హోరెత్తిన సమైక్యం
సాక్షి, నెట్‌వర్క్ : సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకూ తీవ్రమవుతోంది. గురువారం 44వ రోజు కూడా అన్ని వర్గాల ప్రజలు సమరోత్సాహంతో ముందుకు కదిలారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. సీమాంధ్ర మొత్తం రోడ్డెక్కిందా అన్నట్టు రాస్తారోకోలు, మానవహారాలు, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురంలో ఈ నెల 14న ‘అనంత నారీ గర్జన’ నిర్వహించాలని మహిళా ఉద్యోగులు నిర్ణయించారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు పదవులను వీడకుండా ఉన్నార ని.. ఖాళీ కుర్చీలకు వారి ఫొటోలను అతికించి అనంతపురంలో ఉపాధ్యాయులు వినూత్న నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్సులను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది మానవహారం, చిత్తూరులో విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. 17న జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ వైద్యసేవలు నిలిపివేయాలని డాక్టర్స్ జేఏసీ తీర్మానించింది. విశాఖలో ఏయూ ఉద్యోగసంఘాలు బొత్స దిష్టిబొమ్మను దహనం చేశాయి.
తగరపువలసలో భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్‌కు చెందిన అవంతి కళాశాలను విద్యార్థులు ముట్టడించారు. విజయనగరం జిల్లాలో 48 గంటల జిల్లా గురువారం ఆర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. సాలూరులో విద్యార్థులు 500 అడుగుల జెండాతో నిరసన ర్యాలీ చేశారు. సీతానగరం మండలం కేంద్రంలో పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి ఇంటిని జేఏసీ సభ్యులు ముట్టడించారు. శ్రీకాకుళం జిల్లా రేగిడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాగావళి నదిలో సమైక్యాంధ్ర జలదీక్ష చేపట్టారు.ప్రకాశం జిల్లా ఒంగోలులో న్యాయవాదులు కోర్టు ఎదుట రోడ్డుపై వంటా-వార్పు చేపట్టారు. చీరాల బంద్ సందర్భంగా పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. కృష్ణాజిల్లా జేఏసీ ఇచ్చిన 48 గంటల బంద్ విజయవంతమైంది.
కర్నూలులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బీజేపీ, సీపీఐ కార్యాలయాలను ముట్టడించారు. టీటీపీ కార్యాలయానికి వెళుతున్న పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్‌ను ఉపాధ్యాయ జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. పాణ్యం నియోజకవర్గంలోని ఉల్లిందకొండ వద్ద పొదుపు మహిళల ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధించి, వంటావార్పు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే బంగారు ఉషారాణి ఇంటిని ముట్టడించారు. ఉండిలో అడవి మనుషులు వేషధారణలో ఉపాధ్యాయులు వినూత్నంగా నిరసన తెలిపారు. రాజీనామా చేశానంటూ పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై న్యాయవాదుల జేఏసీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కడపలో 14 యూనివర్శిటీలకు చెందిన సీమాంధ్ర జేఏసీ నాయకుల సమావేశం జరగగా, కడప జడ్పీ హాలులో రాయలసీమ టీచర్స్ జేఏసీ సమావేశం సాగింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో రాత్రి ఏడు గంటలకు 16వ నంబరు జాతీయ రహదారిపై జర్నలిస్టులు ‘హైవే నిద్ర’ కార్యక్రమం చేపట్టారు. ప్రత్తిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ‘కాంగ్రెస్ పార్టీ మాక్ ప్లీనరీ’ నిర్వహించారు.
పోటెత్తిన ‘గర్జన’లు
సాక్షి నెట్‌వర్క్ : సమైక్యమే ఊపిరిగా గురువారం ఏడు జిల్లాల్లో చేపట్టిన గర్జన కార్యక్రమాలకు వివిధ జేఏసీల ఆధ్వర్యంలో జనం భారీగా తరలి వచ్చారు. ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన ‘స్కందపురి సమైక్య గర్జన’ సదస్సు జనసంద్రమైంది. విశాలాంధ్ర వేదిక రాష్ట్ర కన్వీనర్ పరకాల ప్రభాకర్ ఈ సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు, ప్రజలు సదస్సుకు ముందు భారీ జెండాతో ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా తాటిపాకలో వర్తక, ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్వహించిన లక్ష జన గళ ఘోష కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే గోదావరి డెల్టా ఎడారిగా మారుతుందంటూ అమలాపురంలో రైతులు కదం తొక్కారు. కోనసీమ రైతు జేఏసీ ఆధ్వర్యంలో రైతు సమైక్య గర్జన చేపట్టారు. పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలిలో ‘కావలి కేక’ మార్మోగింది. తెలుగుతల్లి గొప్పతనం తెలుపుతూ గాయకులు పాడిన పాటలు స్ఫూర్తినిచ్చాయి. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు రెండు కిలోమీటర్లు పొడవున్న సమైక్య పతాకాన్ని ప్రదర్శించారు.
త్రిలింగ దేశాన్ని విడదీస్తే ప్రళయమే
కర్నూలు నగరంలో కొండారెడ్డి బురుజు సాక్షిగా మహిళా లోకం గర్జించింది. వేలాదిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారతీయ సంస్కృతి పరిరక్షణ సమాఖ్య అధ్యక్షురాలు సత్యవాణి మాట్లాడుతూ.. త్రిలింగదేశాన్ని విడదీస్తే ఉత్తరాఖండ్ మాదిరే ఇక్కడా ప్రళయం సంభవిస్తుందని హెచ్చరించారు. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండల కేంద్రంలో సమైక్య గర్జన, వైఎస్సార్ జిల్లా సుండుపల్లెలో సింహగర్జన సభలకు జనం పోటెత్తారు.
కనుమూరికి సమైక్య సెగ
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్, ఎంపీ కనుమూరి బాపిరాజును గురువారం తెల్లవారుజామున రేణిగుంటలో రైల్వేస్టేషన్‌లో సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు అడ్డుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను సమైక్యవాదినే నని కనుమూరి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ శాంతించకపోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
జై తెలంగాణ అంటే కుమ్మేశారు
జై తెలంగాణ.. అన్నందుకు ఓ వ్యక్తిని సమైక్యవాదులు చితకబాదారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం పెద్దేరు బ్రిడ్జిపై చోటుచేసుకుంది. ఇక్కడ సమైక్యవాదులు రాస్తారోకో చేస్తుండగా అటుగా ఓ వ్యక్తి వెళ్తున్నాడు. ఇతను పెద్దేరు బ్రిడ్జిపైకి రాగానే ఆందోళనకారులను చూసి ‘జై తెలంగాణ.. మీరెన్ని ఉద్యమాలు చేసినా వచ్చిన తెలంగాణ ఆగుతుందా.. ?’ అని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన సమైక్యవాదులు అతడిని చితకబాదారు. పోలీసులు జోక్యం చేసుకుని వారినుంచి ఆ వ్యక్తిని విడిపించి పంపించివేశారు.
20న విజయవాడలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ
విజయవాడ, న్యూస్‌లైన్ : విజయవాడలో ఈ నెల 20న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహించనున్నట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ ఎ. విద్యాసాగర్ వెల్లడించారు. స్థానిక ఎన్జీవో కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో విజయవాడలో సభ నిర్వహించేందుకు రాష్ట్ర కార్యవర్గం ఇప్పటికే నిర్ణయించిందన్నారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించే మహిళా గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ జోనల్ కార్యదర్శి వైవీ రావు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వ పరంచేస్తే సమ్మె విరమిస్తామంటూ వస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వైస్ చైర్మన్ ఎం. సత్యనందం మాట్లాడుతూ వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు, ఆస్పత్రుల్లో రోగులకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఆందోళనను 72 గంటలకు కుదించినట్టు తెలిపారు.
తిరుమలకు వాహనాల బంద్ వాయిదా
సాక్షి, తిరుపతి : తిరుమలకు వెళ్లే వాహనాల బంద్ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ తాత్కాలికంగా వాయిదావేసింది. ఈ నెల 14, 15 తేదీల్లో బస్సులు, ప్రైవేటు వాహనాలు తిరుమలకు వెళ్లకుండా బంద్ నిర్వహించాలని సమైక్యాంధ్ర ఉద్యోగ జేఏసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, తిరుమలకు రావడానికి ముందుగానే వాహనాలు బుకింగ్ చేసుకున్న వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు జేఏసీ చైర్మన్ రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ, త్వరలో అన్నివర్గాల జేఏసీలతో సమావేశమై బంద్ తేదీలను నిర్ణయిస్తామన్నారు. జాతీయ మీడియా ద్వారా ఈ తేదీలను ముందుగానే ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తామని, తద్వారా భక్తులు తమ రిజర్వేషన్లు రద్దు చేసుకునేందుకు లేదా వాయిదా వేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.