అదే జోరు.. జనోద్యమం @ 122
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 122వ రోజూ శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి సమైక్య నినాదాలను హోరెత్తించారు. సైమైక్యాంధ్ర మ్యాప్ ఆకారంలో కూర్చుని రాష్ట్రాన్ని విభజించవద్దని నినదించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం జరిగిన రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అధికారులతో మంత్రి కాసు కృష్ణారెడ్డి సమైక్యాంధ్ర జిందాబాద్, విభజన వద్దు... సమైక్యాంధ్ర ముద్దు... అని నినాదాలు చేయించారు. ఇక్కడ నినాదాలు ఢిల్లీ పెద్దలకు వినిపించాలంటూ గట్టిగా నినాదాలు చేయించారు.
అమరవీరుల త్యాగాల ఫలితంగా, తెలుగు వారి ఆశయాలకు అనుగుణంగా తొలిసారిగా రూపుదిద్దుకున్న భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విభజిస్తుంటే చూస్తు ఊరుకోబోమని కృష్ణా జిల్లా కలిదిండి జేఏసీ నాయకులు హెచ్చరించారు. విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నారంటూ కేంద్ర మంత్రి చిరంజీవి దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగాయలంకలో జేఏసీ నాయకులు రాస్తారోకో చేసి రోడ్డుపై బైఠాయించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద విద్యార్థి సమరభేరి నిర్వహించారు.
వైఎస్సార్సీపీ శ్రేణుల పాదయాత్ర
గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ సమైక్యనాదం పేరిట పార్టీ నేతలు పలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టి ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను, రాష్ట్ర పరిరక్షణకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న నిర్విరామకృషిని వివరిస్తున్నారు. తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం, కడపలో పాదయాత్రలు జరిగాయి. చిత్తూరులో పార్టీ కార్యకర్తలు రాస్తారోకో చేశా రు. ఇక కృష్ణా, విజయనగరం, వైఎస్‌ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లాల్లో దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి.