బడులకు మరిన్ని సొబగులు.. నిర్వహణకు ప్రత్యేక అధికారి | CM Jagan Mandate Appointed special officer management of schools | Sakshi
Sakshi News home page

బడులకు మరిన్ని సొబగులు.. నిర్వహణకు ప్రత్యేక అధికారి

Published Sat, Aug 13 2022 3:12 AM | Last Updated on Sat, Aug 13 2022 4:02 PM

CM Jagan Mandate Appointed special officer management of schools - Sakshi

నాడు –నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్ల నిర్వహణ చాలా ముఖ్యం. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చాం. అన్ని వసతులు కల్పించాం. ఈ పరిస్థితిలో వాటి నిర్వహణ బాధ్యతలు ఒక ప్రత్యేక అధికారికి అప్పగించడానికి సంబంధించి.. వచ్చే సమీక్ష సమావేశం నాటికి విధి విధానాలు రూపొందించాలి. ఇందుకు ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించాలి. అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించే దిశగా అడుగులు ముందుకు వేయాలి. అత్యుత్తమ బోధనకు ఇది దోహద పడుతుంది. స్కూళ్లకు కాంపౌండ్‌ వాల్స్‌ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోండి. వీటన్నింటిపై దృష్టి పెట్టండి. 
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఎలాంటి మరమ్మతులు వచ్చినా వెంటనే బాగు చేసేలా ఒక విధానం ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకు ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌)ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించే దిశగా అడుగులు ముందుకు వేయాలని, వచ్చే ఏడాది విద్యా కానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్‌ చివరి నాటికి సిద్ధం చేయాలని చెప్పారు.

శుక్రవారం ఆయన పాఠశాల విద్యా శాఖ కార్యకలాపాలపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను వెంటనే ప్రొక్యూర్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. దశల వారీగా డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లలకు అందిస్తున్న యూనిఫామ్‌ నాణ్యతను పరిశీలించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

పాఠశాల విద్యా శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
  
పీడీఎఫ్‌ ఫైల్స్‌ రూపంలో పాఠ్యాంశాలు 
► పాఠ్య పుస్తకాలకు సంబంధించిన కంటెంట్‌.. పీడీఎఫ్‌ ఫైల్స్‌ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి. దీనివల్ల లిబరల్‌గా అందరికీ పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి.  
► వచ్చే ఏడాది విద్యా కానుకకు సంబంధించి ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధం కావాలి. ఈ కిట్‌లో ఇచ్చే వస్తువులన్నింటినీ ఏప్రిల్‌ నాటికే సిద్ధం చేసుకోవాలి. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించడానికి త్వరగా టెండర్లు ఖరారు చేసి, వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలి.  
► ప్రభుత్వేతర స్కూళ్లు ఏవైనా ప్రభుత్వ ముద్రణా సంస్థ నుంచి పాఠ్య పుస్తకాలు కావాలనుకుంటే.. నిర్ణీత తేదీలోగా ఎన్ని పుస్తకాలు కావాలో వివరాలు తీసుకుని ఆ మేరకు వాటిని అందించండి. ఎక్కడా పాఠ్య పుస్తకాల కొరత అనేది ఉండకూడదు. 
 
బాలికల భద్రతపై అవగాహన  
► రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై స్కూళ్లలో విద్యార్థినులకు సరైన అవగాహన కల్పించాలి. ఇందులో భాగంగా గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసు, ఏఎన్‌ఎం తరచుగా వీరిని కలిసేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మహిళా ఉపాధ్యాయురాలిని కౌన్సెలింగ్‌ కోసం నియమించాలి. 
► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ప్రభుత్వ సలహాదారు (పాఠశాల విద్యా శాఖ) ఏ మురళి, మహిళా.. శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎ.సిరి, ఎండిఎం డైరెక్టర్‌ దివాన్, గనుల శాఖ డైరెక్టర్‌ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement