The Education
-
గోరుముద్ద అందేనా?
నిధులు కేటాయించని సర్కారు సమీపిస్తున్న పదో తరగతి పరీక్షలు అర్థాకలితో విద్యార్థులు ఆరోగ్యంపై ప్రభావం రెంజల్ : 2016–17 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతీ పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గంట అదనంగా ఉపాధ్యాయులు ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారు. విద్యార్థుల ఉత్తమ గ్రేడ్ల సాధనే ప్రామాణికంగా పెట్టుకున్న విద్యాశాఖ అధికారులు వారి బాగోగులు పట్టించుకొనడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ పాత్ర బాగానే ఉన్నా.. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రత్యేక తరగతుల కోసం వేకువ జామునే ఇంటి నుంచి బయల్దెరే పిల్లల ఆకలిని తీర్చుకునేందుకు మధ్యలో మధ్యాహ్న భోజనం మాత్రమే పెడుతున్నారు. సాయంత్రం బడి వదిలాక అర్దాకలితో ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితులను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. హైస్కూళ్లకు చట్టూ పక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు రాత్రి సమయానికి ఇంటికి చేరుకున్నాకనే ముద్ద నోట్లో వేసుకుంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పస్తులుంటున్న విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించక పోవడంతో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అందని ఉదయం, సాయంత్రం స్నాక్స్.. జిల్లాలోని దాదాపు అన్ని పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో స్నాక్స్ అందడం లేదు. ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. విద్యాశాఖ ప్రణాళిక ప్రకారం ఇప్పటికే వీక్లీ టెస్టులు, స్పెషల్ టెస్టులు పూర్తవగా ప్రస్తుతం ఈ నెల 15వ తేదీ వరకు గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. 20వ తేదీ నుంచి మార్చి 6 వరకు ఫ్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయినప్పటికీ విద్యార్థుల నోట్లోకి గోరుముద్ద అందడం లేదు. పదో తరగతి పరీక్షలు మార్చి నెల 17 నుంచి ప్రారంభం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 504 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. సుమారు 24 వేల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పదిలో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు విద్యాశాఖ గత డిసెంబరు నుంచి ప్రత్యేక కార్యాచరణను రూపకల్పన చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఆరోగ్యంపై ప్రభావం పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురుకావద్దని ప్రముఖ వైద్య నిఫుణులు పేర్కొంటున్నారు. మూడుపూటలా తప్పని సరిగా మితంగా భోజనం చేయాలని సూచిస్తున్నారు. అప్పుడే మనసును ప్రశాంతంగా నిమగ్నం చేసి చదువుకునే వీలుంటుందని అంటున్నారు. అర్దాకలితో చదివితే నిరుపయోగమని సూచిస్తున్నారు. చదివింది ఒంటబట్టేందుకు సమయం వృథా అవుతుందంటున్నారు. సమయానికి తినకపోతే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రణాళిక ప్రకారం భోజనం, నిద్ర విద్యార్థులకు తప్పనిసరని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఉదయం విద్యార్థులు లేచింది మొదలు రాత్రి వరకు పాఠశాలలకు అతుక్కుపోతున్నారు. వారి ఆరోగ్యంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గోరుముద్దకు దాతలు ముందుకు రావాలి.. గోరుముద్దకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గోరుముద్ద పేరిట గతేడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు దాతలతో అల్పాహారం అందించేందుకు అధికారులు ప్రయత్నించి సఫలమయ్యారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులను అందించకున్నా అధికారులు ప్రత్యేక చోరవ తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా ఏర్పాట్లు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్‌ను వివరణ కోరగా.. గోరుముద్ద అందించేందుకు జిల్లాలోని హైస్కూల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే పలు పాఠశాలల్లో దాతల సహకారంతో అల్పాహారం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి గోరుముద్దకు నిధులు రాకున్నా ఇంకా సమయం ఉన్నందును త్వరలోనే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో దాతల సహకారంతో ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆకలితో అలమటిస్తున్నాం.. నా పేరు వంశి. నేను కూనేపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను. మా తరగతిలో 45 మంది విద్యార్థులు ఉంటారు. మా సొంత గ్రామం కల్యాపూర్. కూనేపల్లికి అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నాతోపాటు మా ఊరు నుంచి పదో తరగతి విద్యార్థులు 15 మంది వస్తారు. ప్రత్యేక తరగతుల కోసం ఉదయం ఏడు గంటలకు మా ఊరు నుంచి బస్సులో వస్తాము. కొందరం భోజనం చేసి వస్తారు, కొందరు చేయక వస్తారు. మధ్యాహ్నం మాత్రమే మధ్యాహ్న భోజనం చేస్తాము. ప్రత్యేక తరగతులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే సరికి రాత్రి 7 గంటలు అవుతుంది. పగలంతా ఆకలితో పాఠాలు వింటు న్నాము. ఉదయం, సాయంత్రం స్నాక్స్ పెడితే బాగుంటుంది. -
‘లిటిల్ లీడర్.. లిటిల్ టీచర్’ షురూ..
మై విలేజ్ మోడల్ విలేజ్ ఫౌండేషన్ చైర్మన్ బాల్‌రాజ్‌గౌడ్ కామారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను పెంచడానికి జిల్లా విద్యాశాఖ సహకారంతో తమ సంస్థ లిటిల్ లీడర్, లిటిల్ టీచర్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని మై విలేజ్ మోడల్ విలేజ్ ఫౌండేషన్ చైర్మన్ సి.బాల్‌రాజ్‌గౌడ్ తెలిపారు. బుధవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ సత్యనారాయణ ఆదేశాలతో విద్యాశాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గత మూడేళ్లుగా తమ సంస్థ కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా లిటిల్ లీడర్ లిటిల్ టీచర్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పే అంశాలు అందరు వి ద్యార్థులకు అర్థం కాకపోవచ్చని, కొందరికి కొంత మేర, మరికొందరికి మరికొంత మేర అర్థమవుతాయని, అ యితే విద్యార్థులను గ్రూపులుగా చేసి ఒకరి కొకరు చెప్పుకునే విధానాన్ని చేపట్టామన్నారు. నేర్చుకోవడం, నేర్పించడం విధానం ద్వారా విద్యార్థులందరూ చదువులో ముందుంటారన్నారు. వచ్చే వేసవిలో 40రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి డప్పువాయిద్యం, డ్యాన్స్, డ్రాయింగ్ వంటి కళల్లో శిక్షణ ఇస్తామన్నారు. తాను వ్యాపారరంగంలో అనుభవాన్ని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపయోగిస్తానన్నారు. ఈ సమావేశంలో సంస్థ సిబ్బంది శశి, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్వీఎం నిధులు వెనక్కి
నిలిచిన టాయ్లెట్ల నిర్మాణం మోర్తాడ్: రాజీవ్ విద్యా మిషన్ (సర్వ శిక్ష అభియాన్) కింద పాఠశాలలకు కేటాయించిన నిధులను రాష్ట్ర విద్యాశాఖ వెనక్కు తీసుకుంది. దీంతో పాఠశాలల్లో ప్రతిపాదించిన టాయ్లెట్ల నిర్మాణానికి బ్రేక్ పడింది. విద్యార్థులకు ఒంటికి, రెంటికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఆర్వీఎం ద్వారా కేటాయించిన నిధులను వినియోగించుకోవాలని కలెక్టర్ యోగితారాణా గతంలో ఆదేశించారు. దీంతో మూడు నెలల కింద టాయ్లెట్ల నిర్మాణాలకు అధికార యంత్రాంగం పాఠశాలలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయ్లెట్ల సంఖ్య పెంచాలని.. ఒక్కో పాఠశాలలో ఎనిమిది నుంచి 15 వరకు టాయ్లెట్లు నిర్మించాలని నిర్ణయించారు. జిల్లాలో 267 ఉన్నత, 144 ప్రాథమికోన్నత, 804 ప్రాథమిక పాఠశాలలున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో టాయ్లెట్ల నిర్మాణం అవసరం లేదు. అయితే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ముఖ్యంగా మారుమూల గ్రామాలలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో టాయ్లెట్ల నిర్మాణం అత్యవసరమైంది. ఒక్కో పాఠశాలకు రూ.1.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు ఆర్వీఎం నిధులను కేటాయించారు. అయితే రాష్ట్ర విద్యాశాఖ గత నెలలో పాఠశాల ఖాతాల్లో నిలువ ఉన్న అన్ని రకాల నిధులను వాపసు తీసుకుంది. ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, టాయ్లెట్ల నిర్మాణం కోసం జిల్లా అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వడం, రాష్ట్ర విద్యాశాఖ నిధులను వాపసు తీసుకోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నిధులు వెనక్కు వెళ్లడంతో నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు పనులను అర్ధాంతరంగా నిలిపి వేశారు. నిర్మాణాలు పూర్తయిన తరువాత బిల్లులు చెల్లించడానికి నిధులు రాకపోతే తమకు ఇబ్బందిగా ఉంటుందని కాంట్రాక్టర్లు భావిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో నిర్మాణాలు సగం దశలో ఉండగా పనులను నిలిపి వేయగా మరికొన్ని పాఠశాలల్లో ఇసుక, కంకర పోయించి గుంతలు తవ్విన తరువాత పనులు నిలిపి వేశారు. -
ఈ నెల చివరిలో డీఎస్సీ కౌన్సెలింగ్
చిత్తూరు (గిరింపేట): డీఎస్సీ-2014లో ఎంపికైన స్కూల్ అసిస్టెంట్, పీఈటీల ఎంపిక జాబితాలను జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం రాష్ట్ర విద్యాశాఖకు పంపారు. ఆ జాబితాను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పరిశీలించి రోస్టర్ ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికయ్యే వారి వివరాలను రాష్ట్ర విద్యాశాఖ నుంచి అభ్యర్థుల మొబైల్స్‌కే సందేశం అందుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల చివరిలోపు ఎంపికైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు, నియామకపత్రాలు ఇవ్వనున్నారు. విద్యాశాఖ సిబ్బంది డీఎస్సీలో ఎంపికైన వారి దరఖాస్తులను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. -
టెన్షన్ వద్దు
సిటీబ్యూరో: టెన్త్ క్లాస్పరీక్షలు వచ్చేశాయి.. ఈనెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్నాయి.. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చే శాయి. పరీక్షలు వస్తున్నాయనే ఆందోళన చెందకండని నిపుణులు విద్యార్థులకు సూచిస్తున్నారు. పరీక్షలకు మొత్తం 1.78 లక్షల మంది రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 791 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రె గ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు వేర్వేరు సెంటర్లు కేటాయించారు. ద్వితీయ భాష మినహా అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరగుతాయి. ద్వితీయ భాష పరీక్ష మధ్యాహ్నం 12.45 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే పరీక్షకు హాజ రయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆయా స్కూళ్లకు పంపించారు. ఫీజు విషయంలో స్కూల్ యాజ మాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తే.. హాల్‌టికెట్లను వెబ్సైట్ నుంచి డౌల్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని విద్యాశాఖ కల్పించింది. డౌల్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై సదరు స్కూల్ ప్రధానోపాధ్యాయులు లేదంటే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకుని పరీక్షకు హాజరుకావాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు సోమిరెడ్డి, రమేష్ తెలిపారు. ఈ హాల్‌టికెట్లతో వచ్చే విద్యార్థులను పరీక్ష రాసేందుకు తప్పక అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 21, రంగారెడ్డి జిల్లాలో 20 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించనున్నారు. పరీక్ష నిర్వహణ, కేంద్రాల చిరునామా తదితర విషయాలపై ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశాన్ని హైదరాబాద్ విద్యాశాఖ కార్యాలయం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటల నుంచే ఇవి పనిచేస్తాయి. ఇబ్బందులు తలెత్తకుండా... వేసవి దృష్ట్యా కేంద్రాల్లో తాగునీటికి కొరత లేకుండా చూస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో దాదాపు తాగునీటికి ఇబ్బందులు లేకపోవచ్చు. పరీక్షలు ముగిసేంతవరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫిల్టర్ వాటర్‌ను అందుబాటులో ఉంచుతారు. అలాగే కేంద్రాల్లో ప్రథమ చికిత్స పెట్టెలతోపాటు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. డీ హైడ్రేషన్, వడదెబ్బ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తితే అప్పటికప్పుడే చికిత్స అందిస్తారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జంట జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖాధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎర్రమంజిల్‌లో సీసీ కెమెరాలు నగరంలోని ఉన్నత పాఠశాలల్లో నిఘా నీడన పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాకో పెలైట్ ప్రాజెక్ట్ కింద ఒక పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఎర్రమంజిల్ పాఠశాలలో మొత్తం 10 కెమెరాలు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో 8, ప్రధానోపాధ్యాయుని చాంబర్ , బడి ఆవరణలో ఒకటి చొప్పున బిగించారు. మెరుగైన ఫలితాలు సాధిస్తాం.. పదో తరగతి పరీక్షలంటేనే కొంత ఆందోళన సహజమని, దాన్ని దూరం చేసేలా విద్యార్థులను సన్నద్ధం చేశామని డీఈఓలు పేర్కొన్నారు. పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా, పాఠ్యాంశాలను అర్థం చేసుకుని చక్కగా సమాధానాలు రాసేలా వారిని తీర్చిదిద్దామని చెప్పారు. గతంలా కాకుండా.. ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఇలా చేయండి పరీక్షకు ముందు రోజు సెంటర్‌ను ఒకసారి చూస్తే కొంత ఆందోళన దూరమవుతుంది. పరీక్ష సమయానికి గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి. కనీసం ఉదయం 8.45 గంటలలోపు ఉండాలి సెల్ఫోన్లు, క్యాలిక్లేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. హాల్‌టికెట్, పెన్నులు, పెన్సిల్, రబ్బరు, స్కేల్, రైటింగ్ ప్యాడ్ ఎట్టిపరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. పెన్నులు అదనంగా ఉంచుకోవడం ఉత్తమం. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఏదైనా ఆహారం మితంగా తిని పరీక్షకు హాజరైతే మంచిది. జ్యూస్‌లు తీసుకుంటే నీరసం రాదు. ఒకవేళ హాల్‌టికెట్ పోగొట్టుకున్నా, ఫీజలు చెల్లించలేదని స్కూల్ యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేసినా హాల్‌టికెట్ పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉంది. www.bsetelangana.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. -
ఒంటిపూట బడులపై నేడు నిర్ణయం
ఇంగ్లిష్ మీడియం ప్రీప్రైమరీఏర్పాటుకు కసరత్తు జిల్లాకు 10 నుంచి 20 ఏర్పాటు చేసే ఆలోచనలు హైదరాబాద్: రాష్ట్రంలో ఒంటిపూట బడులను అమలు చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ప్రస్తుత వేసవి ఎండలు, ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తోంది. వీలైతే ఈ నెల 16 నుంచి లేదా 21 నుంచి ఒంటిపూట బడులను ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒంటి పూట బడులను కొనసాగించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళన నోటీసులు కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి... అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోనూ ఒంటిపూట బడుల ప్రారంభంపై చర్చించారు. దీనిపై శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి, చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అలాగే తల్లిదండ్రుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రీప్రైమరీ విద్యపై ఆసక్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలుపై కసరత్తు చేస్తోంది. కడియం శ్రీహరి కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ప్రతి జిల్లాలో 10 నుంచి 20 వరకు స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు పద్ధతిన ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చించినట్లు తెలి సింది. దీనిపై పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు విద్యా వార్షిక కేలండర్ అమలు, మార్చి 21 నుంచే 2016-17 విద్యా సంవత్సరం ప్రారంభం, ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపైనా కడియం సమీక్షించారు. సూర్యాపేటలో పరీక్షా పత్రాలు బయటకు రావడంపైనా చర్చించారు. శుక్రవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. -
నాసా పోటీల్లో విద్యార్థినుల హవా
ఎంపికైన 57మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో 40మంది బాలికలే నూజివీడు, న్యూస్‌లైన్ : అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) నిర్వహించే పోటీల్లో ట్రిపుల్ఐటీ విద్యార్థినులు సత్తాచాటారు. అంతరిక్షాన్ని కూడా మానవ నివాసయోగ్యంగా మార్చాలనే లక్ష్యంతో నాసా ప్రతి ఏటా స్పేస్ సెటిల్మెంట్ డిజైన్ కాంటెస్టును నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా 2014లో చేపట్టిన పోటీలకు నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన విద్యార్థులు 29ప్రాజెక్టులు పంపగా, వాటిల్లో 18 ఎంపికయ్యాయి. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన 57మంది విద్యార్థులకు అమెరికా రావాల్సిందిగా నాసా ఆహ్వానాలు పంపింది. వీరిలో 40మంది బాలికలే. గతేడాది కూడా నాసా పోటీలకు 37మంది ఎంపికకాగా, వారిలో 29మంది బాలికలే ఉండడం గమనార్హం. 2012లో పది మంది ఎంపిక కాగా వారిలో ఏడుగురు విద్యార్థినులే. ట్రిపుల్‌ఐటీలో ఉన్న మొత్తం విద్యార్థుల్లో 51శాతం బాలురు ఉండగా, 49శాతం బాలికలు ఉన్నారు. అయినప్పటికీ పోటీల్లో మాత్రం బాలురు కంటే బాలికలే ముందుంటున్నారు. నాసా పోటీ ముఖ్యోద్దేశం ఇదే.. జనాభాతోపాటు భూమిపై కాలుష్యం పెరగడం, వసతుల లేమి వంటి కారణాలతో భూతలంపై నివాసయోగ్యత రానురాను తగ్గిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయంగా అంతరిక్షంలో మానవ నివాస యోగ్యతపై ప్రాజెక్టులు పంపాలని నాసా ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తోంది. దీనికి అనుగుణంగా అంతరిక్షంలో ఎలా నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ మానవ అవసరాలకు నీటిని ఎలా పొందాలి, విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేసుకోవాలి, వ్యర్థాలను అంతరిక్షంలో పోగుపడకుండా ఏం చేయాలి వంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తమ ఊహాశక్తికి పదునుపెట్టి ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. వీటిని నాసా శాస్త్రవేత్తలు పరిశీలించి విభాగాల వారీగా ఎంపికచేస్తున్నారు. ఎంపికైన విద్యార్థులు తమ ప్రాజెక్టులపై ప్రెజెంటేష్ ఇచ్చేందుకు అమెరికా రావాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ ప్రక్రియ ఏటా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 14నుంచి 18వ తేదీ వరకు అమెరికాలోని లాస్ఎంజిల్స్లో నిర్వహించే 33వ అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సదస్సులో ఎంపికైన విద్యార్థులు తమ ప్రాజెక్టులను వివరించాల్సి ఉంది. దీంతో ఎంపికైన 57మంది వి ద్యార్థుల్లో సాధ్యమైనంత ఎక్కువ మందిని అమెరికా పంపేందుకు ట్రిపుల్ఐటీ అధికారులు యత్నిస్తున్నారు. వీరిలో ఇప్పటికే 17మంది పా స్పోర్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగి లిన వారితోనూ దరఖాస్తులు పెట్టిస్తున్నారు.