మూడో కూటమి 'పార్కింగ్ ప్లేస్' లాంటిది
త్వరలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సీమాంధ్రలో పర్యటించేలా ఏర్పాటు చేస్తానని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్య నాయుడు వెల్లడించారు. సీమాంధ్ర జిల్లాల బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని బుధవారం విజయవాడలో ఆయన ప్రారంభించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... సీమాంధ్ర ప్రాంత సమస్యలు పరిష్కరించే సత్తా ఒక్క బీజేపీకే ఉందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్డినెన్స్ చేయాలని తమ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిందని తెలిపారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం బీజేపీలను ఒడించేందుకు దేశంలోని పలు పార్టీలు ఏకమై మూడో కూటమి (థర్డ్ ఫ్రంట్) అంటూ తెరపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. మూడో కూటమిలోని పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ సొంత ఎజెండాతో వస్తున్నాయని, అయా పార్టీల అధ్యక్షులంతా ప్రధాని పదవి అధిష్టించాలని ఉబలాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీల ఓట్లను చీల్చడమే మూడో కూటమి ప్రధాన ఉద్దేశ్యమని ఆయన ఆరోపించారు. మూడో కూటమి 'పార్కింగ్ ప్లేస్' లాంటిదని ఆయన అభివర్ణించారు. మూడో కూటమికి ఓటు వేస్తే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లే అని ఆయన పార్టీ శ్రేణులను హెచ్చరించారు.
అధికార పక్షం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన సార్వత్రిక ఎన్నికల అనంతరం మోడీ ప్రధాని పదవి చేపట్టడం ఖాయమన్నారు. మోడీని ప్రధాని గెద్ద నెక్కించేందుకు దేశంలోని ప్రజలంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. యూపీఏ పాలనలో పేరుకుపోయిన అవినీతి, రైతు ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలే తమ ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలలో 274 పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించిన సంగతిని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.