ఒంగోలు, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పాలకులు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని మాజీమంత్రి మారెప్ప విమర్శించారు. కృత్రిమ ఉద్యమమైన తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించిన కేంద్రం.. రాష్ట్రానికి మరింత నష్టం కలిగించిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన కోసం తెలంగాణవాదులంతా సోనియాగాంధీ వద్ద వాస్తవాలు దాచిపెట్టారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుని కేంద్రం తప్పుచేసిందన్నారు. అసెంబ్లీలో నిర్ణయం తీసుకోకుండా కేంద్ర క్యాబినెట్ ఏకగ్రీవంగా రాష్ర్ట విభజన నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల చేతగానితనం వల్లే అలా జరిగిందన్నారు.
స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డ్రామాలు మానుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. చేతనైతే రైతుల రుణాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రుణాలను రద్దుచేయాలని సవాల్ విసిరారు. వైఎస్‌ఆర్ హయాంలో రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకుని కష్టనష్టాల నుంచి వారిని గట్టెక్కించేవారని గుర్తుచేసుకున్నారు. సుమారు 13 వేలకోట్ల రూపాయల రైతుల రుణాలను వైఎస్‌ఆర్ రద్దుచేశారని చెప్పారు.
వైఎస్‌ఆర్ ఆశయసాధన కోసం, ఆయన మరణించిన సమయంలో తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఓదార్చడం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెనుకడుగు వేయలేదన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానానికి సైతం ఎదురుతిరిగాడని, అందుకనే ఆయన్ను అన్యాయంగా జైలుపాలుచేసి కక్ష సాధించారని మారెప్ప మండిపడ్డారు. జగన్ భయంతోనే చివరకు రాష్ట్ర విభజనకు సైతం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికుట్రలు చేసినా జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఎవరు ఎదురుతిరిగినా సీబీఐని ఉసిగొలిపి కక్ష సాధించడం షరామామూలేందని మారెప్ప విమర్శించారు.
చిరంజీవిని ప్రజలు ఆదరించరు...
చిరంజీవి కొత్తపార్టీ పెడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయని, ఆయన్ను నమ్మి ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని మారెప్ప స్పష్టం చేశారు. పీఆర్పీ పేరుతో ఆయన చేసిన మోసాన్ని ప్రజలు ఇంకా మరవలేదన్నారు. హైదరాబాద్‌ను రాష్ట్ర ప్రజలంతా అభివృద్ధి చేసుకున్నారని, దాన్ని ఒక ప్రాంతానికే కేటాయించడం సరికాదని పేర్కొన్నారు. అదే జరిగితే సీమాంధ్ర ప్రాంత ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు చంద్రబాబునాయుడు నడుంబిగించారని విమర్శించారు. ఆయన మాటలు, చేతలు అలాగే ఉన్నాయన్నారు.
1975లో ఎస్టీ సబ్‌ప్లాన్, 1980లో ఎస్సీ సబ్‌ప్లాన్ అమల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటివరకు 30 వేల కోట్ల ఎస్సీ, ఎస్టీ నిధులను దారిమళ్లించారని మారెప్ప వెల్లడించారు. ప్రస్తుతం 13 వేల కోట్ల రూపాయలను సబ్‌ప్లాన్‌కోసం కేటాయించినందున ఎస్పీ, ఎస్టీలకు బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కోటి రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా బ్యాంకులు రుణాలివ్వాలని నిబంధనలున్నా.. ఇప్పటి వరకు కనీసం 15 వేల రూపాయలు కూడా ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రాలేదని విమర్శించారు. కనీస సౌకర్యాలు లేని ఇంజినీరింగ్ కాలేజీలను గుర్తించి వాటికిచ్చిన అనుమతులు, గుర్తింపును వెంటనే రద్దుచేయాలని మారెప్ప డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు దారా సాంబయ్య ఉన్నారు.
రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు: మారెప్ప
Published Thu, Oct 31 2013 6:59 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM
Advertisement