ఆరేళ్ల విద్యార్థినిపై పీఈటీ అసభ్యకర ప్రవర్తన
జీవదాన్ స్కూల్‌లో ఘటన.. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల ఆందోళన
రాళ్లదాడిలో సీఐతోపాటు పలువురు పోలీసులకు తీవ్ర గాయాలు
తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన ఎస్సై
కామారెడ్డి టౌన్ / కామారెడ్డి క్రైం: ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ అసభ్యకర ప్రవర్తన కామారెడ్డిని అట్టుడికించింది. న్యాయం కావాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, బంధువులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల రాళ్లదాడి, పోలీసుల లాఠీచార్జ్‌తో దాదాపు ఆరుగంటల పాటు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల చిన్నారి పట్ల అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నాగరాజు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విషయం తెలియడంతో çపలు విద్యార్థి సంఘాల వారు మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు.
స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్యాంకురియన్, వైస్ ప్రిన్సిపాల్ వీసీ థామస్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల లోపలికి దూసుకెళ్లారు. ప్రిన్సిపాల్ చాంబర్‌లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
పీఈటీపై ఫిర్యాదు చేసినా...
పలుమార్లు ఫిర్యాదు చేసినా సదరు పీఈ టీని తొలగించలేదన్నారు. ఈ విషయాన్ని గతంలోనే డీఈవో, ఎంఈవోల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని మండిపడ్డారు. అప్పటికే పాఠశాలకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయిస్తున్న సమయంలోనే బయట నుంచి పెద్దఎత్తున యువకులు అక్కడకు చేరుకున్నారు.
పోలీసులు వారిని అడ్డుకున్నా వినలేదు. పలుమార్లు పోలీసులకు, ఆందోళన చేస్తున్న వారితో తోపులాట జరిగింది. ఆగ్రహంతో ఉన్న కొందరు పాఠశాల భవనంపై రాళ్లు రువ్వడంతో కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించే క్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ తలకు రాయి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది.
వెంటనే సీఐని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తోపులాటలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కాళ్లు విరగడంతో పాటు, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్‌ఐ రాజారాం సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ సింధుశర్మ ఆందోళకారులను సముదాయించారు. సాయంత్రం ఆరుగంటల వరకు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment