ప్రపంచంలోనే బెస్ట్ బిల్డింగ్‌గా ఎంపిక
గది అంతటా సూర్యకాంతి ప్రసరించేలా రంపం పళ్లను ఆకారంలో రూఫ్.. ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడే ఆవరణలు.. పెద్ద బాస్కెట్‌బాల్ కోర్టు.. అందమైన కమ్యూనిటీ గార్డెన్.. ఓపెన్ ఎయిర్ టెర్రస్.. లోపలి వ్యక్తుల ప్రైవసీకి భంగం కలగకుండా చుట్టూ వంపులు తిరిగిన మెటల్ స్క్రీన్స్.. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు. ఇదేదో రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన కాదు! ఓ స్కూల్ భవన విశేషాలివి. దాంతో ఆకాశహర్మ్యాలను, మ్యూజియాలను, అందమైన విమానాశ్రయాలను కూడా తలదన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ భవనంగా ఎంపికైంది. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ (డబ్ల్యూఏఎఫ్)లో ఈ ఘనత సాధించింది. దీని పేరు డార్లింగ్టన్ పబ్లిక్ స్కూల్. సిడ్నీలోని చిపండేల్‌లో ఉంది.
సాంస్కృతిక పరిరక్షణ
దక్షిణ సిడ్నీ ప్రాంతంలో ఉన్న ఈ స్కూలు నిజానికి ఆ్రస్టేలియా మూలవాసులతో బలమైన సంబంధాలున్న కమ్యూనిటీ పాఠశాల. 1970 నాటి పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్తది నిర్మించాలనుకున్నారు. ఎఫ్‌జెడ్‌సీ స్టూడియో ఆ బాధ్యతలు తీసుకుంది. మూలవాసులతో బంధాన్ని ప్రతిబింబించేలా పాఠశాల హాల్, ఎంట్రన్స్ రిసెప్షన్, తరగతి గదుల్లో స్వదేశీ కళను చిత్రీకరించి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించారు. పాత పాఠశాల గోడలపై ఉన్న ఆదిమ కుడ్యచిత్రాలను కొత్త భవనంలో పుననర్న్మించారు. ఆ స్ఫూర్తితోపాటు కొత్త, సమకాలీన అభ్యాస వాతావరణాన్ని సృష్టించారు. ప్రీసూ్కల్, కిండర్ గార్టెన్, ప్రైమరీ స్కూల్‌తో 500 మందికి పైగా విద్యార్థుల సామర్థ్యం ఈ కొత్త క్యాంపస్ సొంతం.
ఆరోగ్యం, ఆహ్లాదం
ప్రాధమిక పాఠశాల భవనంలో కాంతికోసం ప్రత్యేకంగా విద్యుత్ అక్కరలేదు. ప్రత్యేకమైన టెర్రస్ ప్రతి గదికీ సూర్యకాంతిని ప్రసరింపజేస్తుంది. అది బాగా వేడిగా కూడా ఉండదు. మృదువైన కాంతి స్థానిక కాసురినా చెట్ల ఆకుల మధ్య నుంచి జాలువారుతున్నట్లుగా ఉంటుంది. ఈ సహజకాంతి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాఠశాల భవనానికి అనుసంధానించి ఉన్న కమ్యూనిటీ హాల్, లైబ్రరీ విద్యార్థులను సమాజంలో భాగం చేస్తున్నాయి.
175 మంది మనసు గెలుచుకుని..
క్రీడలు, రవాణా, ఆరోగ్యం, గృహనిర్మాణం వంటి 18 కేటగిరీల్లో డబ్ల్యూఏఎఫ్ అవార్డులు ఇస్తుంది. 175 మంది ఫెస్టివల్ డెలిగేట్ల ప్యానెల్ అన్ని కేటగిరీలకు చెందిన విజేతల నుంచి ‘వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్’ ను ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది నేషనల్ స్టార్ అబ్జర్వేటరీ ఆఫ్ సైప్రస్, పోలండ్‌లోని ప్రఖ్యాత బస్ స్టేషన్, టర్కీలోని సోలార్ పవర్ ప్లాంట్ వంటి 220 ప్రాజెక్టులు అవార్డు కోసం పోటీపడ్డాయి. వాటన్నింటినీ తలదన్ని ఒక చిన్న పాఠశాల నెగ్గుకురావడం అసాధారణమని ఎఫ్‌జేసీ స్టూడియో అసోసియేట్ అలెస్సాండ్రో రోసీ అన్నారు. భవనంలో సమయాన్ని గడిపే పిల్లలే నిజమైన విజేతలని అభిప్రాయపడ్డారు. గతేడాది కూడా చైనాలోని ఓ బోర్డింగ్ స్కూల్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment