
జన నినాదమై ఎగసిన సమైక్య సమరానికి శతదినోత్సవం
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం గురువారం నాటికి వంద రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా సీమాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల సమైక్యవాదులు, విద్యార్థులు వంద అంకె రూపంలో మానవహారాలుగా నిలబడ్డారు. విశాఖలో సోనియా, కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో 216 జాతీయ రహదారి సమీపంలో ఉపాధ్యాయ, విద్యార్థి గర్జన నిర్వహించారు. వివిధ జేఏసీల పిలుపు మేరకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లు, తాడేపల్లి గూడెం, నరసాపురం, తణుకు, నిడదవోలు, ఆకివీడులలో చేపట్టిన బంద్ విజయవంతమైంది.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా కావలిలో విద్యార్థు లు ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిలో 200ల అడుగుల జాతీయ జెండా ను ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్జీవో ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో ఎన్జీవోలు, ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీల ఆధ్వర్యంలో సాయంత్రం గాంధీ విగ్రహం నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. అనంత పురంలో యువజన జేఏసీ ఆధ్వర్యంలో యువభేరి బహిరంగ సభ నిర్వహించారు. ప్రభుత్వోద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయులు టవర్‌క్లాక్ వద్ద రాస్తారోకో చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భగత్‌సింగ్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రాజకీయ జేఏసీ, ఆల్‌మర్చంట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఒక్కరోజు పట్టణ బంద్ నిర్వహించారు.
మంత్రి రఘువీరాకు సమైక్య సెగ..
పుట్టపర్తిలో మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి సమైక్య సెగ తగిలింది. పుట్టపర్తిలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమం, సత్యసాయి 88వ జయంతి వేడుకలకు సంబంధించి అధికారులతో సమీక్షిం చడానికి పుట్టపర్తికి వచ్చారు. మంత్రిని చూసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, జేఏసీ నేతలు అడ్డుకుని.. రఘువీరా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.