సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలతో ఏపీ విద్యా శాఖ, ఐబీ ప్రతినిధులు. చిత్రంలో మంత్రి బొత్స తదితరులు
భావి తరాలకు నాణ్యమైన విద్య అందించడం ఎంతో ముఖ్యం. భవిష్యత్తు తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, ప్రపంచంలో నంబర్‌వన్‌గా నిలవాలన్నా నాణ్యమైన విద్యే కీలకం.
– ఐబీతో ఒప్పందంలో సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ విద్యా బోధన దిశగా కీలక ఘట్టం పూర్తి అయ్యింది. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ అంటోన్ బెగుయిన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలి పెక్కా హీనోనెన్ ఈ కార్యక్రమంలో జెనీవా నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలో ఐబీని భాగస్వామ్యం చేయడం గొప్ప సంతృప్తినిస్తోందన్నారు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైందని, ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమంగా అభివర్ణించారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కా, ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆ పరిస్థితి ఇక మారుతుంది: సీఎం జగన్
భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అత్యవసరమని, ఇప్పుడున్న విధానాలను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ చెప్పారు. సాంకేతికత, పాఠ్య ప్రణాళిక తదితర అంశాలను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. సమస్యా పూరణ సామర్థ్యం, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మోడల్‌లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వినియోగం లాంటివి చాలా కీలకమని, ఐబీ ద్వారా ఇది సాధ్యమన్నారు. ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైందని, రానున్న విద్యా సంవత్సరంలో టీచర్లకు, సిబ్బందికి ఐబీ విధానాలపై శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు.
ఐబీ విద్య సంపన్నులకు మాత్రమే అనే పరిస్థితి ఇప్పుడు మారుతుందని వ్యాఖ్యానించారు. పేదలకు, అణగారిన వర్గాలకూ ఇకపై ఐబీ బోధన అందుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలై 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి పన్నెండో తరగతుల్లో ఐబీ బోధన ప్రారంభమవుతుందని తెలిపారు. ఎస్సీఈఆర్టీ, ఐబీ భాగస్వామ్యంతో విద్యా బోధన కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందన్నారు.
ఇతర దేశాలకు ఈ ఒప్పందం స్ఫూర్తి: ఓలి పెక్కా
తమది లాభాపేక్ష లేని సంస్థ అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై చాలా నిబద్ధతతో ఉన్నామని ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలి పెక్కా హీనోనెన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. విద్య ద్వారా ఉత్తమ ప్రపంచాన్ని, శాంతియుత సమాజాన్ని నిర్మించాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇంత పెద్దస్థాయిలో తమ సంస్థ భాగస్వామ్యం కావడం ఇదే ప్రథమమని, ఇతర దేశాలకు, ప్రాంతాలకు ఈ ఒప్పందం ఒక స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
దీనిద్వారా భారత్‌తో విద్యారంగంలో తమ సంబంధాలు మరింత మెరుగుపడతాయని, నాణ్యమైన విద్యకోసం ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య మంచి వాతావరణాన్ని కల్పించి సామర్థ్యాలను పెంచుతామన్నారు. పిల్లలు, స్కూళ్లు, తల్లిదండ్రులు, యూనివర్శిటీలతోనూ తమ సంబంధాలు మెరుగుపడతాయన్నారు. ఏపీలో కొత్త తరహా విద్యా విధానంలో తొలుత ప్లే బేస్డ్ లెర్నింగ్ విధానంతో పిల్లల్లో ఆసక్తిని కలిగించేందుకు ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్‌తో పాటు మాతృ భాషల్లోనే కాకుండా పిల్లలు విదేశీ భాషలను నేర్చుకోవడంపైనా దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. దీనివల్ల పిల్లల్లో కొత్త సామర్థ్యాలు అలవడతాయన్నారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ, సింగపూర్, ఎస్తోనియా, ఫిన్లాండ్, కెనడా దేశాల్లోని విద్యామంత్రులతో ఇటీవల నాణ్యమైన బోధన, అభ్యాసాలపై చర్చించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్.జవహర్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (ఇన్‌ఫ్రా) కాటమనేని భాస్కర్, సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ(మిడ్ డే మీల్స్) డైరెక్టర్ ఎస్.ఎస్.శోభిక, ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఐబీ భాగస్వామ్యంపై జీవో
పాఠశాల విద్యలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలుకు అనుగుణంగా ఎస్సీఈఆర్టీలో ఐబీ భాగస్వామ్యంపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం జీవో నంబర్ 5 జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో భవిష్యత్ సాంకేతికత, సిలబస్, బోధన, సదుపాయాలు తదితర అంశాలపై ఐబీ ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు. 21 మంది ఐబీ ప్రతినిధుల బృందం వచ్చే నెల రోజుల్లో 40 పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాలను పరిశీలించి అధ్యయనం నిర్వహిస్తుంది.
ఎగ్జామినేషన్ విధానాలను సైతం పరిశీలించి మార్పుచేర్పులపై సూచనలు చేస్తారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు శిక్షణ, సిలబస్‌పై సూచనలు ఇచ్చేందుకు ఎస్సీఈఆర్టీలోని 19 మంది నిపుణులతో పాటు ఐబీకి చెందిన 26 మంది నిపుణులు చర్చించనున్నారు. మొత్తం ప్రక్రియను 2025 మే నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధనను ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment