సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బడుల్లో సిలబస్ పూర్తవ్వకపోవడం విద్యాశాఖలో సరికొత్త వివాదానికి దారితీస్తోంది. దీనికి పాఠశాల హెచ్‌ఎంలు, సంబంధిత టీచర్లను బాధ్యులను చేయాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ భావించడం కొత్త సమస్యను సృష్టిస్తోంది.
ఈ పరిస్థితికి విద్యాశాఖ అధికారులే కారణమని ఉపాధ్యాయులు నిందిస్తున్నారు. నేరం తమపై మోపితే సహించేదే లేదని చెబుతున్నారు. సిలబస్ పూర్తికాని బడుల వివరాలను పాఠశాల విద్య డైరెక్టరేట్ ఇటీవల తెప్పించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో దసరా సెలవులలోపు 80 శాతం సిలబస్ పూర్తవ్వాల్సి ఉండగా, ఎక్కడా 40 శాతానికి మించి పూర్తవ్వలేదని డీఈవోలు చెబుతు న్నారు.
కొన్ని చోట్ల 25 శాతం మాత్రమే అయిందంటున్నారు. ఇలాంటి బడుల హెచ్‌ఎంలు, టీచర్ల నుంచి వివరణ కోరాలని పాఠశాల విద్య డైరెక్టర్ డీఈవోలకు సూచించినట్టు తెలిసింది. దీంతో డీఈవోలు సంబంధిత బడుల హెచ్‌ఎంల నుంచి వివర ణ కోరేందుకు సన్నద్ధమయ్యారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
ఇక సమయమెక్కడిది?
పాఠశాల విద్యశాఖ సూచించిన లక్ష్యం పూర్తవ్వకపోవడంతో, భవిష్యత్‌లో సిలబస్ సమగ్రంగా పూర్తి చేయడం అసాధ్యమని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. స్కూళ్లు తెరిచిన రెండు నెలల వరకూ పాఠ్యపుస్తకాలు అందలేదని, ఈ కారణంగా బోధన చేపట్టలేదని టీచర్లు చెబుతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం టీచర్ల బదిలీలు, పదోన్నతుల అంశాన్ని తెరమీదకు తెచ్చిం ది. దీంతో బోధన కొంతమేర కుంటుపడింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవ్వడంతో మరో రెండు నెలలపాటు టీచర్లు ఇదే హడావిడిలో ఉంటారు. చాలామంది పోలింగ్ విధులకు వెళ్లాల్సి ఉంటుంది. వారికి కొన్ని రోజులపాటు శిక్షణ ఇస్తారు. వీటితో బోధన జరిగేందుకు వీలుకాని పరిస్థితి ఉంటుందని టీచర్లు చెబుతున్నారు.
అదీగాక, చాలాచోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ఇతర స్కూళ్ల నుంచి సర్దుబాటు చేయడంలో అధికారులు జాప్యం చేశారని టీచర్లు ఆరోపిస్తున్నారు. కాబట్టి వందశాతం సిలబస్ పూర్తి చేయడంపై వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ పరీక్షలపై ఇవన్నీ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే తమనే బాధ్యులను చేయడమేంటని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment