Jagananna Vidya Kanuka: సీఎం జగన్‌ ఆదేశాలు.. మేలిమి ‘కానుక’ | Jagananna Vidya Kanuka Kits with Best Quality for students | Sakshi
Sakshi News home page

Jagananna Vidya Kanuka: సీఎం జగన్‌ ఆదేశాలు.. మేలిమి ‘కానుక’

Published Mon, Feb 20 2023 3:36 AM | Last Updated on Mon, Feb 20 2023 10:32 AM

Jagananna Vidya Kanuka Kits with Best Quality for students - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింపచేస్తూ అందచేస్తున్న జగనన్న విద్యా కానుక (జేవీకే) కిట్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మరింత నాణ్యతతో, సకాలంలో సమకూర్చేలా విద్యా­శాఖ సన్నద్ధమైంది. రూ.1,042.53 కోట్ల వ్యయంతో 40 లక్షల మందికిపైగా విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందించేలా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి సరఫరాదారులందరికీ ఇప్పటికే వర్క్‌ ఆర్డర్లు ఇచ్చారు. ఈసారి విద్యా­ర్థులకు మరింత మన్నికతో కూడిన నాణ్యమైన బ్యాగ్‌లు, బూట్లను అందించనున్నారు. యూని­ఫామ్‌ను ప్లెయిన్‌ క్లాత్‌ కాకుండా ఆకర్షణీయంగా రంగు రంగుల చెక్స్‌ డిజైన్‌తో రూపొందించారు. దుస్తులు కుట్టే సమయంలో సమస్యలు ఎదురు కాకుండా యూనిఫామ్‌ క్లాత్‌ను అదనంగా పెంచారు.

ఇక పాఠ్య పుస్తకాలు, వర్క్‌ బుక్స్‌ ముద్రణ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా ఈనెల 24వ తేదీ నుంచి జిల్లా పాయింట్లకు పంపిణీ మొదలవుతుంది. స్కూళ్లు తెరిచే రోజే వీటిని విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతు­న్నాయి. ప్రభుత్వ పాఠశా­లల పట్ల పెరుగుతున్న ఆదరణ, ఏటా అదనంగా చేరుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఐదు శాతం అదనపు బఫర్‌తో ప్రభుత్వం 5.06 కోట్ల పాఠ్యపుస్తకాలను ముద్రిస్తుండటం గమనార్హం.

విద్యాకానుక ద్వారా అందించే ప్రతి ఒక్క వస్తువు నాణ్యతను స్వయంగా పరిశీలిస్తూ ఓ మేనమామలా ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయం తెలిసిందే. మూడున్నరేళ్లుగా జేవీకే అమలు తీరును గమనిస్తూ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మార్పు చేర్పులను సూచిస్తున్నారు. 

► స్థానిక మార్కెట్లో సుమారు రూ.650 విలువ చేసే నాణ్యమైన బ్యాగులను సరఫరా చేసేందుకు మంజీత్‌ ప్లాస్టిక్‌ ఇండస్ట్రీస్, కోర్స్‌ ఇండియా లిమిటెడ్, అభిలాష కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎక్స్‌వో ఫుట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వినిష్మా టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేసి ఆర్డర్లు ఇచ్చారు. స్వే్కర్‌ టైపులో పెద్ద బ్యాగులు రీ డిజైన్‌ చేశారు.

►యూనిఫామ్‌కి సంబంధించి బాలికల టాప్, బాలుర షర్ట్‌లను ప్లెయిన్‌ క్లాత్‌ నుంచి చెక్స్‌ (గడులు) రూపంలోకి మార్పు చేశారు. దుస్తులు కుట్టే సమయంలో సమస్యలు ఎదురు కాకుండా క్లాత్‌ పరిమాణాన్ని కూడా దాదాపు 20 శాతం పెంచారు. మఫత్‌లాల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, నందన్‌ డెనిమ్‌ లిమిటెడ్, కంచన్‌ ఇండియా లిమిటెడ్, అరవింద్‌ కాట్సిన్‌ ఇండియా లిమిటెడ్, పదమ్‌ చంద్‌ మిలాప్‌చంద్‌ జైన్‌ సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేశారు. యూనిఫామ్‌ వస్త్రం మరో 50 రోజుల్లో జిల్లాలకు సరఫరా మొదలు కానుంది.

►బూట్లు మరింత కాంతివంతంగా (షైనింగ్‌) ఉండేలా చర్యలు చేపట్టారు. సరఫరాదారులు పాత మెటీరియల్‌ వాడకుండా నియంత్రించారు. డైమండ్‌ ఫుట్‌కేర్‌ ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మంజీత్‌ ప్లాస్టిక్‌ ఇండస్ట్రీస్, ఎక్స్‌ఓ ఫుట్‌ వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, పవర్‌ టెక్‌ ఎలక్ట్రో ఇన్ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్, లెహర్‌ పుట్‌వేర్‌ లిమిటెడ్‌ సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేసి పంపిణీ ఆర్డర్లు ఇచ్చారు.

►అటల్‌ ప్లాస్టిక్స్, ఓం స్పోర్ట్స్‌ సంస్థలను బెల్టుల తయారీకి టెండర్ల ద్వారా ఎంపిక చేశారు.

►ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రెస్‌కి గతంలో మాదిరిగా నామినేషన్‌ ప్రాతిపదికన అప్పగించారు. 

►1 నుంచి 9వ తరగతి వరకు బైలింగ్వుల్‌ పాఠ్య పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా 6, 7, 9 తరగతుల విద్యార్థుల కోసం ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో బైలింగ్వుల్‌ పాఠ్య పుస్తకాలు ముద్రిస్తున్నారు. తమిళనాడు న్యూ ప్రింట్‌ పేపర్స్‌ లిమిటెడ్‌ కాగితాన్ని సరఫరా చేస్తోంది. 40 లక్షల మందికిపైగా విద్యార్థులకు రెండు సెమిస్టర్ల  విధానంలో పుస్తకాలు తయారు చేస్తున్నారు. దాదాపు 4.83 కోట్ల పుస్తకాలు ముద్రించి అందించనున్నారు.

►ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అదనపు విద్యార్థుల కోసం 5 శాతం అదనపు బఫర్‌తో ప్రభుత్వం 5.06 కోట్ల పాఠ్యపుస్తకాలను ముద్రిస్తోంది.

►అన్ని మీడియం పాఠశాలలకు బైలింగ్వుల్‌ పుస్తకాలు అందించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో చదివే విద్యార్థులకు తెలుగు, ఆంగ్లంలో ద్విభాషా పాఠ్య  పుస్తకాలు అందిస్తారు. ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉర్దూ, ఇంగ్లీష్‌లలో ద్విభాషా పాఠ్య పుస్తకాలను సరఫరా చేయనున్నారు. బెలింగ్వుల్‌ పుస్తకాలు 5 భాషల్లో (తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం) ముద్రించనున్నారు. 9వ తరగతికి కొత్తగా ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ పుస్తకాలను 2023–24లో పరిచయం చేస్తున్నారు. 

►2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు, వర్క్‌ బుక్స్‌ ముద్రణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 88 ప్రింటర్లకు ఈ పనులు అప్పగించారు. 14,611 మెట్రిక్‌ టన్నుల ఇన్‌సెట్‌ పేపర్, 1,401 మెట్రిక్‌ టన్నుల టైటిల్‌ కవర్‌ పేపర్‌ సరఫరా కోసం తమిళనాడు న్యూ ప్రింట్‌ – పేపర్స్‌ లిమిటెడ్‌కి ఆర్డర్లు ఇచ్చారు. సంస్థ పేపర్‌ సరఫరా చేస్తుండడంతో ప్రింటింగ్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 

►ఈనెల 24వ తేదీ నుంచి జిల్లా పాయింట్లకు పుస్తకాల పంపిణీ ప్రారంభమవుతుంది. మే 31వ తేదీకల్లా అన్ని స్కూల్‌ పాయింట్లకు పుస్తకాలు చేరేలా చర్యలు చేపట్టారు. 

►పాఠ్య పుస్తకాలు వర్కు బుక్కులు స్కూళ్లు తెరిచే రోజే విద్యార్ధులకు  అందించనున్నారు. 

గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు
జగనన్న విద్యా కానుక ద్వారా అందచేసే కిట్లలో నాణ్యత తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు ఎప్పటికప్పుడు ప్రతి దశలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించారు. పాఠ్య పుస్తకాల సంచాలకులు రవీంద్రనాథ్‌రెడ్డి, సమగ్ర శిక్ష రాష్ట్ర అదనపు సంచాలకులు డా. కె.వి.శ్రీనివాసులురెడ్డితో కలసి వివిధ ముద్రణ కేంద్రాలు, గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మరింత నాణ్యమైన కిట్లను సకాలంలో అందించేలా చర్యలు చేపట్టినట్లు ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement