వరి పోరులో భాగంగా నల్లజెండాలు ఎగురవేస్తున్న మంత్రులు గంగుల(కరీంనగర్‌లో.. ), వేముల(వేల్పూర్, నిజామాబాద్‌లో..), బైక్ ర్యాలీలో పువ్వాడ(ఖమ్మంలో..)
సాక్షి, హైదరాబాద్: యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో పక్షం రోజులుగా టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘వరి పోరు’కు ఇక ఢిల్లీ వేదికకానుంది. గత నెల 21న సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో మొదలైన వరి పోరు కార్యాచరణ శుక్రవారం ఊరూరా నల్లజెండాల ఎగురవేతతో ముగిసింది. ఈ నేపథ్యంలో గత 4న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిరసన తెలిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
కేంద్రం స్పందించకపోవడంతో..: ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా గత నెలలో రాష్ట్ర మంత్రుల బృందం కోరినా.. కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో వరి పోరుపై కార్యాచరణను టీఆర్‌ఎస్ ప్రకటించింది. పార్టీ అధినేత పిలుపు మేరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌లు, రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, ఆత్మ కమిటీలు.. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ గత నెలలో తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపించాయి.
తిరిగి ఈ నెల 4 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగిన టీఆర్‌ఎస్ శ్రేణులు శుక్రవారం వరకు.. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, జాతీయ రహదారులపై రాస్తారోకోలు, ఊరూరా నల్లజెండాల ఎగురవేత, మోదీ దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు చేపట్టాయి. తాజాగా దేశ రాజధానిలో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ నెల 3నే ఢిల్లీ వెళ్లారు. 12వ తేదీ వరకు సీఎం ఢిల్లీలోనే ఉంటారని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నప్పటికీ.. 11న జరిగే నిరసన దీక్షలో ఆయన పాల్గొనే అంశంపై మాత్రం గోప్యత పాటిస్తున్నాయి.
మంత్రులు, ముఖ్య నేతలకు ఆహ్వానాలు
రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ దీక్షకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీక్షకు రావాల్సిందిగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, మున్సిపల్, మార్కెట్ కమిటీ, రైతుబంధు సమితి జిల్లా చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి.
సుమారు 1,500 మంది టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు ఢిల్లీ దీక్షకు హాజరవుతున్నట్లు అంచనా. వీరంతా ఆదివారం రాత్రికల్లా ఢిల్లీ చేరుకోనున్నారు. మంత్రి కేటీఆర్ మాత్రం 11వ తేదీ ఉదయం రాజధానికి వెళతారని తెలిసింది. మరోవైపు ముఖ్య నేతల అనుచరులు కూడా సొంత ఖర్చులతో ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ప్రత్యేక విమానాలు.. రైలు బోగీలు
పార్టీ నుంచి ఆహ్వానం అందిన వారి కోసం రెండు ప్రత్యేక విమానాలతో పాటు ప్రత్యేక రైలు బోగీలను బుక్ చేశారు. అయితే అధికారిక పనుల కారణంగా సుమారు అరడజను మంది మంత్రులు ఢిల్లీ దీక్షలో పాల్గొనబోవడం లేదని సమాచారం. మరోవైపు టీఆర్‌ఎస్ దీక్ష ఏర్పాట్లపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లే నేతల వివరాలు, వెంట వరి ధాన్యం తెస్తున్నారా.. తదితర వివరాలు సేకరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment