ఎంపికైన 57మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో 40మంది బాలికలే
నూజివీడు, న్యూస్‌లైన్ : అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) నిర్వహించే పోటీల్లో ట్రిపుల్‌ఐటీ విద్యార్థినులు సత్తాచాటారు. అంతరిక్షాన్ని కూడా మానవ నివాసయోగ్యంగా మార్చాలనే లక్ష్యంతో నాసా ప్రతి ఏటా స్పేస్ సెటిల్‌మెంట్ డిజైన్ కాంటెస్టును నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా 2014లో చేపట్టిన పోటీలకు నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చెందిన విద్యార్థులు 29ప్రాజెక్టులు పంపగా, వాటిల్లో 18 ఎంపికయ్యాయి.
ఆ ప్రాజెక్టులకు సంబంధించిన 57మంది విద్యార్థులకు అమెరికా రావాల్సిందిగా నాసా ఆహ్వానాలు పంపింది. వీరిలో 40మంది బాలికలే. గతేడాది కూడా నాసా పోటీలకు 37మంది ఎంపికకాగా, వారిలో 29మంది బాలికలే ఉండడం గమనార్హం. 2012లో పది మంది ఎంపిక కాగా వారిలో ఏడుగురు విద్యార్థినులే. ట్రిపుల్‌ఐటీలో ఉన్న మొత్తం విద్యార్థుల్లో 51శాతం బాలురు ఉండగా, 49శాతం బాలికలు ఉన్నారు. అయినప్పటికీ పోటీల్లో మాత్రం బాలురు కంటే బాలికలే ముందుంటున్నారు.
నాసా పోటీ ముఖ్యోద్దేశం ఇదే..
జనాభాతోపాటు భూమిపై కాలుష్యం పెరగడం, వసతుల లేమి వంటి కారణాలతో భూతలంపై నివాసయోగ్యత రానురాను తగ్గిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయంగా అంతరిక్షంలో మానవ నివాస యోగ్యతపై ప్రాజెక్టులు పంపాలని నాసా ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తోంది.
దీనికి అనుగుణంగా అంతరిక్షంలో ఎలా నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ మానవ అవసరాలకు నీటిని ఎలా పొందాలి, విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేసుకోవాలి, వ్యర్థాలను అంతరిక్షంలో పోగుపడకుండా ఏం చేయాలి వంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తమ ఊహాశక్తికి పదునుపెట్టి ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. వీటిని నాసా శాస్త్రవేత్తలు పరిశీలించి విభాగాల వారీగా ఎంపికచేస్తున్నారు. ఎంపికైన విద్యార్థులు తమ ప్రాజెక్టులపై ప్రెజెంటేష్ ఇచ్చేందుకు అమెరికా రావాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ ప్రక్రియ ఏటా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 14నుంచి 18వ తేదీ వరకు అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లో నిర్వహించే 33వ అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సదస్సులో ఎంపికైన విద్యార్థులు తమ ప్రాజెక్టులను వివరించాల్సి ఉంది. దీంతో ఎంపికైన 57మంది వి ద్యార్థుల్లో సాధ్యమైనంత ఎక్కువ మందిని అమెరికా పంపేందుకు ట్రిపుల్‌ఐటీ అధికారులు యత్నిస్తున్నారు. వీరిలో ఇప్పటికే 17మంది పా స్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగి లిన వారితోనూ దరఖాస్తులు పెట్టిస్తున్నారు.
నాసా పోటీల్లో విద్యార్థినుల హవా
Published Sat, Apr 5 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM
Advertisement
Advertisement