ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమాల నేపథ్యంలో ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేందుకు నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎల్ ప్రేమచంద్రారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ ఎన్‌జీఓల సంఘం పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. వీరిలో ఖజానా శాఖ ఉద్యోగులు కూడా ఉన్నారు. దీంతో సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఖజానా కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. జిల్లాలోని ఖజానా శాఖలో కేవలం ఉపసంచాలకులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది డీపీఓ (డేటా ప్రాసెసింగ్ ఆపరేటర్), డీఈఓలు (డేటా ఎంట్రీ ఆపరేటర్లు) మాత్రమే పని చేస్తున్నారు.
సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరవుతున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వంపై పలువురు ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగుల జీతాల చెల్లింపునకు నిబంధనలు సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఖజానా శాఖ ఉపసంచాలకులు కూడా సమ్మెలో పాల్గొంటుండటంతో జీతాల చెల్లింపు వ్యవహారం చిక్కుముడిపడింది. ఈ నేపథ్యంలో పెన్షనర్ల తరహాలోనే ఉద్యోగులకు కూడా హైదరాబాద్ నుంచే జీతాలను బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల జీతాల వివరాలతో కన్సాలిడేటెడ్ పే బిల్లును సంబంధిత శాఖ అధికారి ధ్రువీకరించి హైదరాబాద్‌లోని అర్బన్ జిల్లా ఖజానా కార్యాలయానికి పంపించాలి.
అక్కడ బిల్లును పరిశీలించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉస్మాన్ గంజ్ శాఖ ద్వారా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జీతభత్యాలను జమ చేస్తారు.
ఉదాహరణకు విద్యాశాఖ ఉద్యోగుల టీచర్లకు జిల్లా విద్యాశాఖాధికారి కన్సాలిడేటెడ్ పే బిల్లును సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా సంబంధిత ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు పే బిల్లులు సమర్పిస్తేనే విధులకు హాజరవుతున్న ఉద్యోగులకు జీతాలు వస్తాయి.
ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ఉత్తర్వులు జారీ
Published Mon, Sep 30 2013 3:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement
Advertisement