అవగాహనే అస్త్రం!  | starting consumer club for 8th and 9th class students instructions | Sakshi
Sakshi News home page

అవగాహనే అస్త్రం! 

Published Mon, Oct 9 2023 5:56 AM | Last Updated on Mon, Oct 9 2023 8:16 AM

starting consumer club for 8th and 9th class students instructions - Sakshi

వినియోగదారుల హక్కులను తెలియజేస్తూ రూపొందించిన పోస్టర్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. దశాబ్దాలుగా ప్రకటనలకే పరిమితమైన ‘స్కూల్‌ కన్జ్యూమర్‌ క్లబ్‌’లను ప్రస్తుత వైఎస్‌ జగన్‌ సర్కార్‌.. ప్రతి ప్రభుత్వ స్కూల్లోనూ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 8, 9 తరగతుల విద్యార్థులతో దాదాపు 6 వేలకు పైగా వినియోగదారుల క్లబ్‌లను ఏర్పాటు చేయించింది. ఒక్కో క్లబ్‌లో కనీసం 100 మంది విద్యార్థులను భాగస్వాములను చేస్తూ.. సుమారు 6 లక్షల మందిని వినియోగదారుల హక్కుల పరిరక్షకులుగా తీర్చిదిద్దబోతోంది.

విద్యార్థులే వినియోగదారులుగా తమ హక్కులను అర్థం చేసుకోవడంతో పాటు వాటిని తమ కుటుంబసభ్యులకు, గ్రామాల్లోని నిరక్షరాస్యులకు, తోటి విద్యార్థులకు బోధించేలా ప్రభుత్వం ఈ క్లబ్‌లకు రూపకల్పన చేసింది. వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు దోపిడీకి గురికాకుండా సమగ్ర పరిజ్ఞానాన్ని అందిస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఇద్దరు మాస్టర్‌ ట్రైనర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చింది.

ఈ మాస్టర్‌ ట్రైనర్లు రాష్ట్రంలోని అన్ని క్లబ్‌ల టీచర్‌ గైడ్‌లకు దశలవారీగా, క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వనున్నారు. పుస్తకాలు, వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా వినియోగదారుల హక్కులకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘మేము సైతం’ పేరుతో శిక్షణ మాడ్యూల్‌ పుస్తకాన్ని వెలువరించారు. త్వరలోనే వినియోగదారుల హక్కుల పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి, క్లబ్‌లు చేపట్టిన కార్యకలాపాలను అప్‌లోడ్‌ చేయడానికి వీలుగా ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి రానుంది. క్లబ్‌ల  కార్యక్రమాల ఆధారంగా అవార్డులతో  విద్యార్థులను ప్రోత్సహిస్తారు.  

పోస్టర్లతోనూ విస్తృత ప్రచారం 
వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పిం చేలా 10 రకాల పోస్టర్లతో కూడా ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించనుంది. వస్తువు కొనుగోలులో వినియోగదారులకు ఉండే హక్కులు, బాధ్యతలు, ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్‌ బంకుల్లో పొందే హక్కులు, విత్తనాలు, ఎరువుల కొనుగోలుపై అవగాహన, సమస్య వస్తే వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేసే విధానం, బిల్లు ఆవశ్యకత తదితర అంశాలను వివరించనుంది.

అలాగే వినియోగదారుల హక్కుల పరిరక్షణ అంశాలతో ‘మేలు కొలుపు’ పేరుతో మాస పత్రికను కూడా ప్రచురిస్తోంది. నెలకు సుమారు 9 వేల కాపీలను విడుదల చేస్తుండగా వీటిని వినియోగదారుల క్లబ్‌లకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో వినియోగదారుల అవగాహన కార్యక్రమాల నిర్వహణకు జాయింట్‌ కలెక్టర్లను నోడల్‌ అధికారులుగా నియమించారు.  

విద్యార్థులతోనే చైతన్యం.. 
ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదంటే సేవను పొందేటప్పుడు వినియోగదారుడికి చట్టం కొన్ని హక్కులు కల్పిం చింది. వీటి ద్వారా మోసాల నుంచి కొనుగోలుదారుడు తనను తాను రక్షించుకోవచ్చు. కానీ, ఎన్నో ఏళ్లుగా వినియోగదారులు తమ హక్కులు తెలుసుకోవడంలో వెనుకబడిపోయారు. అందుకే ప్రభుత్వం పాఠశాల విద్య దశలోనే ఈ అంశంపై సమగ్ర అవగాహన కల్పిం చేందుకు కృషి చేస్తోంది. విద్యార్థుల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చు. అందుకే సమస్య వస్తే వినియోగదారుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియజేయడంతో పాటు మోసపోకుండా సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నాం. – హెచ్‌.అరుణ్‌ కుమార్, వినియోగదారుల వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement