seemandhra districts
-
మూడో కూటమి 'పార్కింగ్ ప్లేస్' లాంటిది
త్వరలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సీమాంధ్రలో పర్యటించేలా ఏర్పాటు చేస్తానని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్య నాయుడు వెల్లడించారు. సీమాంధ్ర జిల్లాల బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని బుధవారం విజయవాడలో ఆయన ప్రారంభించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... సీమాంధ్ర ప్రాంత సమస్యలు పరిష్కరించే సత్తా ఒక్క బీజేపీకే ఉందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్డినెన్స్ చేయాలని తమ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిందని తెలిపారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం బీజేపీలను ఒడించేందుకు దేశంలోని పలు పార్టీలు ఏకమై మూడో కూటమి (థర్డ్ ఫ్రంట్) అంటూ తెరపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. మూడో కూటమిలోని పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ సొంత ఎజెండాతో వస్తున్నాయని, అయా పార్టీల అధ్యక్షులంతా ప్రధాని పదవి అధిష్టించాలని ఉబలాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీల ఓట్లను చీల్చడమే మూడో కూటమి ప్రధాన ఉద్దేశ్యమని ఆయన ఆరోపించారు. మూడో కూటమి 'పార్కింగ్ ప్లేస్' లాంటిదని ఆయన అభివర్ణించారు. మూడో కూటమికి ఓటు వేస్తే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లే అని ఆయన పార్టీ శ్రేణులను హెచ్చరించారు. అధికార పక్షం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన సార్వత్రిక ఎన్నికల అనంతరం మోడీ ప్రధాని పదవి చేపట్టడం ఖాయమన్నారు. మోడీని ప్రధాని గెద్ద నెక్కించేందుకు దేశంలోని ప్రజలంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. యూపీఏ పాలనలో పేరుకుపోయిన అవినీతి, రైతు ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలే తమ ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో 274 పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించిన సంగతిని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. -
విభజనను తట్టుకోలేక ఆగిన గుండెలు
సీమాంధ్రలో ఏడుగురు మృతి న్యూస్‌లైన్ నెట్వర్క్: రాష్ట్ర విభజనను తట్టుకోలేక సీమాంధ్ర జిల్లాలో బుధవారం ఏడుగురు మరణించారు. కృష్ణాజిల్లాలో అత్యధికంగా నలుగురు మరణించగా, పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖ జిల్లాల్లో మరో ముగ్గురు తనువు చాలించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంలో పాస్టర్ ఖండెల్లి ప్రభాకర్ (40).. విభజన వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని మంగళవారం రాత్రంతా ఆవేదన చెందాడని, బుధవారం మధ్యాహ్నం గుండె ఆగి మృతి చెందాడని కుటుంబ సభ్యులు చెప్పారు. అలాగే, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామానికి చెందిన తాడేపల్లి సాంబశివరావు (70) విభజన వార్తలతో కలత చెంది మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం పెంట గ్రామంలో రొంగలి రాము (55) కూడా మంగళవారం రాత్రి విభజన వార్తలు చూసి కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కృష్ణాజిల్లాలో..: చాట్రాయి మండలం పర్వతాపురానికి చెందిన బయగాని మానియ్య (68), వత్సవాయి మండలం శింగవరం గ్రామానికి చెందిన కొలగాని కొండయ్య (52), కంకిపాడుకు చెందిన మద్దుల తాతారావు (60), కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన కాండ్రు ఏసురత్నం (60)లు కూడా విభజన వార్తలు చూస్తూ గుండెపోటుకు గురై మృతిచెందాడు. -
సీమాంధ్ర జిల్లాల్లో ప్లెక్సిల రాజకీయం
-
సీమాంధ్రలో భద్రత పర్యవేక్షణకు సీనియర్ ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో భద్రతాచర్యలను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకూ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కేటాయిస్తూ డీజీపీ ప్రసాదరావు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం డీజీపీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలో ఎస్పీలు, రేంజ్ డీఐజీలు, రీజియన్ ఐజీలు ఉన్నప్పటికీ సీనియర్ అధికారులను జిల్లాలకు పంపారు. రీజియన్ ఐజీలు ఖచ్చితంగా ఆ రీజియన్‌లోనే ఉండాలని డీజీపీ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఐజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు ఆయా జిల్లాల్లో భద్రతా చర్యలను పర్యవేక్షించనున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడతారనే సమాచారం నేపథ్యంలో సీమాంధ్రలో మళ్లీ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. 12వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభంకానున్నాయి. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందనే విషయంపై కూడా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, విద్యార్ధి, యువజన జేఏసీలు ఆందోళనలకు ప్రణాళికను ప్రకటించాయి. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అప్పటి హోంమంత్రి చిదంబరంచేసిన ప్రకటనకు నిరసనగా 9వ తేదీని విద్రోహ దినంగా ప్రకటించాలని ఇప్పటికే అన్ని జేఏసీలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే 24 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలు మోహరించిన సంగతి తెలిసిందే. -
సమైక్యతే లక్ష్యంగా.. 123 రోజుల జనోద్యమం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 123వ రోజూ శనివారం సీమాంధ్ర జిల్లాల్లో సాగింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు.. ఇలా విభిన్న రూపాల్లో సమైక్యవాదులు రాష్ర్టం కలిసే ఉండాలన్న ఆకాంక్షను చాటారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థులు, జేఏసీ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. విద్యార్థులు 123 సంఖ్య ఆకారంలో కూర్చుని సమైక్య నినాదాలు చేశారు. కృష్ణాజిల్లా కలిదిండిలో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీ-బిల్లు పెడితే మెరుపు సమ్మె: విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెడితే మెరుపు సమ్మెకు దిగుతామని సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ పోలాకి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన విశాఖపట్నంలో ఒక ప్రకటనలో విడుదల చేశారు. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌథ వద్ద సమైక్యాంధ్ర ధర్నాలో తెలంగాణ ఇంజనీరు సీమాంధ్రకు చెందిన ఓ మహిళా ఉద్యోగినిపై పరుష పదజాలంతో దూషణలకు దిగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కొనసాగుతున్న వైఎస్సార్సీపీ శ్రేణుల దీక్షలు సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీమాంధ్ర జిల్లాల్లో చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా కైకలూరులో ఈ దీక్షలు 116వ రోజుకు చేరాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, చిత్తూరు జిల్లా పలమనేరు, తిరుపతిలో చేపట్టిన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. ఇక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శనివారం పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు గ్రామాల్లోకి వెళ్లి గడపగడకూ వైఎస్సార్ సీపీ సమైక్యనాదం పేరిట పాదయాత్రలు చేపట్టారు. సమైక్యాంధ్ర ఆవశ్యకత, రాష్ట్ర సమైక్యతకు పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న అవిరళకృషిని ప్రజలకు వివరిస్తున్నారు. -
అదే జోరు.. జనోద్యమం @ 122
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 122వ రోజూ శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి సమైక్య నినాదాలను హోరెత్తించారు. సైమైక్యాంధ్ర మ్యాప్ ఆకారంలో కూర్చుని రాష్ట్రాన్ని విభజించవద్దని నినదించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం జరిగిన రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అధికారులతో మంత్రి కాసు కృష్ణారెడ్డి సమైక్యాంధ్ర జిందాబాద్, విభజన వద్దు... సమైక్యాంధ్ర ముద్దు... అని నినాదాలు చేయించారు. ఇక్కడ నినాదాలు ఢిల్లీ పెద్దలకు వినిపించాలంటూ గట్టిగా నినాదాలు చేయించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా, తెలుగు వారి ఆశయాలకు అనుగుణంగా తొలిసారిగా రూపుదిద్దుకున్న భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విభజిస్తుంటే చూస్తు ఊరుకోబోమని కృష్ణా జిల్లా కలిదిండి జేఏసీ నాయకులు హెచ్చరించారు. విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నారంటూ కేంద్ర మంత్రి చిరంజీవి దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగాయలంకలో జేఏసీ నాయకులు రాస్తారోకో చేసి రోడ్డుపై బైఠాయించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద విద్యార్థి సమరభేరి నిర్వహించారు. వైఎస్సార్సీపీ శ్రేణుల పాదయాత్ర గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ సమైక్యనాదం పేరిట పార్టీ నేతలు పలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టి ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను, రాష్ట్ర పరిరక్షణకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న నిర్విరామకృషిని వివరిస్తున్నారు. తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం, కడపలో పాదయాత్రలు జరిగాయి. చిత్తూరులో పార్టీ కార్యకర్తలు రాస్తారోకో చేశా రు. ఇక కృష్ణా, విజయనగరం, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లాల్లో దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. -
ముక్కలు కానివ్వం.. సమైక్యవాదుల ప్రతిన
108రోజులకు చేరిన ఉద్యమం సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం 108వరోజూ శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగా సాగింది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని ప్రతిజ్ఞ చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు విజయవాడలో రైల్‌రోకో చేపట్టేందుకు విఫలయత్నం చేశారు. న్యాయవాదుల ప్రతిఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం నాగులూరుకు చెందిన 74ఏళ్ల గోగులమూడి రామకోటిరెడ్డి కాలినడకన 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బయల్దేరి వెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ముస్లిం లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. కాగా, రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు తెలియజేస్తే ఎస్కేయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటాలు చేయడంతో పాటు అవసరమైతే భౌతిక దాడులకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు పరుశురాంనాయక్ హెచ్చరించారు. మంత్రి రఘువీరా, ఎమ్మెల్యే గుప్తాకు సమైక్యసెగ అనంతపురం జిల్లా కదిరిలో మంత్రి రఘువీరారెడ్డిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లోపు తెలంగాణపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి రఘువీరా చెప్పారు. అనంతపురంలో డీసీసీ అధ్యక్షుడు, గుంతకల్లు ఎమ్మెల్యేమధుసూదన్గుప్తాను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) జేఏసీ నాయకులు అడ్డుకుని సమైక్య నినాదాలు చేశారు. మోసం చేసిందని చెబుతున్న పార్టీలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ శ్రేణుల ఉద్యమపథం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు పార్టీ శ్రేణులు శుక్రవారం కూడా విభిన్నరూపాల్లో ఆందోళనలు కొనసాగించాయి. తూర్పుగోదావరి పి.గన్నవరం మండ లం ముంగండపాలెంలో, ప్రత్తిపాడు నియోజకవర్గంలో జడ్డంగి అన్నవరం, తూర్పు లక్ష్మీపురం గ్రామా ల్లో గడపగడపకూ వైఎస్సార్సీపీ సమైక్యనాదం పేరిట పాదయాత్రలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బిరదవోలులో సమైక్య దీవెనయాత్ర చేపట్టారు.బాలాయపల్లి మండలం కాలగంధ, కాట్రగుంట, కరిమెనగుంట గ్రామాల్లో, అనంతపురం జిల్లా నల్లమాడలో పాదయాత్రలు చేపట్టారు. చిత్తూరులో గడపగడపకూ సమైక్యశంఖారావం పేరిట పాదయాత్ర జరిగింది. జిల్లాలోని పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి రిక్షాతొక్కి నిరసన తెలిపారు. -
జన నినాదమై ఎగసిన సమైక్య సమరానికి శతదినోత్సవం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం గురువారం నాటికి వంద రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా సీమాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల సమైక్యవాదులు, విద్యార్థులు వంద అంకె రూపంలో మానవహారాలుగా నిలబడ్డారు. విశాఖలో సోనియా, కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో 216 జాతీయ రహదారి సమీపంలో ఉపాధ్యాయ, విద్యార్థి గర్జన నిర్వహించారు. వివిధ జేఏసీల పిలుపు మేరకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లు, తాడేపల్లి గూడెం, నరసాపురం, తణుకు, నిడదవోలు, ఆకివీడులలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా కావలిలో విద్యార్థు లు ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిలో 200ల అడుగుల జాతీయ జెండా ను ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్జీవో ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో ఎన్జీవోలు, ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీల ఆధ్వర్యంలో సాయంత్రం గాంధీ విగ్రహం నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. అనంత పురంలో యువజన జేఏసీ ఆధ్వర్యంలో యువభేరి బహిరంగ సభ నిర్వహించారు. ప్రభుత్వోద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయులు టవర్‌క్లాక్ వద్ద రాస్తారోకో చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భగత్‌సింగ్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రాజకీయ జేఏసీ, ఆల్మర్చంట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఒక్కరోజు పట్టణ బంద్ నిర్వహించారు. మంత్రి రఘువీరాకు సమైక్య సెగ.. పుట్టపర్తిలో మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి సమైక్య సెగ తగిలింది. పుట్టపర్తిలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమం, సత్యసాయి 88వ జయంతి వేడుకలకు సంబంధించి అధికారులతో సమీక్షిం చడానికి పుట్టపర్తికి వచ్చారు. మంత్రిని చూసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, జేఏసీ నేతలు అడ్డుకుని.. రఘువీరా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. -
2 నుంచి సమైక్య కళా భేరీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత జస్టిస్ లక్ష్మణరెడ్డి సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్న నేతల తీరును ఎండగట్టాలి రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించాలని పిలుపు రాష్ట్ర విభజనపై ప్రజలను జాగృతం చేసేందుకు డిసెంబర్ 2 నుంచి 30 వరకు సీమాంధ్ర జిల్లాల్లో సమైక్య కళా భేరీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత జస్టిస్ లక్ష్మణరెడ్డి తెలిపారు. ‘వంద రోజుల సమైక్య ఉద్యమ సమాలోచన’పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. గురువారం ఆయన వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి, పి.రామారావు, పుత్తాశివ, పోతుల శివశంకర్, మాగంటి రాంబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే కలిగే ప్రయోజనాలు, విడిపోతే వచ్చే నష్టాలను ప్రజలకు సాంస్కృతిక కళారూపాల ద్వారా వివరించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్న జేఏసీలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మళ్లీ తెరపైకి వస్తున్న రాయల తెలంగాణ ప్రతిపాదనను సమైక్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన తప్పదన్నట్టు ప్రకటనలిస్తూ సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్న సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీల తీరును ప్రజలు ఎండగట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విభజన రహస్యంగా జరగాల్సిన వ్యవహారం కాదని, కేంద్ర మంత్రుల బృందంతో పాటు దీనికి సంబంధించి ఇతర నివేదికలను ప్రజల ముందు చర్చకు ఉంచాలని డిమాండ్ చేశారు. సమైక్య ఉద్యమంలో ఏపీఎన్జీవోల పాత్ర అభినందనీయమే అయినా, కీలక సమయంలో వారు ఉద్యమాన్ని విరమించటం బాధాకరమన్నారు. సరైన సమయంలో వారు మళ్లీ ఉద్యమిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రులు, ఎంపీలు వెంటనే రాష్ట్రపతిని కలిసి కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తమ ఆకాంక్షను తెలియజేస్తూ రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు లక్షల సంఖ్యలో పోస్టుకార్డులు పంపాలని సమైక్యవాదులను కోరారు. నవంబర్ 14 నుంచి 19 వరకు కర్నూలులో రచయితలతో సదస్సు నిర్వహిస్తామని, 20 నుంచి 28 వరకు 210 మంది కళాకారులకు సమైక్య ఉద్యమానికి సంబంధించి వీధినాటకాలు, పల్లెసుద్దులు, జానపద గేయాలపై కర్నూలులో శిక్షణ ఇస్తామని తెలిపారు. 9న ఒంగోలులో, 10న భీమవరంలో, 17న శ్రీకాకుళం, గజపతినగరంలో జిల్లా సదస్సులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. -
సీమాంధ్ర దారులన్నీ బంద్,నేడూ కొనసాగనున్న దిగ్బంధనం
-
దారులన్నీ బంద్
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం.. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు సమైక్య నినాదాలతో హోరెత్తిన రోడ్లు.. కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ రోడ్లపైనే వంటావార్పులు, మానవహారాలు, వినూత్న నిరసనలు విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ఆందోళనకు ప్రజల మద్దతు వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తల అరెస్టులు నేడూ కొనసాగనున్న దిగ్బంధనం సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర నినాదాలతో బుధవారం సీమాంధ్ర జిల్లాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులు హోరెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళనలతో రహదారులన్నీ స్తంభించాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో రోడ్డు రవాణా దాదాపు స్తంభించిపోయింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు నాయకులు, కార్యకర్తలు చేపట్టిన 48 గంటల రహదారుల దిగ్బంధం బుధవారం తొలి రోజు విజయవంతమైంది. ఉదయం నుంచే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి జై సమైక్యాంధ్ర.. జై జగన్ నినాదాలు మిన్నంటించారు. రోడ్లపై మానవహారాలుగా నిలబడ్డారు. వంటావార్పులు, ధర్నాలు, వినూత్న నిరసనలు చేపట్టారు. జిల్లాల మీదుగా వెళ్లే జాతీయరహదారులపై ప్రతి ఇరవై కిలోమీటర్ల దూరంలో పార్టీ కార్యకర్తలు రాస్తారోకోలు చేశారు. ఒక్కో జిల్లాలో హైవేపై కనీసంగా పాతిక, ముప్పై చోట్ల ఆందోళనలు చేపట్టారు. దీంతో జాతీయరహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. ఇక స్టేట్‌హైవేలు, పంచాయతీరాజ్ రహదారులపై వాహనాలను అటకాయించారు. వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆందోళనకు సీమాంధ్ర ప్రజ బాసటగా నిలబడింది. పల్లెప్రాంతాల్లోనూ గ్రామీణులు వేలాదిగా రోడ్లపైకి వచ్చి బైఠాయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చెట్లను నరికి రోడ్డుపై పడేసి వాహనరాకపోకలను అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. అంబులెన్సులు, 108 వాహనాలకు మాత్రం మినహాయింపునిచ్చిన పార్టీ శ్రేణులు మిగిలిన అన్ని వాహనాలనూ అడ్డుకున్నాయి. రాత్రి వేళ కూడా పార్టీ శ్రేణులు ఆందోళనలు కొనసాగించాయి. రోడ్లపై కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేపట్టాయి. పార్టీ ముందుగానే పిలుపునిచ్చిన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో విద్యాసంస్థలు బుధవారం మూతపడ్డాయి. ఇక చాలాచోట్ల ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదల్లేదు. కొన్నిచోట్ల డిపోల నుంచి బయటకు వచ్చిన బస్సులు గంటలసేపు ఆలస్యంగా ప్రయాణించాయి. రాజకీయప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని యూపీఏ సర్కారు, కాంగ్రెస్ హడావుడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ప్రజాకాంక్షను ఢిల్లీ పెద్దలకు తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ చేపట్టిన ఈ ఆందోళనకు ప్రయాణికులు, వాహనదారులూ సంఘీభావం ప్రకటించారు. పలుచోట్ల రోడ్లపై స్వచ్ఛందంగా వాహనాలు నిలిపి పార్టీ శ్రేణులతో కలిసి సమైక్యనినాదాలు చేశారు. రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించడంతో వాహనాల డ్రైవర్లు, సిబ్బంది, ప్రయాణీకులకు పార్టీ నేతలే భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో ఏ రాజకీయపార్టీ చేపట్టని విధంగా తొలిసారిగా 48గంటలసేపు రోడ్ల దిగ్బంధానికి వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. రోడ్లపైకి వచ్చిన వందలాదిమంది నేతలు, వేలాదిమంది కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేశారు. పోలీసుల తీరును ముందే ఊహించిన పార్టీ నేతలు వ్యూహాత్మకంగా ఆయా జిల్లాల్లో రాస్తారోకోలను ఒక్కచోటకే పరిమితం చేయకుండా, బృందాల వారీగా కార్యకర్తలను పలుచోట్లకు పంపి రోడ్లను దిగ్బంధం చేపట్టారు. బుధవారం ఒక్కరోజే 13 జిల్లాల్లో 3054 మంది నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేసి కేసులు నమోదు చేశారు. ‘అనంత’లో ఉద్రిక్తత అనంతపురంలో రాస్తారోకో చేస్తున్న పార్టీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంచేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఈడ్చుకెళ్లారు. మహిళలను చూడకుండా బలంవంతంగా లాక్కెళ్లి జీపులో పడేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన తేరుకున్న తర్వాత అరెస్ట్ చేసి త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే అరెస్ట్‌కు నిరసిస్తూ పార్టీ శ్రేణులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించాయి. కనేకల్లులో పార్టీ కార్యకర్తల అరెస్టు నిరసిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధర్నా చేశారు. పార్టీ కార్యకర్తలు ఎస్కేయూ వర్శిటీని బంద్ చేయించి.. 205 రహదారిని దిగ్బంధించారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల ముట్టడి చేపట్టారు. కర్నూలు నగరంలోని తుంగభద్ర నదిపై ఉన్న బ్రిడ్జిని దిగ్బంధించి ఇరువైపులా రాకపోకలను స్తంభింపజేశారు. నంద్యాల, ఆళ్లగడ్డల్లో 18వ నంబర్ జాతీయ రహదారిని దిగ్భందించారు. డోన్‌లో 7వ నంబర్ జాతీయ రహదారిపై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలను నిలువరించారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు-బళ్లారి రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా 45చోట్ల రోడ్లను దిగ్బంధించారు. కడపలో కర్నూలు-చెన్నై, , కడప-రాయచోటి రహదారులపై ఉదయం 6గంటల నుంచే కార్యకర్తలు బైఠాయించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4.30 గంటల నుంచి రాకపోకలు అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయటకు రాకుండా కార్యకర్తలు గేటు ఎదుట బైఠాయించారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాజంపేట-తిరుపతి రహదారిని దిగ్భందించారు. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో,రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో రోడ్లను దిగ్భందించారు. తిరుమలకూ రోడ్ల దిగ్బంధం సెగ తమిళనాడు లోని వేలూరు మార్గం, కర్నాటక నుంచి వచ్చే బస్సులు, బెంగళూరు బస్సులు నిలిచి పోవడంతో తిరుమలకు భక్తుల రద్దీ తగ్గిపోయింది. చిత్తూరు జిల్లా కుప్పంలో బస్సులు కర్ణాటక సరిహద్దు వరకు వచ్చి నిలిచిపోయాయి. పుంగనూరు వద్ద ఆందోళనకారులు పెద్ద చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. చంద్రగిరి వద్ద జాతీయ రహదారి ట్రాక్టర్లతో నిండిపోవడంతో ఆ వైపు ఎలాంటి వాహనాలు వెళ్లలేదు. పుత్తూరు, నగరి, నాగలాపురం, నారాయణవనంలో రోడ్లను దిగ్బంధం చేయడంతో చెన్నైకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో రాస్తారోకో చేశారు. చంద్రగిరిలో తిరుపతి-చిత్తూరు రోడ్డుకు 50 ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి వాహనాలను అడ్డుకున్నారు. హైవేపైనే వంటావార్పు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం గరికపాడు అడ్డరోడ్డు వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఐదుగంటల పాటు జాతీయరహదారిని రహదారిని దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ పెద్దఎత్తున స్తంభించింది. ఇబ్రహీంపట్నంలో హైవేపైనే వంటావార్పు నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నానిల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పామర్రులో రోడ్డును దిగ్బంధించి వంటావార్పు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉదయం 5.30 గంటలనుంచే బస్సులను అడ్డుకున్నారు. దర్శిలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట, మంగళగిరి, పెదకాకానిల వద్ద చెన్నై-కోల్కత్తా జాతీయ రహదారిపై పార్టీ నేతలు, కార్యకర్తలు గంటలసేపు ఆందోళన చేపట్టడంతో కిలోమీటర్ల మేర చెన్నై హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సత్తెనపల్లిలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలోగుంటూరు-మాచర్ల రహదారిని ట్రాక్టర్లు అడ్డుపెట్టి దిగ్బంధించారు. గుంటూరు నగరంలో నేతలు అంకిరెడ్డి పాలెం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పార్టీ నేత ముస్తఫా జాతీయ రహదారిపై వంటా వార్పు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాళెం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపైనే సాంస్కృతిక కార్యక్రమాలు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద మోరంపూడి సెంటర్లో జాతీయ రహదారిపై సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అమలాపురంలో ఎర్ర వంతెన వద్ద పార్టీ నేతలు కార్యకర్తలు 216 జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, తదితరులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉదయం 9 గంటల నుంచే టెంట్లు వేసి వాహనాల రాకపోకలకు అడ్డుపడటంతో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు, లారీలు, ఆటోలు, ఇతర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రత్తిపాడు వద్ద రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి వాహనాలను అడ్డుకున్నారు. విజయనగరం జిల్లాలో ఉదయం నాలుగు గంటల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో నిర్వహించిన దిగ్బంధం వల్ల ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి(ఎన్‌హెచ్-16)తో పాటు రాష్ట్రీయ రహదారులను దిగ్బంధించారు. పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే కృష్ణదాస్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై కొవ్వొత్తులతో రాత్రి నిరసన ప్రదర్శన నిర్వహించారు. విశాఖ జిల్లా పాడేరులో ఉదయం 5 గంటల నుంచే పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో వారపు సంతకు వెళ్లే వాహనాలు గంటలతరబడి నిలిచిపోయాయి. కె.కోటపాడులో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను నిలిపి వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. నర్సీపట్నంలో రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికి రహదారుల్ని దిగ్బంధించారు. జిల్లా మీదుగా వెళ్లే 16వ నెంబరు జాతీయరహదారిపై పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టడంతో గంటలసేపు వాహనాలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లాలాచెరువు సెంటర్లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో, రావులపాలెం వద్ద మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో 16వ నంబరు జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు. -
చల్లారని ఉద్యమాగ్ని.. అలుపెరుగని సమైక్య పోరు
మూడు నెలలుగా అలుపెరుగని సమైక్య పోరు సాక్షి నెట్వర్క్ : సీమాంధ్ర జిల్లాల్లో ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమం నిరవధికంగా సాగుతోంది. వేర్పాటు ప్రకటన వెనక్కి వెళ్లేవరకూ పోరాటాన్ని ఆపేదిలేదంటూ తెగేసి చెబుతున్న సమైక్యవాదులు విభిన్న రూపాల్లో ఆందోళనలు హోరెత్తిస్తున్నారు. వరుసగా 90వ రోజైన సోమవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ ప్రదర్శనలు, విభజన యత్నాలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు పోటెత్తాయి. తొంభై రోజుల ఉద్యమానికి సంకేతంగా చాలాచోట్ల విద్యార్థులు 90 అంకె ఆకారంలో ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై ధర్నా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు, వీఆర్వోలు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మదనపల్లెలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీకాళహస్తిలో ఇంజినీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బి.కొత్తకోటలో విద్యార్థులు ర్యాలీ చేశారు. చిత్తూరు ఎన్జీవో హోం వద్ద ఎన్జీవోలు రిలే దీక్షలు ప్రారంభించారు. తిరుపతిలో రెవెన్యూ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అనంతపురంలో యువ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్మించి సమైక్య నినాదాలు చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాస్కులు ధరించి.. రాజ్యాంగాన్ని పరిరక్షించండి అంటూ ప్రదర్శన నిర్వహించారు. పెనుకొండలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలుపగా.. విద్యార్థులు ర్యాలీ చేశారు. రాయదుర్గంలో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీకి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థుల భారీ ర్యాలీ కడపలో ఇంజనీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏడురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో ఆర్టీసీ ఎన్ఎంయూ సభ్యులు దీక్ష చేపట్టారు. ఆంధ్రా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు. సమైక్యాంధ్ర కోసం ఎవరైనా సభలు, సమావేశాలు పెట్టుకోగా లేనిది వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని నడిబొడ్డున సమైక్య శంఖారావం మోగిస్తే లగడపాటికొచ్చిన ఇబ్బందేమిటో చెప్పాలని విద్యార్థులు నినదించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో పెన్షనర్లు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎన్జీవోలు రిలే దీక్ష చేపట్టారు. తాడేపల్లిగూడెంలో న్యాయవాదులు రోడ్డుపై గుంజీలు తీసి నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఎన్జీవోలు ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్సీపీ అకుంఠిత దీక్షలు సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. ప్రతిచోటా పార్టీ కార్యకర్తలు, నేతలు రిలే దీక్షలు చేపడుతున్నారు. నేడు నాగార్జున వర్శిటీలో సమైక్య విద్యార్థి జేఏసీ సమావేశం సీమాంధ్ర ప్రాంతంలోని విశ్వవిద్యాలయాలు, వివిధ జిల్లాల సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుల సమావేశం మంగళవారం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందని సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందిస్తామని ఆయన గుంటూరులో విలేకరులతో చెప్పారు. -
కొనసాగుతూనే ఉన్న సమైక్య ఆందోళనలు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో 21వ రోజు కూడా సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీఎన్జీవో, రెవిన్యూ, మున్సిపల్, జడ్పీ ఉద్యోగులు తమ రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వెయ్యి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎస్కేయూలో అధ్యాపకుల, విద్యార్థుల ఆందోనళలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు బస్సులను అడ్డుకున్న 12 మందిని అరెస్టు చేయడాన్ని ఆర్టీసీ జోనల్ కార్యదర్శి రమణారెడ్డి ఖండించారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాల్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యవాదుల ఆమరణ దీక్ష నాలుగో రోజు కూడా కొనసాగుతోంది. దీక్షల్లో పాల్గొంటున్నవారి ఆరోగ్యం క్షీణిస్తోంది. దీక్షాధారులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంఘీభావం తెలిపాయి. పశ్చిమగోదావరి జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా నేడు, రేపు విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో రావులపాలెం జాతీయ రహదారిని నేడు దిగ్బంధించనున్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో తంతికొండ నుంచి బస్సుయాత్రను వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించనున్నారు. విశాఖ జిల్లా అరకులో బంద్ కొనసాగుతోంది. వర్తక సంఘాల ఆధ్వర్యంలో వంటావార్పు చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నర్సీపట్నం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరాహార దీక్ష చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 21 రోజు కూడా సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ చేయనున్నారు. ఇక విజయవాడలో సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. న్యాయవాదులు విధులు బహష్కరించి సమ్మెకు దిగారు. కోర్టు గేట్లకు తాళాలు వేసిన నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నగరంలో రహదారుల దిగ్బంధానికి జేఏసీ పిలుపునిచ్చింది. ఉద్యోగులు విజయవాడ బెంజ్ సర్కిల్లో ఆటా,పాటలతో నిరసన తెలిపారు. తిరుపతిలో సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎయిర్ బైపాస్‌రోడ్డు నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు ఈ ర్యాలీ జరిగింది. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు మహా ర్యాలీ జరిగింది, ర్యాలీలో వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాజీ లేనే లేదు: బొత్స
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయంతో తలెత్తనున్న పలు సమస్యలపై సీమాంధ్ర ప్రాంతాలకు పూర్తి న్యాయం జరిగేదాకా పోరాటాన్ని కొనసాగిస్తామే తప్ప ఏ దశలోనూ సర్దుకుపోయి రాజీపడే సమస్యే లేదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ‘‘రాజకీయాలు, పదవులు మాకు ముఖ్యం కాదు. హైదరాబాద్ ప్రతిపత్తి, రాజధానిలో ఉద్యోగావకాశాలు, నదీజలాలు, విద్య, ఉపాధి, ఆదా య పంపిణీ తదితరాలపై మేం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకు న్యాయం జరిగేలా అధిష్టానంతో చర్చలు జరుపనున్నాం’’ అని చెప్పారు. శనివారం ఢిల్లీ వచ్చిన ఆయన దిగ్విజయ్‌సింగ్, రక్షణమంత్రి ఏకే ఆంటోనీలను కలిశాక విలేకరులతో మాట్లాడారు. ఆంటోనీ కమిటీ విధివిధానాలు తదితరాలపై చర్చించేందుకే వారిద్దరినీ కలిసినట్టు వివరించారు. ‘‘విభజనతో తలెత్తగల సమస్యలను కమిటీకి చెప్పాలని దిగ్విజయ్ సూచించారు.వాటికి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీఇచ్చారు. మంగళవారం నుంచి సీమాంధ్ర నేతలను కలుస్తామన్నారు. ఎవరెవరినీ కలవాలో నన్ను, కిరణ్‌ను సంయుక్తంగా జాబితా తయారు చేయమన్నారు. సోమవారం సీఎం తో చర్చించి జాబితా తయారు చేస్తాం. పార్టీలో అంతర్గతంగా అన్ని అంశాల్నీ చర్చించాకే వాటిపై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది’’ అని చెప్పారు. సీమాం ధ్రుల భయాందోళనలను, అనుమానాలను నివృత్తి చేయగలిగిన తర్వాతే విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని భావిస్తున్నానన్నారు. ‘‘వారి అనుమానాలు, ఆందోళనలను పరిశీలించి వారిని సంతృప్తి పరిచే, ఆయా ప్రాంతాలకు మేలు జరిగే పరిష్కారాలను కనుగొనాలన్న మా అభ్యర్థన మేరకే ఆంటోనీ కమిటీ ఏర్పాటైంది. మంగళవారం నుంచి పని ప్రారంభిస్తుంది. నేను, సీఎం కిరణ్ సీమాంధ్ర పక్షపాతుల్లా వ్యవహరిస్తున్నామనే విమర్శలు ఎదురవుతున్నా వెనక్కు తగ్గేది లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో అక్కడి నేతలు స్పందించినట్టే మేమూ సీమాంధ్రలో పుట్టిన వ్యక్తులుగా మా ప్రాంత మనుగడ, ప్రజల మనోభీష్టాలకనుగుణంగా ప్రతిస్పందించడంలో తప్పేముంది?’’ అని బొత్స అన్నారు. విభజన తర్వాత హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు పూర్తి రక్షణ కల్పిస్తామని తెలంగాణ నేతలు స్పష్టమైన హామీ ఇచ్చారని ప్రస్తావించగా.. ‘ఏ ఒక్కరి భరోసాతోనో, ప్రాపకంతోనో లేదా జాలి, దయాదాక్షిణ్యాలపైనో ఆధారపడి బతకాల్సినఖర్మ ఎవరికీ పట్టలేదు. హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు గనుకే దానిగురించి మాట్లాడుతున్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారిదాకా ఎక్కడైనా జీవించేందుకు ప్రాథమిక హక్కును, రక్షణను పౌరులందరికీ రాజ్యాంగం కల్పించింది’ అని బదులిచ్చారు. రాజీనామాలు ఫ్యాషనైపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజీనామాలు డ్రామాలని బొత్స అన్నారు. ‘ఇప్పుడు రాజీనామాలు ఫ్యాషనైంది. వారివి రాజకీయ లభ్ధికోసం చేసిన రాజీనామాలే తప్ప రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం చేసినవి కాదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వాటిలో ఎక్కడా కోరలేదు. కానీ కిరణ్, నేనూ మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి కోరాం’’ అన్నారు. ‘ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ కమిటీ మాత్ర మే. ప్రజాప్రతినిధులు మాత్రమే దానికి తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేస్తారు. తర్వాత ఏర్పడే కేంద్ర మంత్రివర్గ ఉపసంఘానికి ఆయా రంగాల్లో నిపుణులు వాదనలు విన్పిస్తారు’ అని చెప్పారు.