ఖర్చు చేశారు... లెక్కచెప్పరు
Published Tue, Nov 29 2016 3:51 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
శ్రీకాకుళం: శ్రీకాకుళం రాజీవ్ విద్యా మిషన్(ప్రస్తుత సర్వశిక్షా అభియాన్)లో నిధుల ఖర్చుకు సంబంధించి ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా గత అధికారులు ఇప్పటికీ లెక్కలు చెప్పడం లేదు. గత పీవో రామచంద్రారెడ్డి, అప్పటి ఇన్‌చార్జి ఎఫ్‌ఏఓ, ప్రస్తుత అసిస్టెంట్ ఎఫ్‌ఏఓ అయిన సురేష్ రూ. 2.5 లక్షలను సొంతం పేరిట విత్‌డ్రా చేసి వాటికి తగిన బిల్లులు సమర్పించకపోవడంతో ఆడిట్ అధికారులు కొద్ది నెలల క్రితం అభ్యంతరం తెలిపారు. దీనిపై తక్షణం బిల్లులు సమర్పించాల్సి ఉండగా ఇప్పటివరకు అటువంటి దాఖలాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా శిక్షణకు గాని, మరేదైనా పనులకు గాని నిధులను సొంతం పేరిట విత్‌డ్రా చేసి, అటు తర్వాత బిల్లులను సమర్పించుకునే సౌలభ్యం ఆర్‌వీఎంలో ఉంది.
దీనిని వినియోగించుకునే వీరిద్దరూ నిధులను విత్‌డ్రా చేశారు. అయితే ఇప్పటికీ లెక్కలు చెప్పకపోవడం పలువురి సందేహాలకు కారణమైంది. అప్పటి పీవో రామచంద్రారెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఓ సమావేశానికి ఇతడు పూర్తి సమాచారంతో రాలేదన్న కారణంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాతృ శాఖకు సరెండర్ చేసిన విషయం పాఠకులకు విదితమే. అయితే ఏ కారణంగానో తెలియకపోయినా మంత్రి ఆదేశాలు సుమారు రెండు నెలలు అమలుకు నోచుకోలేదు. ఈ రెండు నెలల్లో మరిన్ని ఆరోపణలు రావడంతో కలెక్టర్ రిలీవ్ చేసేశారు.
అప్పట్లో ఎఫ్‌ఏఓగా పనిచేసిన రాజు మాతృ సంస్థకు వెళ్లిపోవడంతో సురేష్ ఇన్‌చార్జి ఎఫ్‌ఏఓగా వ్యవహరించారు. ఈ సమయంలోనే రూ. 2.5 లక్షలు విత్‌డ్రా చేశారు. ఈ మొత్తంతో కేజీబీవీ సిబ్బంది, ఎంఐఎస్ కోర్డినేటర్లకు శిక్షణ ఇచ్చినట్టు మౌఖికంగా చెబుతున్నా బిల్లులు మాత్రం దాఖలు చేయలేదు. ఆడిట్ అధికారుల అభ్యంతరం తర్వాత కూడా బిల్లులు దాఖలుకు ప్రయత్నాలే జరగలేదు. ఈ కారణంగానే పలువురు వ్యక్తం చేస్తున్న అనుమానాలను బలం చేకూరుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రస్తుత ఆర్‌వీఎం అధికారులు ఉదాసీనంగా ఉంటున్నారనే ఆక్షేపణలు వినిపిస్తున్నారుు.
ఇదే శాఖలో అసిస్టెంట్ ఎఫ్‌ఏఓగా పనిచేస్తున్న సురేష్‌కు ఇప్పటికి రెండు మెమోలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాగా సురేష్‌ను ప్రస్తుత పీఓ కూడా సుమారు 6 నెలల పాటు రాష్ట్ర అధికారుల ఉత్తర్వులు కాదని ఇన్‌చార్జి ఎఫ్‌ఏఓగా కొనసాగించడం, ఎఫ్‌ఏఓగా రాష్ట్ర అధికారుల ద్వారా నియమించబడిన మోహనరావును విధుల్లో చేర్చుకోకుండా గాలిలో ఉంచడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తక్షణం యూసీలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్‌వీఎం పీఓ త్రినాథరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా రెండు రోజుల క్రితమే యూసీలు ఇచ్చారన్నారు. యూసీలు ఇవ్వకపోవడంతో గతంలో ఆడిట్ అభ్యంతరం చెప్పడం నిజమేనని తెలిపారు.
Advertisement
Advertisement