ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతి గృహాలను మినహాయించాలని దళిత ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ భవన్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని పేదలే విద్యనభ్యసిస్తుంటారని చెప్పారు. ఉద్యమం వల్ల వారి భవిష్యత్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రైవేటు విద్యాసంస్థలను బంద్ నుంచి మినహాయించడం దారుణమని చెప్పారు.
దీనిపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, మానవ హక్కుల సంఘం, లోకాయుక్తలకు.. ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని మూసివేసి.. ప్రైవేటు బస్సులను మాత్రం ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ.. స్వార్థ పరుల కోసం సమైక్య ఉద్యమానికి మద్దతిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్య, వికలాంగుల పింఛనులను నిలిపివేయడం దివాలాకోరుతనమన్నారు. పేదలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులు సమ్మె విరమించాలని కోరారు. ఎక్కువ కాలం పాఠశాలలు మూతబడితే డ్రాపవుట్స్ పెరిగే అవకాశం ఉంటుందన్నారు.
పేద విద్యార్థులు నష్టపోతున్నారు
Published Sun, Sep 8 2013 6:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement