ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రకు జరిగే నష్టంపై జనానికి అవగాహన కల్పించేందుకు సీమాంధ్రలోని 600 మండల కేంద్రాల్లో జవవరి 3వ తేదీ నుంచి నెలరోజుల పాటు కళాభేరి నిర్వహించనున్నట్లు చెప్పారు. 13 కళాబృందాలు, 120 మంది కళాకారుల ద్వారా గ్రామస్థాయిలో కూడా కోలాటం, జానపద గేయాలు, నృత్య ప్రదర్శనలు, వీధినాటకాలు ప్రదర్శించి ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేపడతామన్నారు. స్థానిక సీవీఎన్ రీడింగ్‌రూంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి మాట్లాడారు.
సమైక్యాధ్ర కోసం సీమాంధ్రలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మూడు సెట్ల అఫిడవిట్లు పూర్తిచేసి స్పీకర్, రాష్ట్రపతి, సుప్రీంకోర్టుకు అందజేయాలని డిమాండ్ చేశారు. అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ర్ట విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సీమాంధ్రలోని కేంద్ర, రాష్ర్టమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
జనవరి 1లోపు మున్సిపాలిటీల్లో సమైక్య పరుగు...
జనవరి 1వ తేదీలోపు సీమాంధ్రలోని అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో సమైక్య పరుగు నిర్వహించాలని లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. జనవరి మొదటి వారంలో అన్ని జేఏసీల నేతృత్వంలో చలో అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో లోతుగా చర్చించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలపై పూర్తిస్థాయిలో చర్చించాలన్నారు. సమయం సరిపోకపోతే సమావేశాలను మరో 20 రోజులు పొడిగించాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు గోపిరెడ్డి ఓబులరెడ్డి, కాటా అంజిరెడ్డి, కంచర్ల రామయ్య, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, పీవీ నరసింహారెడ్డి, పమిడి సుబ్బరామయ్య, పి.ప్రకాష్, హర్షిణి రవికుమార్ పాల్గొన్నారు.
జనంలోకి సమైక్యాంధ్ర ఉద్యమం
Published Sat, Dec 21 2013 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement