ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణే వైఎస్సార్ సీపీ లక్ష్యమని పార్టీ ఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ప్రకాశం భవనం వద్ద వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీస్తూ సీడబ్ల్యూసీ ప్రకటన వచ్చిందని తెలిసిన వెంటనే తమ పార్టీ ఎమ్మెల్యేలు 16 మందీ రాజీనామాలు చేశామన్నారు. ఈ దశలో కొంతమంది రాజీనామాలు చేయడం మీకు సరదాగా మారిందంటూ ఎగతాళి చేశారన్నారు.
కానీ రాష్ట్రం విడిపోతే తీవ్రమైన సమస్యలుంటాయని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని చెప్పినా వారు ససేమిరా అన్నారన్నారు. నేడు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం కావడంతో పలుచోట్ల తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నాయకులు రాజీనామాల పేరుతో నాటకాలాడుతున్నారని (స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేయకుండా) విమర్శించారు. ఒక వైపు ఉద్యోగులు, ఎన్‌జీఓలు, ఆర్టీసీ కార్మికులు జీతాలను వదులుకొని సైతం పోరాటం చేస్తుంటే పదవులు వదులుకోలేకపోతున్న ప్రజాప్రతినిధుల తీరు గర్హనీయమన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్రపై తమ చిత్తశుద్ధిని స్పష్టం చేశారన్నారు. తన కుమారుడ్ని ప్రధానమంత్రిని చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే సోనియా గాంధీ ఓట్లు, సీట్లు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజన ప్రకటన చేసిందన్నారు.
కనీసం తెలంగాణలో అయినా కొన్ని సీట్లు వ స్తే చాలనే దుర్మార్గమైన కుట్రే దీనికి కారణమని విమర్శించారు.
అసత్యప్రకటనలు మానండి...
‘సచివాలయ ఉద్యోగుల సంఘం ధర్నా కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించేందుకు ఢిల్లీ వెళితే పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఒక హోటల్‌లో రాహుల్‌గాంధీతో చర్చలు జరిపారని టీడీపీ నాయకులు మాట్లాడారు. అలాగే నా భార్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రుల భార్యలతో కలిసి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసిందని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. ఇవన్నీ అవాస్తవాలు. అవి నిజమ ని నిరూపిస్తే నేనే కాదు...జగన్‌మోహన్‌రెడ్డి సైతం రాజీనామాలు ఉపసంహరించుకుంటాం. లేకపోతే తప్పుడు ప్రకటనలు చేసిన మీ సంగతేంటి?’... అని టీడీపీ, ఆంధ్రజ్యోతి పత్రికపై బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. తప్పుడు ప్రకటనలు మాని సమైక్యాంధ్ర ఉద్యమంలో 64 రోజుల నుంచి ప్రజలు పడుతున్న బాధలపై దృష్టి సారించాలని హితవు పలికారు.
సీఎం ధిక్కార స్వరమంతా అధిష్టానం కనుసన్నల్లోనే..
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై వినిపిస్తున్న ధిక్కార స్వరమంతా ఆ పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే సాగుతోందని బాలినేని విమర్శించారు. సీడబ్ల్యూసీలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసినప్పుడే ఆ నిర్ణయాన్ని సీఎం ధిక్కరించి రాజీ నామా చేస్తానని హెచ్చరించి ఉంటే తామంతా సీఎం చర్యలపై హర్షాన్ని వెలిబుచ్చేవారమన్నారు. కానీ అందుకు విరుద్ధంగా నాడు మిన్నకుండి, నేడు అధిష్టానాన్ని ధిక్కరించినట్లు నటిస్తున్నారని విమర్శించారు. కొత్త పార్టీ పెట్టి కనీసం కొన్ని సీట్లయినా గెలుచుకొని ఎన్నికల తరువాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే దుర్మార్గమైన కుట్రే సీఎం ధిక్కార స్వరానికి కారణమని ఆరోపించా రు. విభజన ప్రకటన వెలువడిన పదిరోజుల తరువాత విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడిన సీఎం కిరణ్ సీడబ్ల్యూసీ నిర్ణయం జరిగేనాడే ఎందుకు వ్యతిరేకించలేదో ప్రజలు నిలదీయాలన్నారు.
యూటర్న్ తీసుకుంటే బాబును విమర్శించం: రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే రూ. 4 లక్షల కోట్లు ఇస్తే కొత్త రాజధాని నిర్మించుకుంటామని ప్రకటించిన చంద్రబాబు నేడు సమైక్యాంధ్రకు అనుకూలంగా యూటర్న్ తీసుకుంటే తాము ఆయన్ను విమర్శించబోమన్నారు. తమకు రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యమని, సమైక్యాంధ్ర ప్రకటన వస్తే చాలన్నారు. సమైక్యాంధ్రుల శక్తి తెలియకే చంద్రబాబు నాడు కొత్త రాజధానికి నిధులివ్వాలని అడిగారని, ప్రతి జిల్లాలోనూ రాజ ధాని వస్తుందంటూ తప్పడు ప్రకటనల ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చేలా చేయడం దారుణమన్నారు. రాష్ట్రం విడిపోతే కుప్పం మొదలు శ్రీకాకుళం వరకు తాగునీటి ఇక్కట్లు తప్పవన్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన తప్పిదం వల్లే నేడు ఆల్మట్టి సమస్య నెలకొందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, రాష్ట్రం విడిపోతే వారికి ఉద్యోగావకాశాలు సీమాంధ్రలో మృగ్యమే అన్నారు. చంద్రబాబు రాష్ట్ర విభజన ప్రకటనను సమర్థించుకోవాలని చూడడం మానుకొని, ఆత్మగౌరవ యాత్రలకు బదులుగా యూటర్న్ తీసుకొని సమైక్యాంధ్ర ప్రకటనతో ప్రజల్లోకి రావాలని బాలినేని పిలుపునిచ్చారు.
పొత్తుకు మేము నై... దమ్ముంటే టీడీపీ ప్రకటించాలి:
కాంగ్రెస్, బీజేపీలతో సహా తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బాలినేని స్పష్టం చేశారు. దమ్ముంటే టీడీపీ కూడా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని ప్రకటించాలని సవాల్ విసిరారు. డీల్ వల్లే జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చిందంటూ కాంగ్రెస్, టీడీపీల్లోని కొంతమంది నేతలు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఇది వైఎస్సార్ సీపీని బలహీన పరచాలనే ఏకైక ఉద్దేశంతో జరుగుతున్న బలమైన కుట్రగా పేర్కొన్నారు. గుజరాత్‌లోని గోధ్రాలో అల్లర్లు జరిగిన సమయంలో బీజేపీకి మద్దతు ప్రకటించి చారిత్రాత్మక తప్పిదం చేశామని నాడు ప్రకటించిన చంద్రబాబు నేడు మళ్లీ మోడీకి ఆదరణ ఉందని, దానిని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో అదే పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు యత్నించడం దుర్మార్గమైన చర్యన్నారు.
సమైక్యాంధ్రే లక్ష్యం
Published Thu, Oct 3 2013 3:30 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
Advertisement
Advertisement