గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో మూడు రోజులుగా అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతున్నాయి. పాఠశాలల్లో జరిగే యూనిట్ పరీక్షలన్నింటికీ అవసరమైన ప్రశ్నపత్రాలు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) ద్వారానే రూపొందిస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిధిలో యూనిట్ పరీక్షల బాధ్యతను రాజీవ్ విద్యామిషన్ చూస్తుండగా, ప్రభుత్వ హైస్కూళ్లతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో డీసీఈబీ ముద్రించిన ప్రశ్నపత్రాలతోనే యూనిట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
త్రైమాసిక పరీక్షల నిర్వహణకు రాజీవ్ విద్యామిషన్ రూపొందించిన ప్రశ్నపత్రాలను డీసీఈబీ ద్వారానే ముద్రిస్తున్నారు. ఇటీవల జరిగిన త్రైమాసిక పరీక్షలకు ఉన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతులకు ప్రశ్నపత్రాలను సరఫరా చేసిన డీఈసీబీ తాజాగా అర్ధ సంవత్సర పరీక్షలకు అవసరమైన పత్రాలను గత నవంబర్‌లోనే సిద్ధం చేసింది. ప్రభుత్వ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అర్ధ సంవత్సర పరీక్షలు డిసెంబర్‌లోనే నిర్వహించాల్సి ఉండగా, సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యంలో ప్రభుత్వం జనవరి రెండో తేదీకి వాయిదా వేసింది.
ఇందుకోసం ముందుగానే ప్రశ్నపత్రాలను ముద్రించి పెట్టిన డీసీఈబీ వాటిని మండలాల వారీగా పాఠశాలలకు పంపింది. దీంతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సీనియర్ ఉపాధ్యాయులతో ఏళ్ల తరబడి ప్రశ్నపత్రాలను డీసీఈబీ ముద్రిస్తుండగా, ఆర్వీఎం ద్వారా ముద్రించిన ప్రశ్నపత్రాల్లో ప్రమాణాలు ఏ మేరకు ఉంటాయన్నది అనుమానమేనని స్వయంగా ఉపాధ్యాయులే చెబుతున్నారు.
ఆర్వీఎం ద్వారా ప్రశ్నపత్రాల సరఫరా
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ యూనిట్ పరీక్షల నిర్వహణకే పరిమితమైన రాజీవ్ విద్యామిషన్ విద్యాహక్కు చట్ట ప్రభావంతో 6, 7, 8 తరగతుల బాధ్యతను తల కెత్తుకుంది. దీంతో ఆర్వీఎం జిల్లా అధికారులు విద్యాశాఖకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్ధ సంవత్సర పరీక్షల కోసం 6, 7, 8 తరగతులకు ప్రశ్నపత్రాలను ముద్రించి పాఠశాలలకు పంపారు. ఇవి కేవలం తెలుగు మీడియంవే కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు డీసీఈబీ పంపిన పత్రాలే దిక్కయ్యాయి.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఇటు ఆర్వీఎం, అటు డీసీఈబీ వేర్వేరుగా ప్రశ్నపత్రాలను పంపడంతో పరీక్షలు వేటితో నిర్వహించాలనే విషయమై ప్రధానోపాధ్యాయులు గందరగోళమవుతున్నారు. ఆర్వీఎం పంపిన పత్రాలు పూర్తిస్థాయిలో అన్ని మండలాలకు చేరకపోవడం, ఇంగ్లిష్ మీడియంలో పంపకపోవడంతో ప్రధానోపాధ్యాయులు మూడు రోజులుగా డీసీఈబీ పంపిన పత్రాలతోనే పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్వీఎం పంపిన ప్రశ్నపత్రాలతో మరలా పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఆర్వీఎం నిర్వాకంతో ప్రస్తుతం అర్ధ సంవత్సర పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మరోసారి పరీక్షలు రాయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల డీసీఈబీ పంపిన ప్రశ్నపత్రాలతో అర్ధ సంవత్సర పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
విద్యార్థులకు విషమ పరీక్ష
Published Sun, Jan 5 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement
Advertisement