ఇంగ్లిష్ మీడియం ప్రీప్రైమరీఏర్పాటుకు కసరత్తు
జిల్లాకు 10 నుంచి 20 ఏర్పాటు చేసే ఆలోచనలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఒంటిపూట బడులను అమలు చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ప్రస్తుత వేసవి ఎండలు, ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తోంది. వీలైతే ఈ నెల 16 నుంచి లేదా 21 నుంచి ఒంటిపూట బడులను ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒంటి పూట బడులను కొనసాగించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళన నోటీసులు కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి... అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోనూ ఒంటిపూట బడుల ప్రారంభంపై చర్చించారు. దీనిపై శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి, చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అలాగే తల్లిదండ్రుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రీప్రైమరీ విద్యపై ఆసక్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలుపై కసరత్తు చేస్తోంది. కడియం శ్రీహరి కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
ప్రతి జిల్లాలో 10 నుంచి 20 వరకు స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు పద్ధతిన ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చించినట్లు తెలి సింది. దీనిపై పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు విద్యా వార్షిక కేలండర్ అమలు, మార్చి 21 నుంచే 2016-17 విద్యా సంవత్సరం ప్రారంభం, ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపైనా కడియం సమీక్షించారు. సూర్యాపేటలో పరీక్షా పత్రాలు బయటకు రావడంపైనా చర్చించారు. శుక్రవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు.
ఒంటిపూట బడులపై నేడు నిర్ణయం
Published Fri, Mar 11 2016 12:26 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM
Advertisement
Advertisement