ముక్కలు చేస్తే సహించం.. 57 రోజులుగా నిర్విరామ పోరు | Seemandhra Movement raises for 57days | Sakshi
Sakshi News home page

ముక్కలు చేస్తే సహించం.. 57 రోజులుగా నిర్విరామ పోరు

Published Thu, Sep 26 2013 3:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM

ముక్కలు చేస్తే సహించం.. 57 రోజులుగా నిర్విరామ పోరు

ముక్కలు చేస్తే సహించం.. 57 రోజులుగా నిర్విరామ పోరు

సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసేవరకూ ఉద్యమం ఆగేది లేదని సీమాంధ్ర ప్రజ తెగేసి చెబుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుజాతిని ముక్కలు చేస్తే సహించేది లేదని నినదిస్తోంది. వరుసగా 57వరోజూ బుధవారం సమైక్యవాదుల ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, వినూత్న ఆందోళనలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు దద్దరిల్లాయి. విజయవాడలో విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణానదిలో పడవలపై నిరసన ప్రదర్శన చేశారు. సమైక్యాంధ్ర జెండాలు పట్టుకుని పడవలపై పున్నమిఘాట్ వద్ద నీటిలో నిరసన తెలిపారు. పామర్రులో జేఏసీ నాయకులు ఆకులను వస్త్రాలుగా చుట్టుకుని నిరసన తెలిపారు. మైలవరంలో  జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు.
 
 గుంటూరులో ప్రైవేటు సిటీబస్సు ఆపరేటర్లు భారీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ ఉద్యోగులు ఇంటింటికీ తిరిగి సమైక్యాంధ్ర ఉద్యమంపై ప్రచారం చేశారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు నుంచి శ్రీకాకుళం వరకు వాహనయాత్ర ప్రారంభించారు. యర్రగొండపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మహిళా టీచర్లు ఇంటింటికీ వెళ్లి  ఉద్యమంలోకి రావాలని విజ్ఞప్తిచేశారు. విశాఖపట్నంలోని మద్దిపాలెం కూడలిలో జిల్లా స్కేటింగ్ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు స్కేటింగ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వాణిజ్యపన్నుల శాఖ సిబ్బంది బీచ్‌రోడ్డులో సాయంత్రం కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు కేంద్రమంత్రుల దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలెక్టరేట్ వద్ద మహిళా సంఘాలు బతుకమ్మ సంబరాలు నిర్వహించి తెలంగాణ  సంప్రదాయాలను తాము గౌరవిస్తున్నామని చాటారు. గోపాలపురం వద్ద జాతీయ రహదారిపై గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సమైక్య హోమం నిర్వహించారు.
 
  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మహిళా కళాకారులు రిలే దీక్షలు ప్రారంభించారు. ఇరగవరంలో టీచర్లు కార్లు తుడిచి నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టిలో గిరిజన సంప్రదాయ నృత్యాలతో నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా  భోగాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు ముళ్ళ కిరీటాలు ధరించి నిరసన తెలియజేశారు.  విశాలాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో అత్తారింటికి దారేది సినిమా వాల్‌పోస్టర్లను దహనం చేశారు. వైద్య ఉద్యోగుల ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. రాజంపేటలో ఆర్టీసీ కార్మికులు గడ్డితింటూ వినూత్న ర్యాలీ నిర్వహించారు. రైల్వేకోడూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో భిక్షాటన చేపట్టారు. తిరుపతిలో మున్సిపల్ ఉద్యోగులు చెవిలో కాలిఫ్లవర్ పెట్టుకుని నిరసన తెలిపారు. చిత్తూరులో పౌరసంబంధాలు, రిజిస్ట్రేషన్, మత్స్య, కార్మిక శాఖలకు చెందిన సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో ఉపాధ్యాయులు మోకాళ్లపై కుమారస్వామి తిప్పకొండకు (111 మెట్లు) ఎక్కి నిరసన తెలిపారు.
 
 సమాధులకు ఉపాధ్యాయుల మొర
 అనంతపురం జిల్లా రాయదుర్గంలో రాష్ట్ర విభజన వద్దంటూ  శ్మశానంలోని సమాధులకు మొరపెట్టుకున్నారు. ఉరవకొండలో విద్యార్థులు రోడ్డుపై పొర్లుదండాలు పెడుతూ నిరసన తెలిపారు. కర్నూలులో పంచాయతీరాజ్ ఉద్యోగులు  చెవిలో పూలు పెట్టుకొని రోడ్లు ఊడ్చారు. ఆదోనిలో ఉపాధ్యాయులు ఒంటి నిండా ఆకులు కప్పుకొని నిరసన వ్యక్తం చేశారు.
 
 మంత్రి సీఆర్ ఇంటికి టూలెట్ బోర్డు
 సాక్షి నెట్‌వర్క్: వైఎస్సార్ జిల్లా  కడపలో మంత్రి సి.రామచంద్రయ్య ఇంటిని ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల సమాఖ్య ఆధ్వర్యంలో సమైక్యవాదులు, విద్యార్థులు ముట్టడించి టు లెట్ బోర్డును అతికించారు. మంత్రి తోట నరసింహం తూర్పు గోదావరి జిల్లా  కోరుకొండ మీదుగా గోకవరం వెళుతుండగా కోరుకొండలో జేఏసీ నాయకులు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  
 
 దీక్షా శిబిరంలోనే మృతి
 నెల్లూరు: రాష్ట్ర విభజన చిచ్చు మరో రెండు నిం డు ప్రాణాల్ని బలిగొంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సీహెచ్ సోమశేఖర్‌రాజు (55)  సమైక్య దీక్షా శిబిరంలోనే ఛాతినొప్పితో కుప్పకూలి మృతిచెందారు. గూడూరులో నివాసం ఉండే ఆయన బుధవారం నెల్లూరుకు చేరుకుని స్థానిక బస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో కూర్చున్నారు. దినపత్రికలో సమైక్య ఉద్యమవార్తలు చదువుతూ తీవ్ర ఉద్వేగానికి గురై నేలకూలారు. వైద్యులు వచ్చేసరికే మృతిచెందారు.  రాజుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాజు సమ్మెకాలంలో గూడూరు నుంచి ప్రతిరోజూ నెల్లూరుకు వచ్చి ఉద్యమంలో పాల్గొనేవారని ఆర్టీసీ జేఏసీ నేతలు కన్నీటి పర్యంతమయ్యారు.
 
 గుండెపోటుతో మరో ఉద్యోగి మృతి
 కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని మదిరె గ్రామానికి చెందిన గ్రామ సేవకుడు త్యాగరాజు(55) బుధవారం విభజన కథనాలను టీవీలో వీక్షిస్తూ ఉద్వేగానికి లోనై గుండెపోటుతో మరణించాడు.
 
 చిన్నారి ‘సమైక్య’
 సీమాంధ్రవాసుల్లో సమైక్యాంధ్ర ఉద్యమ స్ఫూర్తి అణువణువునా నిండిందనడానికి నిదర్శనమిది. తమకు పుట్టిన ఆడపిల్లకు ‘సమైక్య’ అని పేరు పెట్టడం ద్వారా ఆ తల్లిదండ్రులు రాష్ట్రంగా ఒక్కటిగా ఉండాలన్న ఆకాంక్ష తమలో ఎంత ప్రబలంగా ఉందో చాటి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన కుసుమ ప్రవీణ్ అల్లవరం మండల వ్యవసాయ విస్తరణాధికారిగా పని చేస్తున్నారు. ఆయన భార్య ఉమాదేవి ఈ నెల 22న ఆడపిల్లకు జన్మనిచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న తరుణంలో జన్మించిన తమ పాపకు ‘సమైక్య’ అని నామకరణం చేస్తున్నట్టు బుధవారం ఆ దంపతులు చెప్పారు.  - న్యూస్‌లైన్, అల్లవరం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement