
మార్చి 21 నుంచి పైతరగతులు!
- ఏప్రిల్ 24 వరకు నిర్వహణ..
- పాఠశాల విద్య అకడమిక్ కేలండర్‌ను సిద్ధం చేసిన విద్యాశాఖ
- త్వరలో ప్రభుత్వ ఆమోదానికి ఫైలు..
- ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు
- సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 వరకు దసరా సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2017–18)లో అమలు చేయాల్సిన విద్యా కార్యక్రమాలతో పాఠశాల విద్యా శాఖ అకడమిక్ కేలండర్‌ను సిద్ధం చేసింది. దీనిపై త్వరలోనే ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకొని, అవసరమైతే పలు మార్పులు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించాలని నిర్ణయించింది. ముఖ్యంగా 2017–18 విద్యా సంవత్సరాన్ని మార్చి 21వ తేదీ నుంచే ప్రారంభించాలని అకడమిక్ కేలండర్‌లో వెల్లడించింది. ఇందులో భాగంగా పైతరగతుల బోధనను మార్చి 21 నుంచి చేపట్టి ఏప్రిల్ 23వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించింది.
ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను ఇవ్వనుంది. తిరిగి జూన్ 12వ తేదీ నుంచి తరగతుల నిర్వహణను కొనసాగించాలని పేర్కొంది. అలాగే దసరా సెలవులను సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు ఇవ్వనున్నట్లు తెలిపింది. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు 2017 డిసెంబర్ 23వ తేదీ నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనుంది. సంక్రాంతి సెలవులు 2018 జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు ఉండేలా చర్యలు చేపట్టింది. ఇక బడిబాట కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 21 నుంచి 28వ తేదీ వరకు ఒక దఫా, జూన్ 1వ తేదీ నుంచి 9 వరకు రెండో దఫా నిర్వహించాలని పేర్కొంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరిలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని తెలిపింది. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం మార్చి 21 నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వివరించింది.
అకడమిక్ కేలండర్‌లోని ప్రధానాంశాలు
పాఠశాలల వేళలు
► ఉన్నత పాఠశాలలు (6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు) ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (ఏడున్నర గంటలు) కొనసాగుతాయి.
► ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు (7.15 గంటలు) ఉంటాయి.
► ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు (7 గంటలపాటు) కొనసాగుతాయి.
పరీక్షల సమయం
► జూలై 15వ తేదీలోగా ఫార్మేటివ్–1 పరీక్షలు ఉంటాయి. ఫార్మేటివ్–2 పరీక్షలు సెప్టెంబర్ 19లోగా పూర్తి చేయాలి. సమ్మేటివ్–1 పరీక్షలు అక్టోబర్ 9 నుంచి 16వ తేదీ వరకు ఉంటాయి. ఫార్మేటివ్–3 పరీక్షలు నవంబర్ 30లోగా పూర్తి చేయాలి. ఫార్మేటివ్–4 పరీక్షలు 2018 జనవరి 31లోగా పూర్తి చేయాలి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్–2 పరీక్షలు 2018 మార్చి 7వ తేదీ నుంచి 14వ తేదీలోగా పూర్తి చేయాలి.
► పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను 2018 ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీలోగా పూర్తి చేయాలి (టెన్త్ వార్షిక పరీక్షలు మార్చి మొదటి వారంలో ఉంటే). ఒకవేళ టెన్త్ వార్షిక పరీక్షలు 2018 మార్చి మూడో వారంలో ఉంటే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6వ తేదీలోగా పూర్తి చేయాలి. 2018 జనవరి 31వ తేదీలోగా టెన్త్ సిలబస్‌ను మొత్తం పూర్తి చేయాలి. ఆ తరువాత వెనువెంటనే సిలబస్ రివిజన్ చేపట్టాలి.