సీమాంధ్రలో సమైక్యవాద నినాదాలు మిన్నంటుతున్నాయి. వినూత్న రీతుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరు శవయాత్రలు నిర్వహిస్తే... ఇంకొకరు తలనీలాలు సమర్పిస్తున్నారు. మరొకరు రాష్ట్ర విభజనకు కారకులైన వారి చిత్రపటాలను గాడిదలపై ఊరేగిస్తున్నారు. ఒంటి నిండా సమైక్య నినాదాలు పెయింటు చేయించుకుంటున్నారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
రాష్ట్ర విభజన వద్దంటూ వేలాది గొంతులు ఏక్కటయ్యాయి. ఊరు -వాడా ఏకమై సమైక్యవాదాన్ని బలంగా వినిపించింది. అనంతపురం జిల్లా హిందూపురంలో నిరసనకారులు కేసీఆర్ దిష్టిబొమ్మకు కర్మకాండలు నిర్వహించారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప రాజీనామా చేయాలని నిలదీశారు. ఎన్ఎంయూ నాయకులు అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రజాకోర్టు నిర్వహించారు. కేసీఆర్, చంద్రబాబు, సోనియా, కిరణ్ ,చిరంజీవిలను దోషులగా పేర్కొంటూ మాక్ కోర్టు నిర్వహించారు. వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగులో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. సీఎం కిరణ్ కనపడటం లేదని, జాడ తెలిపిన వారికి యాభై వేల రూపాయల నజరానా అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. రాయచోటి జాతీయ రహదారిపై కొంతమంది భైఠాయించారు. దీంతో నాలుగు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. భారతమాత విగ్రహంతో అర్చకులు ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. నేతలకు పిండ ప్రదానం చేశారు.
గాడిదలపై నేతల చిత్రపటాలు
రాష్ట్ర విభజనకు కారకులంటూ కర్నూలులో నిరసనకారులు నేతల చిత్రపటాలను గాడిదలపై ఊరేగించారు. రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఆదోనిలో జర్నలిస్టులు కూడా కదం తొక్కారు. రాస్తారోకో తో పాటు రైల్ రోకోలో పాల్గొన్నారు. దీంతో ముంబై వెళ్లే జయంతి ఎక్స్‌ప్రెస్ గంట సేపు నిలిచిపోయింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో జర్నలిస్టులు ధర్నాకు దిగారు. వీరిపై జిల్లా ఎస్పీ శ్యాం సుందర్ చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. శ్రీకృష్ణదేవరాయలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వారిని లక్ష్మీపార్వతి పరామర్శించారు. చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్దాంతం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆమె ఆరోపించారు.
చిత్తూరు జిల్లా పుత్తూరులో సమైక్యవాదులు టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణనాయుడిని అడ్డుకున్నారు. రాష్ట్రం ముక్కలవుతున్నా టీడీపీ నోరుమెదపడం లేదని ఎమ్మెల్యేతో వాదించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ట్యాక్సీ డ్రైవర్లు, ఆటోవాలాలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్, సోనియా దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో వైఎస్‌ఆర్సీపీ ముస్లిం నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనకు నిరసగా ఓ వ్యక్తి తలనీలాలు సమర్పించి దీక్షకు మద్ధతు పలికాడు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ గుంటూరులో వైఎస్‌ఆర్సీపీ నాయకులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. సీమాంధ్ర పూర్తిగా చీకట్లో మునిగి పోయే ప్రమాదం ఏర్పడినా సీఎం స్పందించడం లేదని ఆయనకు వెలుగు చూపించేందుకే కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్నామని అన్నారు.
ముస్లింల ప్రత్యేక ప్రార్థన
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ముస్లింలు విజయవాడలో ప్రత్యేక ప్రార్థన చేశారు. సమాజు అనంతరం తోటి నిరసనకారులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. మరికొంత మంది జేఏసీ అధ్వర్యంలో తెలుగుతల్లికి పూలమాలలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగ్గయ్యపేటలో జేఏసీ అధ్యర్యంలో సమైక్యవాదులు రోడ్డుపై ముగ్గులు వేసి నిరసన తెలిపారు. రోడ్డుపైనే కబాడీ ఆడారు.
కేబుల్ ప్రసారాల నిలిపివేత
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్న కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌ఓలు 24 గంటలపాటు ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్ల ప్రసారాలను నిలిపేశారు. సమైక్యవాదాన్ని అందరూ బలపరచాలని పిలుపునిచ్చారు. మరికొంత మంది ఆందోళనకారులు సోనియా దిష్టిబొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు.
విజయనగరం జిల్లా సమైక్యవాదులు కేశఖండనం చేసుకొని, ఒళ్లంతా సమైక్యవాద నినాదాలు రాసుకొని నిరసన తెలిపారు. విభజనకు కారకులంటూ కొంత్ మంది నేతల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు.
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అనుసరించిన విధానానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన పార్లమెంట్ సభ్యత్వానికి నేడు రాజీనామా చేయనున్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఎదిరించే దమ్ము లేని కాంగ్రెస్ తెలుగు ప్రజలను చీల్చాలని కుట్ర పన్నిందని ఆయన ఆరో పించారు.
సీమాంధ్ర జిల్లాల్లో మిన్నంటుతున్న సమైక్య ఉద్యమాలు
Published Mon, Aug 5 2013 10:43 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement
Advertisement