సమీక్షలను విజయవంతం చేయండి
ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమ, మంగళవారాల్లో నిర్వహించే జిల్లాలోని 12 నియోజకవర్గాల సమీక్ష సమావేశాలకు పార్టీకి చెందిన అన్ని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, సహకార సంఘాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులంతా హాజరుకావాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి కోరారు. ముందుగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని బచ్చల బాలయ్య కల్యాణ మండపాన్ని బాలినేని, ముత్తుముల అశోక్‌రెడ్డితో పాటు యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, పలువురు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించారు.
అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల సమీక్షలతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపైనా చర్చిస్తామన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకుగాను తమ పార్టీ నిత్యం ప్రజలతో మమేకం అవుతుందని అందులో భాగంగానే డిసెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనభేరీ కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారన్నారు. రుణమాఫీ చేస్తానంటూ ఎన్నికల సమయంలో ప్రకటించిన చంద్రబాబు నేడు అందుకు భిన్నంగా రైతుల పట్ల వివక్ష కొనసాగిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో పెన్షన్లు కోల్పోయిన వృద్ధులు, వితంతువులకు అండగా నిలిచేందుకు సైతం తమ పార్టీ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తుందన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో చంద్రబాబు గద్దె ఎక్కాడని..నేడు జనం అంతా గుర్తించారన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, ఇలా అన్ని వర్గాల వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై రెండు రోజులపాటు జరిగే నియోజకవర్గాల సమీక్షలో చర్చిస్తామన్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులతోపాటు పార్టీని జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు కూడా దృష్టి సారిస్తామన్నారు. పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు, పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.
సమీక్షలు ఇలా:
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు ఒంగోలుకు చేరుకుంటారు. ఒంటి గంట నుంచి 2.30 వరకు కందుకూరు, 3 నుంచి 5.30 గంటల వరకు అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాలు, 6 నుంచి 8.30 వరకు చీరాల, పర్చూరు సమీక్షలు ఉంటాయి.
24వ తేదీ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఒంగోలు, గం.11.30 నుంచి గం.1.30 వరకు వై.పాలెం, గిద్దలూరు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు మార్కాపురం, కనిగిరి, సాయంత్రం 5 నుంచి 7.30 గంటల వరకు దర్శి, కొండపి నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు.
వీరివెంట వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, వివిధ విభాగాల నాయకులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కఠారి శంకర్, డీఎస్ క్రాంతికుమార్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, బడుగు ఇందిర, బొప్పరాజు కొండలు, సింగరాజు వెంకట్రావు, పురిణి ప్రభావతి తోటపల్లి సోమేశేఖర్, కత్తినేని రామకృష్ణారెడ్డి తదితరులున్నారు.
నగరం నిండా భారీగా ఫ్లెక్సీలు:
ఎన్నికల అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు తొలిసారి వస్తున్న సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు. సమీక్ష జరిగే రైల్వేస్టేషన్ రోడ్డుతోపాటు దక్షిణ బైపాస్ నుంచి కర్నూల్‌రోడ్డు బైపాస్ వరకు, అదే విధంగా చర్చి సెంటర్ నుంచి వీఐపీ రోడ్డు వరకు పలు మార్గాల్లో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.