మాట తప్పని.. మడమ తిప్పని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాటలోనే నడుస్తానని, సమైక్యాంధ్ర కోసం దీక్షను ఎన్ని రోజులైనా కొనసాగిస్తానని అద్దంకి నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
అద్దంకి, న్యూస్‌లైన్ : మాట తప్పని.. మడమ తిప్పని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాటలోనే నడుస్తానని, సమైక్యాంధ్ర కోసం దీక్షను ఎన్ని రోజులైనా కొనసాగిస్తాన ని అద్దంకి నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ అన్నారు.సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారానికి మూడో రోజుకు రేరింది. స్థానిక వైద్యులు వచ్చి గొట్టిపాటికి వైద్య పరీక్షలు నిర్వహించి షుగర్ లెవల్స్ తగ్గాయని చెప్పారు.
గొట్టిపాటి మాట్లాడుతూ పార్టీ అభిమానుల నుంచి వస్తున్న ఆదరణను చూస్తే ఎన్ని రోజులైనా నిరాహార దీక్ష కొనసాగించగలననే నమ్మకం కలుగుతోందన్నారు. రాష్ట్రం ముక్కలవుతుంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ సహకరించిందని దుయ్యబట్టారు. ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు అత్మగౌరవ యాత్ర చేస్తారని ప్రశ్నించారు. నేటికీ చంద్రబాబు సమైక్యవాదో, విభజనవాదో తేల్చుకోలేకపోతున్నారన్నారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేస్తున్నారని గుర్తుచేశారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ సీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర కోసం 72 గంటల బంద్‌ను అద్దంకి నియోజకవర్గంలో విజయవంతం చేస్తామని గొట్టిపాటి చెప్పారు.