సాక్షి ప్రతినిధి, కాకినాడ : పెద్దాపురం బరిలో తెలుగుతమ్ముళ్లు ఆధిపత్య పోరుతో కత్తులు దూసుకుంటున్నారు. ఇక్కడి పార్టీ పరిస్థితి నడిసంద్రంలో చుక్కాని లేని నావలా మారింది. సుమారు మూడు దశాబ్దాల పాటు నియోజకవర్గంలో పార్టీని ఏకతాటిపై నడిపించి, చివరికి అధినేత చంద్రబాబు విధానాలతో విసుగుచెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం నియోజకవర్గంలో టీడీపీకి దిక్కూదరీ లేకుండా పోయాయి. ఇప్పుడు పార్టీలో పెద్దాపురం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరుతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం అలముకుంది. ఒకప్పుడు మంచి పట్టున్న పెద్దాపురంలో ఇప్పుడు ఆ పార్టీ అడ్రస్ కోసం వెతుకులాడుతోంది.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ టిక్కెట్టు కోసం ఒకే సామాజికవర్గం నుంచి ఇద్దరు బస్తీ మే సవాల్ అంటున్నారు. ఒకవైపు రాష్ట్ర తెలుగురైతు కార్యదర్శి ముత్యాల రాజబ్బాయి, మరో వైపు గోలి రామారావు బరిలోకి దిగి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పెద్దాపురం పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బొడ్డు బంగారుబాబుకు నాయకత్వ పటిమ లేకపోవడంతోనే ఈ సమస్య వచ్చి పడిందంటున్నారు. కాగా పార్టీ అధినేత చంద్రబాబు పెద్దాపురం టిక్కెట్టును సిట్టింగ్ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్‌ను పార్టీలోకి రప్పించి, ఆయనకే ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం.
పార్టీ కార్యక్రమాల్లో రాజబ్బాయి, రామారావు పైకి నవ్వుతూ కనిపిస్తున్నా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది. చివరకు ‘ఇంటింటా టీడీపీ’ కార్యక్రమం చేపట్టినా ఎవరి ఆధిపత్యం కోసం వారు ప్రయత్నిస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. పెద్దాపురం రూరల్‌కు చెందిన రాజబ్బాయి పట్టణంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడమే కాకుండా కార్యాలయం గోడల మీద తన ఫొటో వేసుకోవడంపై రామారావు వర్గీయులు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. రూరల్ పరిధిలో కాక పట్టణంలో ఏర్పాటు చేసుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర తెలుగురైతు కార్యదర్శిగా పార్టీ కార్యాలయాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే హక్కు తనకుందన్నది రాజబ్బాయి వాదన. వీరిద్దరి వివాదం నేపథ్యంలో పెద్దాపురం మరిడమ్మ ఆలయం సమీపాన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభానికి నోచుకోవడం లేదని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ర్యాలీతో విభేదాలు రట్టు
సమైక్యాంధ్ర ఉద్యమంలో జె.తిమ్మాపురం నుంచి నిర్వహించిన మోటారుసైకిల్ ర్యాలీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలపై రాజబ్బాయి ఫొటోలు ఉండటాన్ని రామారావు వర్గీయులు ప్రశ్నించడంతో ఆయన ర్యాలీలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఆ తరువాత నిర్వహించిన రైతుగర్జనలో కూడా ఇదే పరిణామం పునరావృతమైంది. ఇటీవల పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు స్వగృహంలో జరిగిన పార్టీ సమావేశానికి కూడా రాజబ్బాయి దూరంగానే ఉన్నారు. నియోజకవర్గానికి నాయకుడెవరో తేల్చాలంటూ ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి పోతుల విశ్వాన్ని కొందరు ప్రశ్నించారు. ఏమీచెప్పాలో తెలియక విశ్వం తలపట్టుకోవాల్సి వచ్చిందంటున్నారు. రాయభూపాలపట్నంలో బడ్డీకొట్టును తగలబెట్టిన వ్యవహారంలో రాజబ్బాయి సహా ఆయన అనుచరులు నిందితులుగా ఉన్నారు. రామారావు, ఆయన అనుచరులు దుకాణ యజమానికి సహకరిస్తూ తమ నేతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని రాజబ్బాయి వర్గం మండిపడుతోంది.
‘పరుచూరి’ పేరూ పరిశీలనలో..
టీడీపీ అధినేత చంద్రబాబు మరోరకంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న పంతం గాంధీమోహన్ గతంలో టీడీపీలో ఉన్నారు. ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకుని, అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ గాంధీమోహన్ కాకపోతే సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ పరుచూరి కృష్ణారావు పేరును పరిశీలించాలనుకుంటున్నట్టు సమాచారం. దీంతో పార్టీలో ఉండాలో, బయటకు పోవాలో తెలియని సందిగ్ధంలో క్యాడర్ కొట్టుమిట్టాడుతోంది.
పెద్దాపురం ‘దేశం’లో అంతర్యుద్ధం
Published Fri, Dec 20 2013 2:56 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement