వరల్డ్‌ క్లాస్‌ విద్య | CM YS Jagan Mandate Officials On Profiles Of Government Schools - Sakshi
Sakshi News home page

వరల్డ్‌ క్లాస్‌ విద్య

Published Fri, Sep 15 2023 3:15 AM | Last Updated on Wed, Dec 13 2023 6:39 PM

CM YS Jagan Mandate Officials On Profiles of Government Schools - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రొఫైళ్లను సంపూర్ణంగా మారుద్దామని అధికార యం­త్రాం­గానికి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్‌ స్కూళ్ల కంటే ఉన్నతంగా తీర్చిదిద్దుదామన్నారు. ఈ క్రమంలో ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ తరగతి గదులు, నాడు–నేడు పనులతోపాటు ఇంటర్నేషనల్‌ బాకలా­రి­యేట్‌ (ఐబీ) సిలబస్‌ను అందుబాటులోకి తేవడం, నిత్యం టోఫెల్‌ శిక్షణా తరగతులను నిర్వ­హించడం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.

విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల అమలు, పురోగతిపై సీఎం జగన్‌ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాల­యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టోఫెల్‌ పరీక్షలకు విద్యార్థుల సన్న­ద్ధతపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం వారంలో 3 రోజుల పాటు మూడు తరగతుల చొప్పున శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు పేర్కొనగా ఇకపై ప్రతి రోజూ టోఫెల్‌ శిక్షణకు ఒక పీరియడ్‌ కేటాయించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.

తద్వారా విద్యార్థులు క్రమంగా నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టడంపై సంపూర్ణ మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. దశలవారీగా ఐబీ సిలబస్‌ను అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం అనుసరిస్తున్న సిలబస్‌ను ఐబీతో అనుసంధానిస్తూ ఈ ప్రక్రియ సజావుగా, సులభంగా జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
విద్యాశాఖలో సంస్కరణల అమలు, పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ట్యాబ్‌ల పంపిణీ..
ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులు, తరగతి ఉపాధ్యాయులకు రెండో విడత ట్యాబుల పంపిణీకి సిద్ధం కావాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటిల్‌ అసిస్టెంట్లతో డివైజ్‌ల వినియోగంపై విద్యార్థులకు శిక్షణ ఇప్పించాలి. నాడు–నేడు రెండో దశ పనులు పూర్తయిన అన్ని పాఠశాలల్లో కూడా డిసెంబర్‌ కల్లా ఐఎఫ్‌పీ బోర్డులు, స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు పూర్తి కావాలి. జూనియర్‌ కాలేజీలుగా మార్చేందుకు గుర్తించిన హైస్కూళ్లలో ఐఎఫ్‌పీ సహా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి.

అత్యంత నాణ్యంగా ఆహారం..
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా పౌష్టికాహారాన్ని అందించేందుకు అధికంగా నిధులు వెచ్చిస్తున్నాం. ఆరోగ్యకరమైన, రుచికరమైన మెనూ తీసుకొచ్చాం. రాగిజావ అందిస్తున్నాం. వీటిల్లో ఏ ఒక్కటీ క్వాలిటీ తగ్గకూడదు.

విద్యార్థులకు పెట్టే భోజనం నూటికి నూరుశాతం నాణ్యతగా ఉండాల్సిందే. పాఠశాలల్లో విద్యార్థులు తినే భోజనంపై ప్రతి రోజూ అధికారుల పర్యవేక్షణ మరింత మెరుగ్గా ఉండాలి. ఈమేరకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ) పాటించాలి. బలహీనంగా, రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులను ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం ద్వారా గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిత్యం పౌష్టికాహారం, సమయానికి మందులు అందేలా చర్యలు తీసుకోవాలి. 

ఫలించిన స్పెషల్‌ డ్రైవ్‌
ప్రాథమిక విద్యలో 100 శాతం పిల్లలు బడిలోనే
రాష్ట్రంలో చిన్నారులను విద్యవైపు నడిపించేలా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ సత్ఫలితాలను ఇచ్చిందని అధికారులు సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తెచ్చారు. ప్రాథమిక విద్యలో నూటికి నూరు శాతం పిల్లలు బడిలోనే ఉన్నారని వివరించారు. సీనియర్‌ సెకండరీ విభాగంలో 96.94 శాతం మంది, హయ్యర్‌ సెకండరీ విభాగంలో 74.9 శాతం స్కూళ్లలోనే ఉన్నట్టు తెలిపారు.

అమ్మఒడి పథకంతోపాటు 10, 12వ తరగతులు ఫెయిల్‌ అయిన విద్యార్థులకు రీ అడ్మిషన్, స్కిల్‌ సెంటర్లలో చేర్పించి వారికి ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్, వలంటీర్లు, సచివాలయాల ద్వారా నిర్వహించిన ప్రచారంతో సత్ఫలితాలు వచ్చాయన్నారు. 1 నుంచి 12వ తరగతి వరకు ప్రస్తుతం  83,52,738 మంది విద్య అభ్యసిస్తున్నట్టు వెల్లడించారు. తొలి విడతగా నిర్దేశించుకున్న మేరకు 4,804 స్కూళ్లలో 30,213 ఐఎఫ్‌పీ ప్యానళ్లు, 6,515 స్కూళ్లలో స్మార్ట్‌ టీవీలను బిగించామని అధికారులు వివరించారు. ఇప్పటికే ఐఎఫ్‌పీ, స్మార్ట్‌ టీవీల వినియోగింపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామన్నారు.

91.33 శాతం మంది ఇంగ్లీషు మీడియంలోనే పరీక్షలు
ఐఎఫ్‌పీ ప్యానళ్లు ఏర్పాటు చేసిన చోట రెండు రకాల ఇంటర్నెట్‌ సర్వీసులు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. స్మార్ట్‌ ఫోన్‌లో, ఫోన్‌ ఎస్డీ కార్డులో, యూట్యూబ్‌లో, ట్యాబుల్లో, ఐఎఫ్‌పీలో, అధీకృత వెబ్‌సైట్లలో, ఇ–పాఠశాల డీటీహెచ్‌ల్లో ఇలా ఎందులోనైనా ఒకే విధమైన పాఠ్యప్రణాళిక, ఒకే పాఠ్యాంశాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచామన్నారు. ఆగస్టులో నిర్వహించిన మొదటి అసెస్మెంట్‌లో మూడో తరగతి నుంచి 9 వతరగతి వరకూ దాదాపు 91.33 శాతం మంది పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాశారని చెప్పారు.

6 నుంచే ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌
ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఇతర అత్యాధునిక టెక్నాలజీపై సమీక్షలో అధికారులు  పలు అంశాలను సీఎంకు నివేదించారు. ఆరో తరగతి నుంచి కృత్రిమ మేధను ప్రత్యేక సబ్జెక్టుగా బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శిక్షణ, బోధన కార్యక్రమాలకు సమీపంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలను అనుసంధానం చేయడంతో పాటు ఏఐపై పాఠ్యాంశాలు బోధించేందుకు ప్రత్యేకంగా యాప్‌ రూపొందిస్తున్నట్టు వివరించారు.

అవసరమైన చోట అదనపు గదులు, సదుపాయాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో రెండో విడత నాడు–నేడు పనులు చురుగ్గా జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కాలేజీలను అందుబాటులోకి తెస్తుండగా వాటిల్లో ఒకటి బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 679 మండలాలకుగాను 473 మండలాల్లో బాలికలు, కో–ఎడ్యుకేషన్‌ కాలేజీలను అందుబాటులోకి తెచ్చామన్నారు.

మిగిలిన చోట్ల హైస్కూళ్లను ప్లస్‌ టూగా మార్చేందుకు జాబితా రూపొందిస్తున్నామన్నారు. అవసరమైన మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ (మౌలిక వసతుల కల్పన) కాటమనేని భాస్కర్, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌ నిధి మీనా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సి.ఎన్‌ దీవాన్‌రెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్‌ నాగార్జున యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement