సీమాంధ్ర జిల్లాల్లో.. సమైక్య శపథం
సాక్షి నెట్‌వర్క్: సీమాంధ్ర జిల్లాల్లో ఇప్పుడు కోట్లాది గొంతుకలు ఒక్కటై మార్మోగిస్తున్న నినాదం సమైక్యాంధ్రప్రదేశ్. రాష్ట్రం ముక్కలు కాకుండా ఒక్కటిగానే ఉంచాలంటూ ప్రతిఒక్కరూ ఆశిస్తూ, స్వాశిస్తూ సమైక్యఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. వరుసగా 63వ రోజైన మంగళవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాలు ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లాయి. సమ్మెబాట పట్టిన ఆర్ అండ్ బీ అధికారులు, ఇరిగేషన్ ఇంజనీర్లు విజయవాడలో వేర్వేరుగా ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. ఒంగోలులో ఆటోలతో భారీర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదల కూరులో బ్రాహ్మణులు రాష్ట్ర విభజన జరగకూడదంటూ నడిరోడ్డుపై యజ్ఞయాగాదులు నిర్వహించారు.
గుంటూరులో ఇంటర్ బోర్డు ఆర్జేడీ కార్యాలయం ఎదుట అధ్యాపకులు నడిరోడ్డుపై నమూనా న్యాయస్థానం ఏర్పాటు చేసి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విభజన వాదులతో వాద ప్రతివాదాలు చేశారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు పట్టణంలో రజకులు ఒంటెద్దు బండ్లతో ర్యాలీ చేపట్టి చాకిరేవు నిర్వహించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్యమకారులు జోలెపట్టి భిక్షాటన చేశారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు కాకినాడ-పిఠాపురం రహదారిపై కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్, సోనియా, షిండే మాస్‌కలను గాడిదలకు కట్టి ఊరేగించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో భవన నిర్మాణ కార్మికులు తెలంగాణ- ఆంధ్రాకు అడ్డంగా గోడ కట్టి అనంతరం దాన్నిబద్దలు కొట్టి వినూత్న నిరసన తెలిపారు.
విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీలో విద్యార్థులు సోనియా, దిగ్విజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి శ్రీకాకుళం జిల్లా సుభద్రాపురం జంక్షన్ వరకు రెండు జిల్లాలను కలుపుతూ మహా మానవహారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నీలమణి దుర్గమ్మ అమ్మవారికి వేలాది మంది మహిళలు ముర్రాటలు సమర్పించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పూజలు చేశారు. రాజీనామా చేసి రండి అధికారపార్టీ నేతలు ఎక్కడ కనిపిస్తే అక్కడ సమైక్యవాదులు నిలదీస్తున్నారు. ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాలకు అనంతపురం జిల్లా గుంతకల్లులో సమైక్య సెగ తగిలింది. మునిసిపల్ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్న జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వారివురు దీక్షా శిబిరం వద్దకు వెళ్లగా జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముందు రాజీనామాలు చేసిన తరువాతే ఉద్యమంలో పాల్గొనాలని చెప్పారు.
కేంద్రమంత్రి పనబాకలకిష్మని కృష్ణాజిల్లా గుడివాడలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. తామంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పినా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. పోలీసులు జోక్యంచేసుకుని ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా పంపించివేశారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళంలోని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. ఆమె కార్యాలయంలో నుంచి బయటికొచ్చి, ప్రసుత తరుణంలో రాజీనామాలు అవసరంలేదని, తెలంగాణ బిల్లును అడ్డుకోవాలంటే పదవిలో ఉండాలని వివరించడంతో సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె తన క్యాంపు కార్యాలయంలోనికి వెళ్లిపోయారు. ఆగ్రహించిన ఆందోళనకారులు అక్కడే బైఠాయించి సుమారు మూడు గంటలసేపు నినాదాలు హోరెత్తించారు.
పులికాట్ పొలికేక
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో పులికాట్ పొలికేక పేరుతో భారీ సభ నిర్వహించారు. ఈ సభకు వేలాదిగా రైతులు తరలివచ్చారు. కోవూరులో చేపట్టిన రైతుగర్జనకు రైతులంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రైతులు ఊక బస్తాలతోర్యాలీ చేసి, అనంతరం ఊకను రోడ్డుపై పోసి నిప్పంటించి నిరసన తెలిపారు. సర్పవరంలో ఐదువేల మందికి పైగా గ్రామస్తులు సకలజన ఘోష పేరిట సమైక్య నినాదం వినిపించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో రైతు రణభేరిపేరిట నిరసన తెలిపారు. నర్సాపురంలో భవన నిర్మాణ కార్మికులు సమైక్య గర్జన సభ నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన సమైక్య ‘రణభేరి’కి సమైక్యవాదులు భారీగా తరలివచ్చారు. సభలో గజల్ శ్రీనివాస్ పాడిన గేయాలు సభికులకు ఉత్తేజాన్నిచ్చాయి.
కార్మికులతో ఆర్టీసీ ఎండీ చర్చలు విఫలం
బ్రహ్మోత్సవాలకు అదనపు బస్సులు నడపబోమన్న నేతలు
తిరుపతి, న్యూస్‌లైన్ : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఆ సంస్థ ఎండీ ఏకే ఖాన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంగళవారం ఆర్‌ఎం కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలతో ఆయన చర్చలు జరిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణం గా సీమాంధ్రలో ఇప్పటికే సంస్థ రూ.630 కోట్లు నష్టపోయిందని ఖాన్ నతెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు రానున్నారని, ప్రస్తుతం నడుస్తున్న 107 ఆర్టీసీ బస్సులకు అదనంగా 150 బస్సులు నƒ డపాలని సూచించారు.
జీతాలకన్నా జీవితాలు ముఖ్యమని, సమ్మెలో సడలింపు ఉండదని కార్మిక నాయకులు తేల్చి చెప్పారు. ఈ నెల 5 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, సమయం ఉంది కాబట్టి పునరాలోచించాలని చివరిగా ఖాన్ సూచించారు. దసరా అడ్వాన్‌సగా మూడు వేల రూపాయలు ఇప్పించాలని కార్మిక నేతలు కోరగా పరిశీలిస్తానన్నారు. అనంతరం ఆయన టీటీడీ ఈవోతో చర్చలు జరిపారు. కార్మిక నేతలతో మరోమారు చర్చలు జరుపుతామని తెలిపారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద రానున్న 120 కొత్త బస్సులను ఉపయోగించే అవకాశముందని పేర్కొన్నారు.