ఒంగోలు, న్యూస్‌లైన్ : ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దెబ్బకొట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు. సోమవారం ఉదయం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. సమైక్య ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రణాళికలో భాగంగా చంద్రబాబు టీడీపీ శ్రేణులకు కొన్ని సూచనలు చేశారని బాలాజీ చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పించడం ద్వారా జనం దృష్టి మరల్చానేది చంద్రబాబు కుట్ర అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు ఓకే అంటూ కేంద్రానికి బ్లాంక్ చెక్‌లా లేఖ ఇచ్చిన చంద్రబాబు.. ఆత్మగౌరవం పేరుతో బస్సు యాత్ర నిర్వహించడం సిగ్గుచేటన్నారు. యాత్ర ఎందుకు నిర్వహిస్తున్నాడో చెప్పకుండా.. వైఎస్సార్ కుటుంబంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్‌జీఓలు నిలదీస్తున్నా కనీసం రాష్ట్ర విభజనపై నోరు మెదపకపోవడం చంద్రబాబు నైజాన్ని తెలియజేస్తోందన్నారు. రాష్ట్రపతిని, జాతీయ నాయకులను కలిసి రాష్ట్ర విభజన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకోవాలని ఢిల్లీ నేతలను కోరడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.
వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని, అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర కమిటీ నెలరోజుల పాటు షెడ్యూల్ విడుదల చేసిందని పేర్కొన్నారు. అక్టోబరు ఒకటో తేదీన గుంటూరు నుంచి విజయవాడ వరకు ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ ఉంటుందన్నారు. గాంధీ జయంతి రోజు నుంచి జిల్లాలో కూడా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేసేందు కు, ప్రజా నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో జిల్లాలోని పార్టీ నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి బుజ్జి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, ఒంగోలు నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు.
సమైక్య ఉద్యమంపైనా టీడీపీ కుట్ర
Published Tue, Sep 24 2013 4:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
Advertisement