రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో 21వ రోజు కూడా సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీఎన్జీవో, రెవిన్యూ, మున్సిపల్, జడ్పీ ఉద్యోగులు తమ రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వెయ్యి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎస్కేయూలో అధ్యాపకుల, విద్యార్థుల ఆందోనళలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు బస్సులను అడ్డుకున్న 12 మందిని అరెస్టు చేయడాన్ని ఆర్టీసీ జోనల్ కార్యదర్శి రమణారెడ్డి ఖండించారు.
చిత్తూరు జిల్లా వరదయ్యపాల్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యవాదుల ఆమరణ దీక్ష నాలుగో రోజు కూడా కొనసాగుతోంది. దీక్షల్లో పాల్గొంటున్నవారి ఆరోగ్యం క్షీణిస్తోంది. దీక్షాధారులకు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు సంఘీభావం తెలిపాయి. పశ్చిమగోదావరి జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా నేడు, రేపు విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో రావులపాలెం జాతీయ రహదారిని నేడు దిగ్బంధించనున్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో తంతికొండ నుంచి బస్సుయాత్రను వైఎస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించనున్నారు.
విశాఖ జిల్లా అరకులో బంద్ కొనసాగుతోంది. వర్తక సంఘాల ఆధ్వర్యంలో వంటావార్పు చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నర్సీపట్నం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరాహార దీక్ష చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 21 రోజు కూడా సమైక్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ చేయనున్నారు.
ఇక విజయవాడలో సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. న్యాయవాదులు విధులు బహష్కరించి సమ్మెకు దిగారు.
కోర్టు గేట్లకు తాళాలు వేసిన నిరసన తెలిపారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నగరంలో రహదారుల దిగ్బంధానికి జేఏసీ పిలుపునిచ్చింది. ఉద్యోగులు విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఆటా,పాటలతో నిరసన తెలిపారు.
తిరుపతిలో సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎయిర్ బైపాస్‌రోడ్డు నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు ఈ ర్యాలీ జరిగింది. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు మహా ర్యాలీ జరిగింది, ర్యాలీలో వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాలు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొనసాగుతూనే ఉన్న సమైక్య ఆందోళనలు
Published Tue, Aug 20 2013 12:04 PM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement