీ కాకుండా నిలిచిపోయినా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దివాలాకోరుతనానికి నిదర్శనం.
సాగని సర్కారీ చదువులు
Published Sat, Jan 4 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement
Advertisement