‘లిటిల్ లీడర్.. లిటిల్ టీచర్’ షురూ..
మై విలేజ్ మోడల్ విలేజ్ ఫౌండేషన్ చైర్మన్ బాల్‌రాజ్‌గౌడ్
కామారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను పెంచడానికి జిల్లా విద్యాశాఖ సహకారంతో తమ సంస్థ లిటిల్ లీడర్, లిటిల్ టీచర్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని మై విలేజ్ మోడల్ విలేజ్ ఫౌండేషన్ చైర్మన్ సి.బాల్‌రాజ్‌గౌడ్ తెలిపారు. బుధవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ సత్యనారాయణ ఆదేశాలతో విద్యాశాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గత మూడేళ్లుగా తమ సంస్థ కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా లిటిల్ లీడర్ లిటిల్ టీచర్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పే అంశాలు అందరు వి ద్యార్థులకు అర్థం కాకపోవచ్చని, కొందరికి కొంత మేర, మరికొందరికి మరికొంత మేర అర్థమవుతాయని, అ యితే విద్యార్థులను గ్రూపులుగా చేసి ఒకరి కొకరు చెప్పుకునే విధానాన్ని చేపట్టామన్నారు. నేర్చుకోవడం, నేర్పించడం విధానం ద్వారా విద్యార్థులందరూ చదువులో ముందుంటారన్నారు. వచ్చే వేసవిలో 40రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి డప్పువాయిద్యం, డ్యాన్స్, డ్రాయింగ్ వంటి కళల్లో శిక్షణ ఇస్తామన్నారు. తాను వ్యాపారరంగంలో అనుభవాన్ని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపయోగిస్తానన్నారు. ఈ సమావేశంలో సంస్థ సిబ్బంది శశి, తదితరులు పాల్గొన్నారు.