
రాజీ లేనే లేదు: బొత్స
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయంతో తలెత్తనున్న పలు సమస్యలపై సీమాంధ్ర ప్రాంతాలకు పూర్తి న్యాయం జరిగేదాకా పోరాటాన్ని కొనసాగిస్తామే తప్ప ఏ దశలోనూ సర్దుకుపోయి రాజీపడే సమస్యే లేదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ‘‘రాజకీయాలు, పదవులు మాకు ముఖ్యం కాదు. హైదరాబాద్ ప్రతిపత్తి, రాజధానిలో ఉద్యోగావకాశాలు, నదీజలాలు, విద్య, ఉపాధి, ఆదా య పంపిణీ తదితరాలపై మేం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకు న్యాయం జరిగేలా అధిష్టానంతో చర్చలు జరుపనున్నాం’’ అని చెప్పారు. శనివారం ఢిల్లీ వచ్చిన ఆయన దిగ్విజయ్‌సింగ్, రక్షణమంత్రి ఏకే ఆంటోనీలను కలిశాక విలేకరులతో మాట్లాడారు. ఆంటోనీ కమిటీ విధివిధానాలు తదితరాలపై చర్చించేందుకే వారిద్దరినీ కలిసినట్టు వివరించారు. ‘‘విభజనతో తలెత్తగల సమస్యలను కమిటీకి చెప్పాలని దిగ్విజయ్ సూచించారు.వాటికి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీఇచ్చారు. మంగళవారం నుంచి సీమాంధ్ర నేతలను కలుస్తామన్నారు. ఎవరెవరినీ కలవాలో నన్ను, కిరణ్‌ను సంయుక్తంగా జాబితా తయారు చేయమన్నారు.
సోమవారం సీఎం తో చర్చించి జాబితా తయారు చేస్తాం. పార్టీలో అంతర్గతంగా అన్ని అంశాల్నీ చర్చించాకే వాటిపై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది’’ అని చెప్పారు. సీమాం ధ్రుల భయాందోళనలను, అనుమానాలను నివృత్తి చేయగలిగిన తర్వాతే విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని భావిస్తున్నానన్నారు. ‘‘వారి అనుమానాలు, ఆందోళనలను పరిశీలించి వారిని సంతృప్తి పరిచే, ఆయా ప్రాంతాలకు మేలు జరిగే పరిష్కారాలను కనుగొనాలన్న మా అభ్యర్థన మేరకే ఆంటోనీ కమిటీ ఏర్పాటైంది. మంగళవారం నుంచి పని ప్రారంభిస్తుంది. నేను, సీఎం కిరణ్ సీమాంధ్ర పక్షపాతుల్లా వ్యవహరిస్తున్నామనే విమర్శలు ఎదురవుతున్నా వెనక్కు తగ్గేది లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో అక్కడి నేతలు స్పందించినట్టే మేమూ సీమాంధ్రలో పుట్టిన వ్యక్తులుగా మా ప్రాంత మనుగడ, ప్రజల మనోభీష్టాలకనుగుణంగా ప్రతిస్పందించడంలో తప్పేముంది?’’ అని బొత్స అన్నారు. విభజన తర్వాత హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు పూర్తి రక్షణ కల్పిస్తామని తెలంగాణ నేతలు స్పష్టమైన హామీ ఇచ్చారని ప్రస్తావించగా.. ‘ఏ ఒక్కరి భరోసాతోనో, ప్రాపకంతోనో లేదా జాలి, దయాదాక్షిణ్యాలపైనో ఆధారపడి బతకాల్సినఖర్మ ఎవరికీ పట్టలేదు. హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు గనుకే దానిగురించి మాట్లాడుతున్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారిదాకా ఎక్కడైనా జీవించేందుకు ప్రాథమిక హక్కును, రక్షణను పౌరులందరికీ రాజ్యాంగం కల్పించింది’ అని బదులిచ్చారు.
రాజీనామాలు ఫ్యాషనైపోయింది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజీనామాలు డ్రామాలని బొత్స అన్నారు. ‘ఇప్పుడు రాజీనామాలు ఫ్యాషనైంది. వారివి రాజకీయ లభ్ధికోసం చేసిన రాజీనామాలే తప్ప రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం చేసినవి కాదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వాటిలో ఎక్కడా కోరలేదు. కానీ కిరణ్, నేనూ మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి కోరాం’’ అన్నారు. ‘ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ కమిటీ మాత్ర మే. ప్రజాప్రతినిధులు మాత్రమే దానికి తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేస్తారు. తర్వాత ఏర్పడే కేంద్ర మంత్రివర్గ ఉపసంఘానికి ఆయా రంగాల్లో నిపుణులు వాదనలు విన్పిస్తారు’ అని చెప్పారు.