నిలిచిన టాయ్‌లెట్ల నిర్మాణం
మోర్తాడ్: రాజీవ్ విద్యా మిషన్ (సర్వ శిక్ష అభియాన్) కింద పాఠశాలలకు కేటాయించిన నిధులను రాష్ట్ర విద్యాశాఖ వెనక్కు తీసుకుంది. దీంతో పాఠశాలల్లో ప్రతిపాదించిన టాయ్‌లెట్ల నిర్మాణానికి బ్రేక్ పడింది. విద్యార్థులకు ఒంటికి, రెంటికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఆర్వీఎం ద్వారా కేటాయించిన నిధులను వినియోగించుకోవాలని కలెక్టర్ యోగితారాణా గతంలో ఆదేశించారు. దీంతో మూడు నెలల కింద టాయ్‌లెట్ల నిర్మాణాలకు అధికార యంత్రాంగం పాఠశాలలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయ్‌లెట్ల సంఖ్య పెంచాలని.. ఒక్కో పాఠశాలలో ఎనిమిది నుంచి 15 వరకు టాయ్‌లెట్లు నిర్మించాలని నిర్ణయించారు. జిల్లాలో 267 ఉన్నత, 144 ప్రాథమికోన్నత, 804 ప్రాథమిక పాఠశాలలున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో టాయ్‌లెట్ల నిర్మాణం అవసరం లేదు. అయితే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ముఖ్యంగా మారుమూల గ్రామాలలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో టాయ్‌లెట్ల నిర్మాణం అత్యవసరమైంది. ఒక్కో పాఠశాలకు రూ.1.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు ఆర్వీఎం నిధులను కేటాయించారు. అయితే రాష్ట్ర విద్యాశాఖ గత నెలలో పాఠశాల ఖాతాల్లో నిలువ ఉన్న అన్ని రకాల నిధులను వాపసు తీసుకుంది. ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
అయితే, టాయ్‌లెట్ల నిర్మాణం కోసం జిల్లా అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వడం, రాష్ట్ర విద్యాశాఖ నిధులను వాపసు తీసుకోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నిధులు వెనక్కు వెళ్లడంతో నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు పనులను అర్ధాంతరంగా నిలిపి వేశారు. నిర్మాణాలు పూర్తయిన తరువాత బిల్లులు చెల్లించడానికి నిధులు రాకపోతే తమకు ఇబ్బందిగా ఉంటుందని కాంట్రాక్టర్లు భావిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో నిర్మాణాలు సగం దశలో ఉండగా పనులను నిలిపి వేయగా మరికొన్ని పాఠశాలల్లో ఇసుక, కంకర పోయించి గుంతలు తవ్విన తరువాత పనులు నిలిపి వేశారు.
ఆర్వీఎం నిధులు వెనక్కి
Published Tue, Jan 3 2017 1:24 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
Advertisement
Advertisement