సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ బరిలో ఉన్న కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు గెలిస్తేనే సమైక్యాంధ్ర ఉద్యమం ఉన్నట్టని బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. రెబెల్స్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని వారి నామినేషన్లపై సంతకాలు చేసిన వారిని కాంగ్రెస్ నేతలు కోరడాన్ని తప్పుబట్టారు. సంతకాలు వెనక్కి తీసుకోండని ఒత్తిడి చేయడం, గదుల్లో బంధించడం అప్రజాస్వామికమన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఎంఐఎం మద్దతిస్తే తాము ఇవ్వబోమన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పార్టీపరంగా ప్రజలకు ఇచ్చే హామీలు, ప్రణాళికలను రూపొందించేందుకుగాను బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించిన ఈ కమిటీకి ప్రొఫెసర్ శేషగిరిరావు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.