ముక్కలు కానివ్వం.. సమైక్యవాదుల ప్రతిన
108రోజులకు చేరిన ఉద్యమం
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం 108వరోజూ శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగా సాగింది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని ప్రతిజ్ఞ చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు విజయవాడలో రైల్‌రోకో చేపట్టేందుకు విఫలయత్నం చేశారు. న్యాయవాదుల ప్రతిఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం నాగులూరుకు చెందిన 74ఏళ్ల గోగులమూడి రామకోటిరెడ్డి కాలినడకన 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బయల్దేరి వెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ముస్లిం లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. కాగా, రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు తెలియజేస్తే ఎస్కేయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటాలు చేయడంతో పాటు అవసరమైతే భౌతిక దాడులకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు పరుశురాంనాయక్ హెచ్చరించారు.
మంత్రి రఘువీరా, ఎమ్మెల్యే గుప్తాకు సమైక్యసెగ
అనంతపురం జిల్లా కదిరిలో మంత్రి రఘువీరారెడ్డిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లోపు తెలంగాణపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి రఘువీరా చెప్పారు. అనంతపురంలో డీసీసీ అధ్యక్షుడు, గుంతకల్లు ఎమ్మెల్యేమధుసూదన్‌గుప్తాను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) జేఏసీ నాయకులు అడ్డుకుని సమైక్య నినాదాలు చేశారు. మోసం చేసిందని చెబుతున్న పార్టీలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు.
వైఎస్సార్ సీపీ శ్రేణుల ఉద్యమపథం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు పార్టీ శ్రేణులు శుక్రవారం కూడా విభిన్నరూపాల్లో ఆందోళనలు కొనసాగించాయి. తూర్పుగోదావరి పి.గన్నవరం మండ లం ముంగండపాలెంలో, ప్రత్తిపాడు నియోజకవర్గంలో జడ్డంగి అన్నవరం, తూర్పు లక్ష్మీపురం గ్రామా ల్లో గడపగడపకూ వైఎస్సార్‌సీపీ సమైక్యనాదం పేరిట పాదయాత్రలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బిరదవోలులో సమైక్య దీవెనయాత్ర చేపట్టారు.బాలాయపల్లి మండలం కాలగంధ, కాట్రగుంట, కరిమెనగుంట గ్రామాల్లో, అనంతపురం జిల్లా నల్లమాడలో పాదయాత్రలు చేపట్టారు. చిత్తూరులో గడపగడపకూ సమైక్యశంఖారావం పేరిట పాదయాత్ర జరిగింది. జిల్లాలోని పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి రిక్షాతొక్కి నిరసన తెలిపారు.