హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్ సీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరోమారు మండిపడ్డారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడ్డ టీడీపీ నాలుగేళ్లుగా ఎవరితో పోరాటం చేస్తోందని ప్రశ్నించారు. ఈ మేరకు బహిరంగ లేఖను రాసిన బాలినేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు. ప్రజాసమస్యలపై కాంగ్రెస్ మీద చేసిన పోరాటాలెన్నో బాబు లెక్కచెప్పాలని ఆ లేఖలో సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబూ...ఏ డీల్ ప్రకారం మీరు నాలుగేళ్లుగా కాంగ్రెస్ కు మద్దతిచ్చారన్నారు. ఏ డీల్ ప్రకారం అవిశ్వాసం పెట్టకుండా కాంగ్రెస్ సర్కార్ను కాపాడతున్నారని, ఏ డీల్ ప్రకారం చిదంబరం, రేణుకా, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ లతో మంతనాలు జరుపుతున్నారన్నారని 2008లో ఇచ్చిన లేఖను ఏ డీల్ ప్రకారం వెనక్కు తీసుకోవడం లేదని బాలినేని ప్రశ్నల వర్షం కురిపించారు.
జనంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని ఎదుర్కొనే ధైర్యం మీకుందా? అని చంద్రబాబును నిలదీశారు. ఈరోజు కాంగ్రెస్ లేకుండా బతకగలిగే పరిస్థితి మీకుందా?, కాంగ్రెస్ తో కుమ్మక్కుకాకుండా ఒక్క అసెంబ్లీ సీటైనా తెచ్చుకునే పరిస్థితి మీకుందా? అని ఆ లేఖలో అడిగారు. అదే ఉంటే ఢిల్లీ రాజకీయాలు ఎందుకు చేస్తారని, కాంగ్రెస్ తో కుమ్మకు కుట్రలకు పాల్పడతారని లేఖలో పేర్కొన్నారు.